President of India : స్వాతంత్ర్య అమృతోత్సవాల సందర్భంగా గిరిజన మహిళ దేశ ప్రథమ మహిళ బాధ్యతలు స్వీకరించడం.. రాజ్యాంగ స్ఫూర్తిని చాటిచెబుతోంది. ముర్ముకు ముందు దళితుడైన కోవింద్ ప్రెసిడెంట్ అయినా.. రెండు దశాబ్దాల క్రితం మైనార్టీ వర్గానికి చెందిన కలాం రాష్ట్రపతి అయినా.. అది మన ప్రజాస్వామ్య వైవిధ్యానికి నిదర్శనం. అణాగారిన వర్గాలకు అత్యున్నత పదవులు దక్కడం మంచి పరిణామమే అయినా.. ఆ అవకాశాల్ని మనం సద్వినియోగం చేసుకున్నామా అనే ప్రశ్న మాత్రం తొలుస్తూనే ఉంటుంది.
భారత 15వ రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము ప్రమాణ స్వీకారం చేశారు. ముర్ముకు పదవితో ఆదివాసీల గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అతిసామాన్యమైన నేపథ్యం ఉన్న ముర్ము.. ప్రథమ పౌరురాలిగా బాధ్యతలు తీసుకోవడం.. దేశ ప్రజాస్వామ్యానికి మరింత మన్నన దక్కే సందర్భం.
స్వాతంత్య్ర స్వర్ణోత్సవ వేళ ఆదివాసీల పోరాటాలకు తగిన గుర్తింపు దక్కేలా.. రాష్ట్రపతి ఎన్నికల్లో ద్రౌపది ముర్ము విజయం సాధించారు. ముర్ము సంతాల్ గిరిజన తెగకు చెందినవారు. ఈ సందర్భంగా సంతాల్ ల తిరుగుబాటు నేపథ్యాన్ని ఒకసారి గుర్తు చేసుకోవాలి. ప్రస్తుత జార్ఖండ్ తూర్పు భారతదేశంలోని బ్రిటీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ, సంతాల్ జమీందారీ వ్యవస్థ రెండింటికి వ్యతిరేకంగా తిరుగుబాటు జరిగింది. అది1855, జూన్ 30న ప్రారంభమై1856, జనవరి 3 వరకు కొనసాగింది. ఈ తిరుగుబాటుకు తన వంశానికి చెందిన నలుగురు ముర్ము సోదరులు సిద్ధూ ముర్ము, కన్హూ ముర్ము, చంద్ ముర్ము, బైరవ్ ముర్ములు నాయకత్వం వహించారు. ఆనాటి ఈస్టిండియా కంపెనీపై జరిగిన సాయుధ పోరాటంలో అసువులు బాసిన పదివేల మంది ఆదివాసీలకు ఇది ఘన నివాళి. ఆనాటి చరిత్ర ప్రకారం సంతాలుల తిరుగుబాటుకు నజరానాగా ముర్ముకు ఈ అవకాశం దక్కిందని భావించవచ్చు.
సాధారణ పరిస్థితుల్లో గిరిజనులకు అలాంటి అవకాశాలే రావు. వారిని జనజీవన స్రవంతికి దూరంగానే ఉంచుతున్నారు. అందుకేనేమో ద్రౌపది ముర్ముకు అవకాశం రావడానికి ఏడు దశాబ్దాలు పట్టింది. ఈ క్రమంలో గిరిజనులు, ఎస్సీలకు ప్రధానమంత్రి లాంటి ఉన్నత పదవులు దక్కాల్సి ఉంది. దళిత పక్షపాతులమనే ముద్ర కోసం కె.ఆర్. నారాయణన్ ను కాంగ్రెస్ తెస్తే, మైనారిటీలకు అనుకూలమనే పేరు కోసం అబ్దుల్ కలామ్ ను వాజ్ పాయ్ హయాంలో ఎన్డీఏ తెర పైకి తెచ్చిందనే విమర్శలు లేకపోలేదు. అంత మాత్రాన మేధావుల సమర్థతను తక్కువగా చూడలేం. ద్రౌపది అభ్యర్థిత్వాన్ని సైతం ఆ కోణంలోనే అర్థం చేసుకోక తప్పదు. అణగారిన వర్గాలను అక్కున చేర్చుకొని, పునాదిని విస్తరించుకొనే క్రమంలో క్రితంసారి 2017లో రామ్‌నాథ్ కోవిందు, ఇప్పుడు ద్రౌపదీ ఎంపిక విషయంలో చేసిన ప్రయత్నం హర్షించదగినది. ద్రౌపది లాంటి వారి కథ సమాజానికి స్ఫూర్తినిచ్చేదిగా ఉందనడంలో సందేహం లేదు.
