NTV Telugu Site icon

Cyrus Mistry : ఏటా పెరుగుతున్న యాక్సిడెంట్లు..జాగ్రత్తలు లేకుండా ప్రయాణిస్తున్న ప్రముఖులు

Life Cost

Life Cost

టాటా గ్రూప్ మాజీ ఛైర్మన్ సైరస్ మిస్త్రీ కారు ప్రమాదంలో చనిపోవడంపై చర్చ జరుగుతోంది. దేశంలో యుద్ధాల్లో కంటే ప్రమాదాల్లోనే ఎక్కువ మంది చనిపోతున్నారనేది చేదు వాస్తవం. ప్రముఖులు చనిపోయినప్పుడు చర్చే తప్ప.. రోడ్డు ప్రమాదాలు తగ్గించడానికి నివారణ చర్యలు మాత్రం ఫలితం ఇవ్వని దుస్థితి ఉంది.

ప్రముఖ వ్యాపార దిగ్గజం సైరస్‌ మిస్త్రీ హఠాన్మరణం… మొత్తం దేశాన్ని కలచివేసింది. బిజినెస్‌ టైకూన్‌గా పేరొందిన మిస్త్రీ… రోడ్డు ప్రమాదంలో, అది కూడా కారు డివైడర్‌ను ఢీకొన్న ఘటనలో చనిపోవడం ఏమిటనే చర్చ జరుగుతోంది. ఖరీదైన కారు, అందులోని సేఫ్టీ ఫీచర్లు కూడా ఆయన్ను రక్షించలేకపోయాయా? అన్న ప్రశ్నలు తలెత్తాయి. ఇంతకీ సైరస్‌ మిస్త్రీ మృతికి అసలు కారణాలేంటి?

రోడ్డు ప్రమాదాలు మృత్యువుకి దగ్గరి దారిగా మారుతున్నాయి. ఏటా పెరుగుతున్న యాక్సిడెంట్లు అందరికీ ఆందోళన కలిగిస్తున్నాయి. రోడ్డు ప్రమాదాల బారి నుంచి సామాన్యులే కాదు.. ప్రముఖులు కూడా తప్పించుకోలేకపోతున్నారు. సామాన్యులు నిర్లక్ష్యంగా ప్రయాణిస్తున్నారని, డబ్బుల్లేక, ఇతర సౌకర్యాలు లేక ప్రాణాలు రిస్క్ లో పెడతారనే అభిప్రాయాలున్నాయి. కానీ ఇటీవలి కాలంలో ప్రముఖులు కూడా రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోవడం చూస్తుంటే.. వాళ్లు కూడా కనీస జాగ్ర్తతలు లేకుండా ప్రయాణిస్తున్నారనే భావన కలుగుతోంది. డబ్బులు, పదవులు, పరపతి.. అన్నీ ఉన్నా కూడా చిన్న నిర్లక్ష్యం ప్రముఖుల ప్రాణాల్ని బలిగొంటోంది.

టాటా గ్రూప్ మాజీ ఛైర్మన్ రోడ్డు ప్రమాదంలో చనిపోవడం అందర్నీ షాక్ కు గురిచేసింది. అత్యాధునిక సేఫ్టీ ఫీచర్లున్న కారు కూడా మిస్త్రీని కాపాడలేకపోయింది. రెగ్యులర్ గా విమానాలు తిరిగే రెండు నగరాల మధ్య కారు ప్రయాణం అవసరమేంటనే అనుమానాలు కూడా వ్యక్తమౌతున్నాయి. రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలైన వ్యాపార దిగ్గజం సైరస్‌ మిస్త్రీ ప్రమాద ఘటనలో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. కారు అతివేగంగా ప్రయాణించడంతో పాటు ప్రమాద సమయంలో వెనుక కూర్చున్న మిస్త్రీ సీటు బెల్టు ధరించలేదని ప్రాథమిక దర్యాప్తులో తేలింది. అంతేకాకుండా ఆయన కారు ప్రమాదానికి ముందు.. కేవలం 9 నిమిషాల్లో 20 కిలోమీటర్లు ప్రయాణించినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. మితిమీరిన వేగంతోపాటు డ్రైవర్‌ తీసుకున్న రాంగ్‌ డిసిషన్‌ ప్రమాదానికి ప్రధాన కారణాలని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.

