CNAP Rules: ఫోన్ రింగవుతుంటే చాలు.. ఎవరో గుర్తుతెలియని వ్యక్తుల నుంచి వచ్చే కాల్స్, ఫేక్ నంబర్లతో వేధించే సైబర్ కేటుగాళ్ల టెన్షన్ ఇకపై ఉండదు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం మొబైల్ యూజర్ల కోసం ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. నవంబర్ 1 నుంచి దేశవ్యాప్తంగా సరికొత్త టెలికాం నిబంధనలు అమల్లోకి రాబోతున్నాయి. ఇకపై మీ మొబైల్‌కు ఎవరు కాల్ చేసినా సరే.. వారి నంబర్ మీ ఫోన్లో సేవ్ లేకపోయినా, స్క్రీన్ మీద వారి ఒరిజినల్ పేరు నేరుగా డిస్ప్లే అయిపోతుంది. టెలికాం శాఖ (DoT) తీసుకొచ్చిన ‘కాలర్ నేమ్ ప్రజెంటేషన్’ (CNAP) సిస్టమ్‌తో ఇక ట్రూకాలర్ లాంటి థర్డ్ పార్టీ యాప్స్ వాడాల్సిన పనే లేకుండా పోతోంది.
ఇన్నాళ్లూ తెలియని నంబర్ల వివరాలు తెలుసుకోవడానికి చాలామంది ట్రూకాలర్ లాంటి యాప్‌లను నమ్ముకున్నారు. కానీ వాటిల్లో ఎవరికి నచ్చిన ఫేక్ పేర్లు వాళ్లు మార్చుకునే అవకాశం ఉండటంతో మోసగాళ్లు సులువుగా తప్పించుకునేవారు. అయితే నవంబర్ 1 నుంచి అమలయ్యే రూల్స్ ముందు అలాంటి గారడీలు ఏవీ పనిచేయవు. ఒక వ్యక్తి సిమ్ కార్డు తీసుకునే సమయంలో ఇచ్చిన ఆధార్, కేవైసీ (KYC) రికార్డుల్లో ఏ పేరైతే నమోదై ఉంటుందో.. సరిగ్గా అదే అసలు పేరు కాల్ వచ్చినప్పుడు మొబైల్ స్క్రీన్‌పై పడుతుంది. టెలికాం కంపెనీల అధికారిక సర్వర్ల నుంచే ఈ వివరాలు నేరుగా వస్తాయి కాబట్టి మార్చడానికి వీలుండదు.
టెలికాం రూల్స్ ప్రకారం.. ఈ కొత్త ఫీచర్ నవంబర్ 1 నుంచి తొలుత 4G, 5G యూజర్లకు మాత్రమే అందుబాటులోకి రానుంది. పాత 2G, 3G నెట్‌వర్క్‌లను వాడుతున్న వారికి దశలవారీగా ఈ సేవలను విస్తరించనున్నారు. దేశంలో ఎక్కడి నుంచి కాల్ వచ్చినా.. అవతలి వ్యక్తి అసలు గుర్తింపు స్క్రీన్ మీద తేలిపోతుంది. ఇటీవల అంతర్జాతీయ నంబర్లతో సైబర్ మోసాలు విపరీతంగా పెరిగిపోయాయి. దీనికి అడ్డుకట్ట వేసేందుకు కూడా కేంద్రం పక్కా ప్లాన్ చేసింది. ఒకవేళ కాల్ భారత్ బయటి నుంచి వస్తే, మొబైల్ స్క్రీన్ మీద నేరుగా “అంతర్జాతీయ కాల్స్” అని మెరుస్తుంది. దీంతో ఫేక్ కాలర్లను ముందే గుర్తించి యూజర్లు జాగ్రత్తపడొచ్చు. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంతో స్పామ్ కాల్స్, సైబర్ దందాలకు దాదాపు తెరపడినట్లేనని టెలికాం రంగ నిపుణులు చెబుతున్నారు.