తొలి ఆదివాసీ రాష్ట్రపతిగా, ప్రతిభా పాటిల్ తర్వాత రెండో మహిళా రాష్ట్రపతిగా ముర్ము రికార్డులోకి ఎక్కారు. అంతేగాకుండా ఆదివాసీలే ఈ దేశంలో తొలి భారతీయులు అని చెప్పడానికి సాక్ష్యం ముర్ము ఆదివాసీలలో కాబోయే తొలి రాష్ట్రపతి మాత్రమే గాక ఆదివాసీలలోనే ఈదేశ తొలి ప్రథమ పౌరురాలని నిరూపించారు. ముర్ము ఎన్నికతో దేశంలో ఆదివాసీ చట్టాలు గ్రామ స్థాయిలో సంపూర్ణ అమలుకు హామీ దొరకాలి. తవ్వకాల పేరుతో అడవి మీద జరుగుతున్న విధ్వంసం ఆగాలి. అడవిలో ఆయుధాల పాలనతో జరుగుతున్న హింస, అణచివేత, దౌర్జన్యం ఆగాలి.అడవి బిడ్డలకు వారి హక్కులపై భరోసా దక్కాలి. గిరిజనులు ఇప్పుడు ఎదుర్కొంటున్న అటవీ హక్కుల సమస్యకు శాశ్వత పరిష్కారం దొరుకుతుందని ఆశిద్దాం.
అట్టడుగు స్థాయి నుంచి దేశ ప్రథమ పౌరురాలు కాబోతున్న ద్రౌపదీ ప్రస్థానం ఆసక్తికరం. ఒడిశాలో మారుమూల మయూర్ భంజ్ జిల్లాకు చెందిన ఆమె రాజకీయాల్లోకి రాక ముందు గిరిజన ఉద్యమకారిణిగా ఓ అగ్గిబరాటా. ఆదివాసీల స్వతంత్రత కోసం ఆధిపత్య వర్గాలను ఎదిరించిన ధీరవనిత. నీటి పారుదల శాఖలో క్లర్క్ గా చేరిన ఆమె, తరవాత టీచరుగా పనిచేశారు. రాజకీయాల్లోకి వచ్చిన తొలుత కౌన్సిలర్ గా, రెండు సార్లు ఎమ్మెల్యేగా పనిచేస్తున్న కాలంలో ఆమె 2002లో ఉత్తమ ఎమ్మెల్యేగా పేరు గడించారు. ఆమె నవీన్ పట్నాయక్ బీజేపీ కూటమి సర్కారులో మంత్రిగా కూడా అనేక విభాగాలను సమర్థంగా నిర్వహించడం విశేషం. 2015 లో జార్ఖండ్ గవర్నర్ గా పనిచేసిన ఈ సంతాల్ వనిత మేధావి తత్వానికి కొదవ లేదు. అత్యున్నత పదవికి అభ్యర్థినిగా ఎంపికలో ద్రౌపది సామాజిక నేపథ్యంతో పాటు సమర్థతను కూడా గుర్తించారు. ఉత్తర, దక్షిణ భారతం నుంచే రాష్ట్రపతులు ఎన్నికవుతూ వస్తున్న క్రమంలో.. దేశంలో తూర్పు ప్రాంతం నుంచి గిరిజన మహిళకు అవకాశం ఇవ్వడం అరుదైన అవకాశంగానే భావించాలి.