ముంబై సమీపంలోని పాల్‌ఘర్‌లో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో వేగంగా ప్రయాణిస్తున్న మిస్త్రీ ఎస్‌యూవీ కార్ డివైడర్‌ను ఢీకొంది. ఈ ప్రమాదంలో సైరస్‌ మిస్త్రీతోపాటు జహంగీర్‌ పండోల్‌ దుర్మరణం చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. గుజరాత్‌ నుంచి ముంబయి వస్తుండగా వీరు ప్రయాణిస్తోన్న కారు పాల్‌ఘర్‌ జిల్లాలోని సూర్య నదిపై ఉన్న వంతెన వద్ద డివైడర్‌ను ఢీకొట్టడంతో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది.

ప్రమాదానికి దారితీసిన పరిస్థితులను తెలుసుకునేందుకు పాల్‌ఘర్‌ జిల్లాలోని చరోటీ చెక్‌ పోస్ట్‌ వద్ద ఉన్న సీసీటీవీ కెమెరాలను పోలీసులు పరిశీలించారు. మిస్త్రీ ప్రయాణిస్తోన్న కారు మధ్యాహ్నం 2 గంటల 21 నిమిషాల సమయానికి చరోటి చెక్‌పోస్ట్‌ను దాటింది. ఈ చెక్‌పోస్ట్‌కు 20 కిలోమీటర్ల దూరంలో కారు ప్రమాదానికి గురైంది. అప్పుడు సమయం మధ్యాహ్నం 2 గంటల 30 నిమిషాలు. అంటే, కేవలం 9 నిమిషాల్లోనే కారు 20 కిలోమీటర్లు ప్రయాణించిందని పోలీసులు గుర్తించారు.

ప్రమాద సమయంలో సైరస్‌ మిస్త్రీ, జహంగీర్‌ వెనుక సీట్లో కూర్చున్నారు. ప్రముఖ గైనకాలజిస్టు అనాహితా పండోల్ డ్రైవర్‌ సీట్లో ఉండగా.. ఆమె భర్త డేరియస్‌ ముందు సీట్లో ఉన్నారు. సూర్య నది వద్ద రాంగ్‌ సైడ్‌లో మరో వాహనాన్ని అధిగమించేందుకు ప్రయత్నిస్తుండగా.. కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టినట్లు ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది. ఘటన సమయంలో వెనుక సీట్లలో కూర్చున్న మిస్త్రీ, జహంగీర్‌ సీటు బెల్టు ధరించలేదని, అందుకే ఎయిర్‌ బెలూన్లు ఓపెన్‌ కాలేదని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. కారులో ఏదైనా మెకానికల్‌ సమస్యలు ఉన్నాయా అని నిర్ధారించేందుకు పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు సాగిస్తున్నారు. కారులో బ్లాక్‌ బాక్స్‌ తరహాలో అసెంబుల్‌ చేసిన చిప్‌ నుండి డేటా పొందేందుకు ప్రయత్నిస్తున్నారు.

అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే… సైరస్ మిస్త్రీ ప్రయాణించిన మెర్సిడెస్ ఎస్‌యూ‌వీ కారుకు చాలా సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి. ఈ కంపెనీ కార్లు ప్రపంచంలోని అత్యంత సురక్షితమైనవని నిపుణులు పరిగణిస్తున్నారు. పలు సేఫ్టీ ఫీచర్లు కలిగిన మెర్సిడెస్ ఎస్‌యూవీ కారు… కేవలం డివైడర్‌ను ఢీకొనడంతోనే మిస్త్రీ ప్రాణాలు పోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. టైమ్‌ బాగోలేనప్పుడు… ఎంతటి ఖరీదైన కారు అయినా, అది ఎన్ని సేఫ్టీ ఫీచర్లుతో కూడినదైనా… మృత్యువుకు తలొంచక తప్పదనే నిర్లిప్తత కూడా వ్యక్తమవుతోంది.

