Ceiling Fan Power Consumption : కరెంట్ బిల్లు పెరిగిందంటే అందరి చూపు ముందుగా ఏసీ మీదకే వెళ్తుంది. కూలర్ ఎక్కువసేపు నడిచిందేమో అని అనుమానం వస్తుంది. కానీ ఇంట్లో ఎప్పుడూ తిరుగుతూ ఉండే సీలింగ్ ఫ్యాన్ కూడా నెలాఖరుకు బిల్లుపై తన ముద్ర వేస్తుందనే విషయం చాలా మందికి తెలియదు. ముఖ్యంగా వేసవి కాలంలో పగలు రాత్రి తేడా లేకుండా ఫ్యాన్లు నడుస్తుంటే వాటి విద్యుత్ వినియోగం కూడా గణనీయంగా పెరుగుతుంది. అందుకే ఒక సాధారణ సీలింగ్ ఫ్యాన్ నెలకు ఎంత కరెంట్ ఖర్చు చేస్తుంది, దాని వల్ల బిల్లుపై ఎంత ప్రభావం పడుతుంది అనే విషయాన్ని తెలుసుకోవడం అవసరం.
మన ఇళ్లలో సాధారణంగా ఉపయోగించే సీలింగ్ ఫ్యాన్ల సామర్థ్యం 50 వాట్ల నుంచి 80 వాట్ల వరకు ఉంటుంది. ఉదాహరణకు ఒక ఫ్యాన్ 70 వాట్ల సామర్థ్యంతో ఉందని అనుకుందాం. వేసవిలో అది రోజుకు సుమారు 15 గంటల పాటు నడిస్తే, రోజుకు దాదాపు 1,050 వాట్ల విద్యుత్‌ను వినియోగిస్తుంది. అంటే సుమారు 1.05 యూనిట్ల కరెంట్ ఖర్చవుతుంది. ఇదే లెక్కను 30 రోజుల పాటు గణిస్తే, ఒక్క ఫ్యాన్ నెలకు సుమారు 31.5 యూనిట్ల విద్యుత్‌ను వినియోగించినట్టవుతుంది.
భారతదేశంలో విద్యుత్ ఛార్జీలు రాష్ట్రానికో రాష్ట్రం, నగరానికో నగరం మారుతూ ఉంటాయి. అయినప్పటికీ సగటున ఒక యూనిట్ ధర 7 రూపాయలుగా తీసుకుంటే, ఒక్క ఫ్యాన్ నడపడానికి నెలకు దాదాపు 220 రూపాయల వరకు ఖర్చవుతుంది. ఇంట్లో మూడు లేదా నాలుగు ఫ్యాన్లు ఇదే తరహాలో నడుస్తుంటే, కేవలం ఫ్యాన్ల వల్లే నెలకు 600 నుంచి 800 రూపాయల వరకు కరెంట్ బిల్లు వచ్చే అవకాశం ఉంటుంది.
అయితే ఈ ఖర్చును గణనీయంగా తగ్గించే మార్గం కూడా అందుబాటులో ఉంది. ప్రస్తుతం మార్కెట్లో బీఎల్‌డీసీ టెక్నాలజీతో పనిచేసే ఆధునిక ఫ్యాన్లు లభిస్తున్నాయి. సంప్రదాయ ఫ్యాన్లు 70 నుంచి 80 వాట్ల వరకు విద్యుత్ వినియోగిస్తే, బీఎల్‌డీసీ ఫ్యాన్లు కేవలం 28 నుంచి 35 వాట్లతోనే సమాన స్థాయిలో గాలి అందిస్తాయి. దీంతో విద్యుత్ వినియోగం సగానికి పైగా తగ్గే అవకాశం ఉంటుంది.
ఇంట్లో ఉన్న పాత ఫ్యాన్లను బీఎల్‌డీసీ మోడళ్లతో మార్చుకుంటే నెలవారీ కరెంట్ బిల్లులో స్పష్టమైన తగ్గుదల కనిపిస్తుంది. కొత్త ఫ్యాన్ల కొనుగోలు కోసం చేసే ఖర్చు కూడా కొద్ది నెలల్లోనే విద్యుత్ ఆదా రూపంలో తిరిగి వచ్చే అవకాశం ఉంటుంది.
ఇక కొన్ని చిన్న అలవాట్లు మార్చుకోవడం ద్వారా కూడా ఫ్యాన్ల వల్ల అయ్యే ఖర్చును తగ్గించుకోవచ్చు. గదిలో ఎవరూ లేనప్పుడు ఫ్యాన్‌ను ఆఫ్ చేయడం చాలా ముఖ్యమైన విషయం. కొద్దిసేపే కదా అని ఫ్యాన్‌ను అలాగే వదిలేయడం చాలా మందికి అలవాటుగా ఉంటుంది. కానీ ఇలాంటి చిన్న నిర్లక్ష్యాలే నెలాఖరుకు బిల్లును పెంచే కారణమవుతాయి.
అలాగే ఫ్యాన్ రెగ్యులేటర్ కూడా విద్యుత్ వినియోగంపై ప్రభావం చూపుతుంది. పాతకాలం నాటి పెద్ద రెగ్యులేటర్లు విద్యుత్‌ను ఆదా చేయవు. అవి కేవలం వేగాన్ని తగ్గించేందుకు అదనపు విద్యుత్‌ను వేడి రూపంలో వృథా చేస్తాయి. అందుకే ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఎలక్ట్రానిక్ రెగ్యులేటర్లను ఉపయోగించడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. సరైన ఫ్యాన్ ఎంపికతో పాటు చిన్న చిన్న జాగ్రత్తలు పాటిస్తే వేసవిలో కూడా కరెంట్ బిల్లుపై భారాన్ని గణనీయంగా తగ్గించుకోవచ్చు.