ద్రౌపదికి ప్రథమ మహిళ పదవితో ఆదివాసీల జీవితాలు మారకపోయినా.. కచ్చితంగా వారికి కావల్సినంత స్ఫూర్తి దొరుకుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. అట్టడుగు వర్గాలు, అణగారిన వర్గాలకు అవకాశాలు రావనే భావనతో ఉన్నవాళ్లందరికీ ద్రౌపది ప్రమాణస్వీకారం కచ్చితంగా గుర్తుండిపోతుంది. వారిలో ఆత్మన్యూనత భావం పోయి.. మనం కూడా అత్యున్నత స్థాయికి ఎదగడానికి రాజ్యాంగపరంగా ఎలాంటి అడ్డంకులు లేవనే విషయం స్పష్టమౌతుంది. ేే
ప్రజాస్వామ్య విలువలను, పౌర హక్కులను పరిరక్షించి సమాజ పురోభివృద్ధికి కృషి చేసేవారే సరైన పాలకులౌవుతారు. రాజ్యాంగ పరిరక్షణ బాధ్యతలు ఉన్న రాష్ట్రపతి పీఠానికి ప్రత్యేక విశిష్టతలూ, విశేషాధికారాలూ ఉన్నాయి. ప్రెసిడెంట్ పదవిని ఓ వర్గానికి పరిమితమైనదానిగా చూడటం, వాదించడమే తప్పవుతుంది. ఏ వర్గానికి చెందిన వ్యక్తి అయినా.. భారత రాష్ట్రపతిగా సేవలందిస్తారే కానీ.. సదరు వర్గానికి ప్రతినిధిగా ఉండాలనడం భావ్యం కాదు.
స్వాతంత్య్రం అనంతరం జన్మించి రాష్ట్రపతి పీఠాన్ని అధిష్టించిన తొలి వ్యక్తిగా, తొలి ఆదివాసీ మహిళగా, రెండో మహిళగా పలు రికార్డులు ద్రౌపది ముర్ము సొంతమయ్యాయి. దేశంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా.. అణగారిన ఆదివాసీ తెగల నుంచి అత్యున్నత రాష్ట్రపతి పీఠం అధిష్టించే స్థాయికి ఎదిగిన ముర్ముపై ఆయా తెగల ప్రజల్లోనూ, సామాన్య ప్రజల్లోనూ అనేక ఆశలు, ఆకాంక్షలు ఉండటం సహజం. అయితే రాష్ట్రపతి పదవిలో ఉన్న వ్యక్తి ఓ వర్గానికి ప్రతినిధిగా పనిచేయాలని కోరుకోవడం కూడా సమంజసం కాదు. రాష్ట్రపతి లాంటి పదవులు సింబాలిక్ పోస్టులే కానీ.. సామాజిక న్యాయంతో ముడిపెట్టి చూడాల్సిన పనిలేదు.
రాష్ట్రపతులుగా అణగారిన వర్గాలకు అవకాశం దక్కాలని కోరుకోవడం తప్పు కాదు కానీ.. ప్రథమపౌరులు ఆయా వర్గాల అభ్యున్నతి కోసం మాత్రమే పనిచేయాలని కోరుకోవడం సరైన పని కాదు. భారత రాష్ట్రపతిగా దేశంలో వివిద వర్గాల ప్రజలకు సేవలు చేయాల్సిన బాధ్యత వారిపై ఉంటుంది. వారి ప్రస్థానాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలే కానీ.. వారి పదవులను అడ్డం పెట్టుకుని అనుచిత లబ్ధి ఆశించడం, చేయాలనుకోవడం ఏదీ కరెక్ట్ కాదు. మన దేశంలో కావల్సినంత సాంస్కృతిక వైవిధ్యం ఉంది. దాన్ని పరిరక్షించాలని రాజ్యాంగం నిర్దేశించింది. అందులో భాగంగానే వివిధ వర్గాల వారికి పదవులు దక్కుతాయి. ఆలస్యమైనా కచ్చితంగా అందరికీ అవకాశాలు రావడం మన ప్రజాస్వామ్యం గొప్పతనం.
రాష్ట్రపతి విధులు, బాధ్యతలేంటో రాజ్యాంగం నిర్దేశించింది. ఆ ప్రమాణాల మేరకు పనిచేస్తే.. సహజంగానే అందరికీ న్యాయం జరుగుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. రాష్ట్రపతి పదవికి ఉన్న అత్యున్నత గౌరవాన్ని కాపాడటం అందరి బాధ్యత అనే సంగతి గుర్తుంచుకోవాలి. దేశ ప్రజలందరికీ భరోసా ఇవ్వాల్సిన ప్రెసిడెంట్ కొందరికి మాత్రమే అనే భావనే తప్పు. రాష్ట్రపతి పదవిలో ఎవరున్నా.. దేశ ప్రజలందరికీ ప్రథమ పౌరుడే అనే సంగతి గుర్తించాలి. రాష్ట్రపతి అంటే హుందాతనానికి మరోపేరు. అవసరమైతే ప్రభుత్వ నిర్ణయాల్ని కూడా రివర్స్ చేసే అధికారం ప్రథమ పౌరుడికి ఉంటుంది. రాజ్యాంగంలో ప్రెసిడెంట్ పదవిని అత్యున్నతంగా తీర్చిదిద్దారు. అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో వివిధ వర్గాల ప్రజలకు ఉండే అవసరాలను బేరీజు వేసుకుని కొన్ని ప్రత్యేకాధికారాలు ఇచ్చారు. వాటిని ఎలా ఉపయోగస్తారనేది రాష్ట్రపతి విచక్షణ మీద ఆధారపడి ఉంటుంది.