మెర్సిడెస్ ఎస్‌యూ‌వి ప్రపంచంలోని అత్యంత సురక్షితమైన కార్లలో ఒకటి. సైరస్ మిస్త్రీ ప్రయాణిస్తున్న ఎస్‌యూ‌వి మెర్సిడెస్ జి‌ఎల్‌సి 220d 4మ్యాటిక్ ఎస్‌యూ‌వి. ఈ కంపెనీ ఎస్‌యూ‌వి కార్ ప్రీ-సేఫ్ సిస్టమ్‌తో వస్తుంది. దీనితో పాటు పార్క్‌ట్రానిక్‌తో యాక్టివ్ పార్కింగ్ అసిస్ట్, 360 డిగ్రీ కెమెరా వ్యూ, మోకాలి సేఫ్టీ కోసం ఎయిర్ బ్యాగ్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, హై బీమ్ అసిస్ట్, బ్లైండ్ స్పాట్ డిటెక్షన్ వంటి ఫీచర్లు కూడా ఈ కారులో ఉన్నాయి. అంతేకాకుండా ఈ కార్ ఓవర్ స్పీడింగ్ వార్నింగ్ సిస్టమ్‌తో వస్తుంది, ఇంకా ఈ ఎస్‌యూ‌వి 80 కిలోమీటర్ల స్పీడ్ లో బీప్ చేస్తుంది, 120 కిలోమీటర్ల కంటే ఎక్కువ స్పీడ్ ఉన్నప్పుడు బీప్ సౌండ్ నిరంతరం చేస్తుంది, అంటే డ్రైవర్ కి కార్ స్పీడ్ చాలా ఎక్కువగా ఉందని హెచ్చరిస్తుంది, అలాగే స్పీడ్ తగ్గించాల్సిన అవసరం ఉందని చెబుతుంది. ఈ ఎస్‌యూ‌వీలో డ్రైవర్ ఇంకా ప్రయాణీకుల కోసం ఏడు ఎయిర్‌బ్యాగ్‌లు ఉన్నాయి. ఈ కారు యూరో NCAP నుండి 5-స్టార్ రేటింగ్‌ను కూడా పొందింది.

మెర్సిడెస్ నుంచి ఈ ఎస్‌యూ‌వి డీజిల్ వెర్షన్‌ 1950cc 4-ఇన్‌లైన్ సిలిండర్ ఇంజన్, 192 bhp ఆండ్ 400 న్యూటన్ మీటర్ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. కేవలం 7.9 సెకన్లలో గంటకు సున్నా నుండి 100 కిలోమీటర్ల స్పీడ్ అందుకోగలదు. ఈ కార్ టాప్ స్పీడ్ గంటకు 215 కి.మీ. అలాగే 9 గేర్డ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో వస్తుంది. దీనికి ముందు ఇంకా వెనుక డిస్క్ బ్రేక్‌లు ఇచ్చారు. కారు ఎక్స్-షోరూమ్ ధర రూ.68 లక్షల నుండి ప్రారంభమవుతుంది.

రోడ్డు ప్రమాదాలు సామాన్యుల ఇళ్లలోనే కాకుండా ప్రముఖల ఇళ్లలోనూ తీవ్ర విషాదాన్ని నింపుతున్నాయి. ఎందరో ప్రముఖులు రోడ్డు ప్రమాదాల్లో మృత్యువాత పడ్డారు. కొందరు ప్రముఖుల పిల్లలు విలాసవంతమైన కార్లు, అధునాతన బైక్‌లు వాడి ప్రమాదాల బారిన పడి మృతి చెందారు.