సాధారణ రాజకీయ పదవులకు, రాష్ట్రపతి పదవికి చాలా తేడా ఉంది. మిగతావాళ్లంతా రాజ్యాంగాన్ని అనుసరించి పనిచేస్తే.. ఆ రాజ్యాంగాన్నే పరిరక్షించేది రాష్ట్రపతి. అందుకే రాష్ట్రపతి పదవి అత్యున్నతమైంది. దేశ అత్యున్నత పదవిలో ఉండేవాళ్లు ఎవరైనా వర్గాల్లాంటి సంకుచిత ఆలోచనలు చేసే పరిస్థితి ఉండదు. ఈ విషయాన్ని మొదట అర్థం చేసుకోవాలి. అసలు రాష్ట్రపతి విధులేంటి.. మనం ఏం ఆశిస్తున్నాం అనేది చాలా ముఖ్యం. రాష్ట్రపతి ప్రభుత్వాలకు సూచనలు చేస్తారు కానీ.. నేరుగా పాలనలో జోక్యం చేసుకోరనేది ప్రాథమిక సూత్రం. ఈ విషయం తెలియక చాలా మంది రాష్ట్రపతి పదవిని కూడా మామూలు పదవి కిందే లెక్కేస్తున్నారు. ఇక్కడే తేడా కొడుతోంది. రాజ్యాంగ నిర్మాతల అత్యున్నతమైన ఆలోచనలు, ఆదర్శాలకు నిలువుటద్దంలా పనిచేయాల్సిన బాధ్యత రాష్ట్రపతికి ఉంటుంది. రాజకీయాలకు అతీతంగా, కులం, మతం, ప్రాంతం గురించి ఆలోచించకుండా.. మొత్తం దేశాన్ని పరిగణనలోకి తీసుకుని నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. ఓ రకంగా చెప్పాలంటే రాష్ట్రపతి పదవి కత్తిమీద సాము లాంటిది. చాలా జాగ్రత్తగా బాధ్యతలు నిర్వర్తించాల్సి ఉంటుంది.
రాష్ట్రపతి అంటే, రాజ్యాంగ పరిరక్షకుడు అని కొందరు నిరూపించారు. విలక్షణ పనితీరుతో రాష్ట్రపతి భవన్ ను, ప్రజాభవన్ గా మార్చిన వారెందరో. మరికొందరు రబ్బరుస్టాంపుగా చరిత్రలో మిగిలిపోయారు. రైసినా హిల్స్ లో ఎవరు, ఎలాంటి పాత్ర పోషించారు? సంచలన నిర్ణయాలేంటి? వివాదాల రగడలేంటి?
భారత రాష్ట్రపతి. సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యమైన భారత దేశానికి అధినేత. దేశ ప్రథమ పౌరుడు. సర్వ సైన్యాధ్యక్షుడు. పార్లమెంటు ఉభయ సభలను రాష్ట్రపతి సమావేశపరుస్తారు. ప్రభుత్వాధినేత అయిన ప్రధానమంత్రిని నియమించేది ప్రెసిడెంటే. దేశ అత్యున్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తిని, ఇతర న్యాయమూర్తులను అపాయింట్ చేసేది కూడా రాష్ట్రపతే. కార్యనిర్వాహక అధికారాలన్నీ ప్రభుత్వాధినేత అయిన ప్రధానమంత్రివే అయినా, రాష్ట్రపతి రాజముద్ర లేనిదే ఏ బిల్లూ చట్టం కాదు. రాష్ట్రపతి పదవి అలంకార ప్రాయమైనా, అత్యంత ప్రాముఖ్యమైనది. ప్రజాస్వామ్య సంక్షోభ సమయంలో కీలక భూమిక పోషించేది. రాజ్యాంగాన్ని పరిరక్షించే బ్రుహత్తర బాధ్యత కలిగిన పదవి రాష్ట్రపతి పదవి. అలాంటి దేశ అత్యున్నత పీఠాన్ని ఇప్పటి వరకు 14మంది అధిరోహించారు. ఎవరి ప్రత్యేకత వారిదే. వారివారి హయాంలో కొన్ని కీలక ఘటనలు చరిత్రలో నిలిచిపోయాయి.