రోడ్డు ప్రమాదాలు సామాన్యులతోపాటు ప్రముఖుల కుటుంబాల్లోనూ విషాదాల్ని నింపుతున్నాయి. రోడ్లపైకి రావాలంటేనే భయపడాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ఇంటి నుంచి బయటికి వెళ్లిన వ్యక్తి.. తిరిగి వచ్చే వరకూ నమ్మకం లేకుండా పోతోంది.
2003 అక్టోబరులో సినీ నటుడు బాబుమోహన్ కుమారుడు, పవన్ కుమార్ బైక్‌పై వస్తూ తెల్లవారుజామున 5 గంటల సమయంలో జూబ్లీహిల్స్ సమీపంలో డివైడర్‌ ను ఢీకొని ప్రాణాలు కోల్పోయాడు. 2010 జూన్‌లో సినీ నటుడు కోట శ్రీనివాసరావు కుమారుడు, కోట ప్రసాద్ బైక్‌పై వెళ్తూ ఔటర్ రింగ్ రోడ్ సమీపంలో వాహనాన్ని ఢీకొని మృతి చెందారు. 2011 సెప్టెంబరులో మాజీ క్రికెటర్ అజారుద్దీన్ కుమారుడు అయాజుద్దీన్ ఔటర్ రింగ్‌ రోడ్డుపై తన 1000 సీసీ బైక్‌తో ప్రయాణిస్తూ అదుపుతప్పి కిందపడ్డాడు. ఆస్పత్రిలో ఐదు రోజుల పాటు మృత్యువుతో పోరాడి మృతి చెందాడు. 2011 డిసెంబర్‌లో మాజీ మంత్రి కోమటిరెడ్డి తనయుడు, ప్రతీక్‌ రెడ్డి నార్సింగ్ -పటాన్‌ చెరు మధ్య కొల్లూరు సమీపంలో కారు ప్రమాదంలో మృతి చెందాడు. 012 నవంబర్‌లో శ్రీకాకుళం జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో టీడీపీ సీనియర్ నేత ఎర్రన్నాయుడు మరణించారు. 2013లో హైదరాబాద్ నుంచి గుంటూరు వెళ్తున్న టీడీపీ మాజీ ఎంపీ లాల్‌జాన్ బాషా రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. 2014 ఎన్నికల సమయంలో ప్రచారం ముగించుకుని ఇంటికి వెళ్తున్న వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శోభా నాగిరెడ్డి కారు ప్రమాదంలో మృతి చెందారు. 2014లో నల్లగొండ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రముఖ నటుడు నందమూరి హరికృష్ణ కుమారుడు జానకీరాం మృతి చెందాడు. 2017 మేలో ఏపీ మంత్రి నారాయణ కుమారుడు నిషిత్ హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. 2017 జూన్‌లో ప్రముఖ నటుడు రవితేజ సోదరుడు నటుడు భరత్‌ కూడా ఔటర్‌ రింగ్‌ రోడ్డుపై జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. సినీ నటుడు, మాజీ మంత్రి హరికృష్ణ, మాజీ ఎంపీ ఎంవీవీఎస్ మూర్తి కూడా రోడ్డు ప్రమాదాల్లోనే మృతి చెందారు. జాతీయ స్థాయిలో కీలక నేతలుగా ఉన్న రాజేష్ పైలట్, గోపీనాథ్ ముండే, సాహెబ్ సింగ్ వర్మ కూడా రోడ్డు ప్రమాదాలకు బలయ్యారు.

పాతికేళ్ల క్రితం ప్రిన్సెస్ డయానా కారు ప్రమాదంలో చనిపోవడం ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపింది. బ్రిటన్ రాజకుటుంబానికి చెందిన డయానా అత్యంత ఖరీదైన కారులో ప్రయాణిస్తూ చనిపోయారు. అయితే డయానా మృతికి కారణం ఏమిటనేది ఇప్పటికీ మిస్టరీగానే ఉంది. డయానా మరణంపై ఇప్పటికీ ఓ మిస్టరీనే. ఆమె మరణం వెనుక అనేక అనుమానాలు ఉన్నాయి. ఇది యాక్సిడెంట్ కాదని, ఆమెది హత్యేనని చాలా మంది వాదిస్తారు.ప్రమాదం జరిగినప్పడు డయానా కారు అతి వేగంతో ఉందని, డయానాను మరోకారులో కొందరు వెంబడించారని, వీరి కారు ఢీకొనడం వల్లే ప్రమాదం జరిగిందని రకరకాల వాదనలున్నాయి. అసలు విషయం ఏదో ఉందని, అది బయటకు రాకుండా బ్రిటన్ రాజకుటుంబం ఒత్తిడి తెచ్చిందనే అనుమానాలున్నాయి. ఏది ఏమైనా డయానా అయితే చనిపోయింది.