డాక్టర్ బాబూ రాజేంద్ర ప్రసాద్. భారత ప్రథమ రాష్ట్రపతిగా చరిత్రకెక్కారు. ప్రెసిడెంట్ గా అత్యధిక సంవత్సరాలు చేసింది రాజేంద్రప్రసాదే. బీహార్ రాష్ట్రానికి నాయకుడు. రెండు పర్యాయాలు రాష్ట్రపతిగా బాధ్యతలు నిర్వర్తించారు. 1952 మే 13 నుంచి 1957 మే వరకు తొలి టర్మ్, అలాగే 1957 మే 13 నుంచి 1962 మే 13 వరకు రెండో పర్యాయం చేశారు. రబ్బరుస్టాంపులా వ్యవహరించని రాజేంద్రప్రసాద్, తనదైన శైలిలో, పదవికే వన్నెతెచ్చారు. 1951లో జవహర్ లాల్ నెహ్రూ ప్రభుత్వం, హిందూ కోడ్ బిల్లుకు ఆమోదంకు పంపితే, దాన్ని సున్నితంగా వెనక్కి పంపారు. సవరణలు చెయ్యాల్సిందేనని పట్టుబట్టారు. రాజ్యాంగ స్ఫూర్తికి కట్టుబడిన బాబూ రాజేంద్ర ప్రసాద్, ఎక్కువ పర్యాయాలు సుప్రీంకోర్టు సలహా తీసుకున్న రాష్ట్రపతిగా చరిత్రలో నిలిచారు. 1962లో భారతరత్న పురస్కారం ఆయనను వరించింది.
రాష్ట్రపతి పదవికే వన్నెతెచ్చిన ప్రముఖుల్లో డాక్టర్ సర్వేపల్లి రాధాక్రుష్ణన్ ఒకరు. భారత రెండో రాష్ట్రపతి సర్వేపల్లి. ఉపాధ్యాయుడు, తత్త్వవేత్త. ఈయన పదవీకాలం 13 మే 1962 నుంచి 13 మే 1967 వరకు. మద్రాసు నుంచి ఏపీ విభజన జరగకముందు, మద్రాసు రాష్ట్రానికి చెందిన సర్వేపల్లి రాధాక్రుష్ణన్, విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ కు చెందినవారయ్యారు. రాష్ట్రపతి పదవి అంటే అలంకారప్రాయం కాదని నిరూపించారు సర్వేపల్లి. చైనా యుద్ధం తర్వాత, రక్షణ మంత్రి కృష్ణమీనన్‌ను పదవి నుంచి తొలగించమని ప్రభుత్వంపై ఒత్తిడి తేవడం, అప్పట్లో చర్చనీయాంశమైంది.
జాకీర్ హుస్సేన్. తొలి ముస్లిం రాష్ట్రపతి. తొలి ముస్లిం ఉపరాష్ట్రపతి కూడా. పదవీలో ఉండగా మరణించిన తొలి రాష్ట్రపతి జాకీర్ హుస్సేన్. 1967 మే13 నుంచి, 1969 మే 3 వరకు ఆయన పదవిలో వున్నారు.
వరాహగిరి వెంకటగిరి. వి.వి.గిరిగా ప్రసిద్దిచెందిన రాష్ట్రపతి. రాష్ట్రపతి భవన్ కేవలం, ప్రభుత్వ అనుకూల విధానాలకు ఆమోదముద్ర వేసే నిలయం కాదని నిరూపించారు. స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలిచిన వి.వి.గిరి…సంచలన నిర్ణయాలతో చరిత్రకెక్కారు. ప్రెసిడెంట్ గా తన ఎన్నిక విషయంలో, తలెత్తిన వివాదంపై, స్వయంగా సుప్రీంకోర్టుకు హాజరై తన వాదన వినిపించారు. ప్రభుత్వంలో పెరుగుతున్న అవినీతి గురించి బహిరంగంగా మాట్లాడిన రాష్ట్రపతి కూడా వివి గిరినే. పార్లమెంటు ఉభయ సభలు ఆమోదించిన కార్మిక బిల్లుపై తన అభ్యంతరాలను తెలియజేస్తూ వెనక్కి తిప్పి పంపారు వివి గిరి. ఒడిషాకు చెందిన గిరి, ట్రేడ్ యూనియన్ ఉద్యమాలతో సంబంధం కలిగిన లీడర్ కూడా. ఈయన హయాంలోనే బ్యాంకుల జాతీయీకరణ జరిగింది. 1969 మే 3 నుంచి 1969 జులై 20 వరకు తాత్కాలిక ప్రెసిడెంట్ గా చేసిన గిరి, 24 ఆగస్టు 1969 నుంచి 24 ఆగస్టు 1974 వరకు పూర్తిస్థాయిలో రాష్ట్రపతిగా చేశారు.
ఫక్రుద్దీన్ అలీ అహ్మద్. ఈయన రాష్ట్రపతిగా వున్నప్పుడే, అత్యంత వివాదాస్ప నిర్ణయాలు అమల్లోకి వచ్చాయి. రాష్ట్రపతి రబ్బరు స్టాంపు అనే ముద్ర, ఈయన హయాం నుంచే మొదలైంది. 1974 ఆగస్టు 24 నుంచి 1977 ఫిబ్రవరి 11 వరకు ప్రెసిడెంట్ గా చేశారు. ఇందిరా గాంధీ ప్రధానిగా వున్నప్పుడు, లెక్కకు మించిన ఆర్డినెన్స్ లు జారీ చేసి, విమర్శలు ఎదుర్కొన్నారు. అన్నింటికీ మించి ప్రధాని ఇందిర సలహా మేరకు 1975లో దేశంలో ఎమర్జెన్సీ విధించడం, అత్యంత వివాదాస్పదమైంది.
నీలం సంజీవరెడ్డి. ఆంధ్రప్రదేశ్ కు చెందిన నీలం సంజీవరెడ్డి, తొలి తెలుగు రాష్ట్రపతి. ఏకగ్రీవంగా ఎన్నికైన మొదటి ప్రెసిడెంట్ కూడా ఆయనే. ఆంధ్రప్రదేశ్ కు సీఎంగానూ, స్పీకర్ గానూ వ్యవహరించిన సంజీవరెడ్డి, ఉపరాష్ట్రపతి పదవి చేపట్టకుండానే రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు. అయితే, దేశంలో మూడో జాతీయ అత్యవసర పరిస్థితి, నీలంసంజీవరెడ్డి హయాంలో విధించారు.
జ్ఞాని జైల్‌సింగ్. తొలి సిక్కు రాష్ట్రపతి. పంజాబ్ కు చెందిన జైల్ సింగ్, 1982 జులై 25 నుంచి 1987 జులై 25 వరకు రాష్ట్రపతిగా వ్యవహరించారు. స్వర్ణ దేవాలయంలో ఆపరేషన్ బ్లూ స్టార్ అనే సైనిక చర్య, జైల్ సింగ్ హయాంలోనే జరిగింది. వివాదం రాజేసిన పోస్టల్ బిల్లుపై పాకెట్ వీటో ప్రయోగించిన రాష్ట్రపతి…విజువల్స్
రాష్ట్రపతిగా రామస్వామి వెంకట్రామన్ హయాంలో కొన్ని కీలక ఘటనలు చరిత్రలో నిలిచిపోయాయి. నలుగురు ప్రధానమంత్రులతో ప్రమాణస్వీకారం చేయించారు వెంకట్రామన్. రాజీవ్ గాంధీ, వి.పి.సింగ్, చంద్రశేఖర్, పి.వి.నరసింహారావుతో ప్రమాణం చేయించారు. తమిళనాడు రాష్ట్రానికి చెందిన వెంకట్రామన్, 1987 నుంచి 1992 వరకు రాష్ట్రపతిగా చేశారు.