ఎంతో భవిష్య్తత్తు ఉన్న నేతల పిల్లలు, ఇప్పిటికే కీలక స్థాయికి ఎదిగిన నేతలు, ప్రజలపై చెరగని ముద్ర వేసిన ప్రముఖులు.. ఇలా ఎవరైనా.. రోడ్డు ప్రమాదంలో చనిపోవడం దురదృష్టమే. రోడ్డు ప్రయాణాల సమయంలో కచ్చితంగా కనీస జాగ్రత్తలు తీసుకోవాలని ఏటా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నా.. సామాన్యులతో పాటు ప్రముఖులు కూడా నిర్లక్ష్యంగా ఉండటం ఆందోళన కలిగిస్తోంది.

వరుస ప్రమమాదాలతో రోడ్లు నెత్తురోడుతున్నాయి. ప్రతిరోజు ఎక్కడో ఒకచోట రహదారులపై ఎందరో ప్రాణాలు కోల్పోవడం, గాయపడటం జరుగుతోంది. ప్రభుత్వ అధికారులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా ప్రమాదాలు, మృతుల సంఖ్య తగ్గడం లేదు. అతివేగం, డ్రైవింగ్‌, నిర్లక్ష్యం వల్ల వేలాది మంది బతుకులు గాలిలో కలిసిపోతున్నాయి. రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా మలుపుల వద్ద జరుగుతున్నాయి. ఇరుకురోడ్లు,వంతెనలను బ్లాక్‌ స్పాట్‌ లుగా గుర్తించి ప్రమాదాల నివారణకు అధికారులు చర్యలు చేపట్టినా ఆశించిన మార్పు కనిపించడం లేదు.

ప్రపంచవ్యాప్తంగా ఏటా రహదారి ప్రమాదాల్లో 13 లక్షలమంది చనిపోతుంటే, అయిదు కోట్లమంది గాయపడుతున్నారు. ప్రతి మూడు నిమిషాలకో మరణం జరుగుతోంది. ప్రపంచంలో అత్యధిక రోడ్డు ప్రమాదాలు జరిగే దేశం మనదే.

ప్రగతి భాగ్యరేఖలైన రహదారులు ప్రతిరోజూ నెత్తురోడుతున్న దేశం మనది. దేశీయ రహదారుల పొడవు 47లక్షల కిలోమీటర్లు. 27 శాతానికి పైగా రోడ్డు ప్రమాదాలు నేషనల్‌ హైవేల మీదనే నమోదవుతున్నాయి. రోజుకు పాతికమంది పద్దెనిమిదేళ్లలోపు పిల్లలు రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్న దేశం మనది. కరోనా లాక్‌డౌన్‌ వల్ల రోడ్డు ప్రమాదాలు తగ్గాయి. లాక్ డౌన్ ఎత్తేశాక ప్రమాదాలు మళ్లీ పెరిగాయి.

వాహనాల్లో వెళ్లేవారు సీటు బెల్టులు ధరించాలి. గోపీనాథ్ ముండే ,ఎర్రన్నాయుడు.శోభా రెడ్డి కూడా సీటు బెల్టు ధరించలేదు. ప్రయాణాలలో ప్రమాదాలలో ప్రాణాలు పోగొట్టుకుంటున్న సామాన్య ప్రజలు ఎందరో? ఆక్రమణలను తొలగించలేకపోవటం,నడిరోడ్డుపైన మత కట్టడాలు ఇతర భవనాలు అడ్డంగా ఉండటం, ట్రాఫిక్‌ ఉల్లంఘనలకు పాల్పడటం,హెల్మెట్‌ ధరించకపోవటం ,సైలెన్సర్లు తీసేసి భారీ శబ్దంతో హారన్‌లు మోగించుకుంటూ ఆకతాయిల్లాగా వాహనాలు నడపటం ,ట్రాఫిక్‌ పోలీసులతో తగాదాకు దిగడం అలవాటైపోయింది.రహదార్లు బాగుండవు. సిగ్నలింగ్‌ వ్యవస్థ సరిగా పనిచేయదు. పాదచారులకు కేటాయించిన ఫుట్ పాత్ స్థలాల్లో అక్రమ నిర్మాణాలు ఉన్నాయి. రోడ్డుమీద స్థలం కనిపిస్తే చాలు అక్కడ ఒక కొట్టో,మతకట్టడమో, విగ్రహమో వెలుస్తుంది. పూజభావంతో అక్రమ కట్టడాలను, చెట్లనుకూడా తొలగించకుండా వాటి ప్రక్కగా జాతీయ రహదారుల్ని కూడా మళ్లిస్తున్నారు. జనాభా విపరీతంగా పెరిగి వాహనాల రాకపోకల తాకిడి ఎక్కువవుతోంది. అత్యవసర వైద్యసేవలు అందించాల్సిన ఆస్పత్రుల ఆంబులెన్స్ వాహనాలే ట్రాఫిక్‌ చక్రబంధంలో చిక్కుకొంటున్నాయి.