డాక్టర్ శంకర్ దయాళ్ శర్మ, రాష్ట్రపతిగా చేసిన హయాంలో సంచలన నిర్ణయాలు పతాకశీర్షికలయ్యాయి. వివాదాస్పద దళిత క్రిస్టియన్లకు సంబంధించిన రిజర్వేషన్ ఆర్డినెన్స్‌ను వెనక్కి పంపారు. అలాగే ఎన్నికల ప్రచార సమయాన్ని 21 రోజుల నుంచి 14 రోజులకు తగ్గిస్తూ చేసిన ఆర్డినెన్స్‌పై సంతకం చేయడానికి నిరాకరించడం, అప్పట్లో తీవ్ర చర్చనీయాంశమైంది. 1992 జులై 25 నుంచి 1997 జులై 25 వరకు ప్రెసిడెంట్ పదవిలో వున్నారు డాక్టర్ శంకర్ దయాళ్ శర్మ.
రాష్ట్రపతి భవన్ లో అత్యంత క్రియాశీలకంగా వ్యవహరించిన వారిలో ముఖ్యులు కె.ఆర్.నారాయణన్. కేరళ రాష్ట్రానికి చెందిన నారాయణన్, తొలి దళిత రాష్ట్రపతి. ప్రెసిడెంట్ ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో గెలిచారు. ఎడాపెడా రాష్ట్ర ప్రభుత్వ రద్దు చెయ్యడం, రాష్ట్రపతి విధించడం వంటి రబ్బరు స్టాంపు నిర్ణయాలకు వ్యతిరేకంగా గళం విప్పారు. బీహార్, ఉత్తరప్రదేశ్‌లలో రాష్ట్ర ప్రభుత్వాన్ని రద్దుచేసి రాష్ట్రపతి పాలన విధించాలన్న నాటి కేంద్ర ప్రభుత్వ తీర్మానాన్ని పునఃపరిశీలన కోసం వెనక్కి పంపి, సంచలనం స్రుష్టించారు.1997 జులై 25 నుంచి 2002 జులై 25 వరకు ప్రెసిడెంట్ గా బాధ్యతలు నిర్వర్తించారు కేఆర్ నారాయణన్..
డాక్టర్ ఏ.పి.జే. అబ్దుల్ కలాం. రాష్ట్రపతి పదవికే వన్నెతెచ్చిన మహోన్నత వ్యక్తి. రాజకీయ నేపథ్యం లేకుండా ప్రెసిడెంట్ గా ఎన్నికైన తొలి వ్యక్తి, ఆ పదవి చేపట్టిన మొదటి శాస్త్రవేత్త కూడా. దేశమంతా తిరుగుతూ, చిన్నారులతో సంభాషిస్తూ, యువతలో స్ఫూర్తినింపుతూ, దేశ ప్రజల మదిలో పీపుల్స్ ప్రెసిడెంట్ గా నిలిచిపోయారు. అనేక రచనలు చేశారు. ప్రజాప్రాతినిధ్య చట్టానికి సవరణలు చేసి పంపించిన ఆర్డినెన్స్‌ను వెనక్కి పంపి, తాను రబ్బరు స్టాంపు రాష్ట్రపతిని కాదని చెప్పకనే చెప్పారు. 25 జులై 2002 నుంచి 25 జులై 2007 వరకు రాష్ట్రపతిగా పనిచేశారు అబ్దుల్ కలాం.
ప్రతిభా పాటిల్. తొలి మహిళా రాష్ట్రపతి. 2007 జులై 25 నుంచి 2012 జులై 25 వరకు రాష్ట్రపతిగా బాధ్యతలు నిర్వర్తించారు.
రాష్ట్రపతి పదవిలో క్రియాశీలకంగా పని చేసినవారిలో ప్రణబ్ ముఖర్జీ ఒకరు. 2012, జులై 25 నుంచి 2017 జులై 25 వరకు రాష్ట్రపతి పదవిలో వున్నారు.
భారత 14వ రాష్ట్రపతిగా వ్యవహరించారు రామ్ నాథ్ కోవింద్. దళిత వర్గానికి చెందిన రాష్ట్రపతి. ఇలా ఇప్పటి వరకు 14మంది రాష్ట్రపతులు దేశానికి సేవలందించారు. తమతమ హయాంలలో, తమదైన ప్రత్యేకత చాటుకున్నారు. ఇప్పుడు 15వ రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు ద్రౌపది ముర్ము. గిరిజన సామాజికవర్గానికి చెందిన నాయకురాలు.