రహదారులు, కాలిబాటలపైన చట్టవిరుద్ధంగా ప్రార్థన మందిరాలు పుట్టుకొస్తుండటాన్ని, ఈ విషయంలో రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నిష్క్రియాపరత్వాన్నిసుప్రీం కోర్టు ప్రశ్నించింది. మతపరమైన దురాక్రమణల నిర్మూలనకు ఎటువంటి చర్యలు చేపట్టారో వెల్లడించే ప్రమాణపత్రాలు దాఖలుచేయాలని ఆదేశించింది. ప్రభుత్వాలలో కదలిక రాకపోతే , ఏం చేయాలన్నది ఇక మేమే చూసుకుంటాం’ అని తేల్చిచెప్పింది. ప్రజల మతవిశ్వాసాలనే పెట్టుబడిగా చేసుకొని కొన్ని రాజకీయపక్షాలు చెలరేగిపోతున్నాయి. అక్రమాల పనిపట్టాల్సిన అధికారులు,ప్రభుత్వము నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నాయి.న్యాయస్థానం ఆదేశాల్నీ ఖాతరుచేయటంలేదు.

దేశవ్యాప్తంగా అనధికారికంగా ఏర్పాటైన ప్రార్థనామందిరాలు దాదాపు 21లక్షలు. తమిళనాడు రోడ్లమీద 78 వేల అనుమతి లేని మతకట్టడాలున్నాయి. ఒక్క దిల్లీలోనే అవి 60వేలు. హైదరాబాద్‌ రోడ్లపై ఉన్న మతకట్టడాల సంఖ్య దాదాపు 600. రాజస్థాన్‌లో పాదచారుల హక్కుల పరిరక్షణ సంఘాలు అనధికార మత నిర్మాణాల జోలికి రావద్దంటూ మామూళ్లు హెచ్చరికలు, బెదిరింపులకు దిగుతాయని సుప్రీం కోర్టు దృష్టికి తెచ్చాయి. 2006లో సుప్రీంకోర్టు వెలువరించిన మార్గదర్శక సూత్రాల ప్రకారం- రోడ్డుమధ్యన, పాదచారులకు నిర్దేశించిన ఫుట్ పాత్ లమీద మతకట్టడాలను ప్రభుత్వం ఎటువంటి పరిస్థితిలోనూ అనుమతించకూడదు. మితిమీరిన వేగం, ట్రాఫిక్‌ ఇబ్బందులు, కాలుష్యం వంటి పర్యావరణ సమస్యలను దృష్టిలో పెట్టుకొని వ్యవహరించాలి.రహదారి అందరిదీ అనుకోవాలి.అనధికార కట్టడాల్ని గుర్తించి పడగొట్టాలి.

ఎవరికి తోచినట్లు వారు రోడ్లమీద నిర్మాణాలు చేయడంతో, ట్రాఫిక్‌వ్యవస్థ ఛిన్నాభిన్నమై రోడ్డుప్రమాదాలు ఎక్కువయ్యాయి.
నెత్తురోడుతున్న బాధితులకు వైద్యులు తక్షణం ఆసుపత్రిలో చేర్చుకొని వైద్యం చేయాలని తీసుకొచ్చినవారిపై పోలీసు కేసులు ఉండవని తీర్పులొచ్చాయి. ప్రమాదబాధితుల గుండె రక్తనాళాలకు నాడీ మండలానికి తీవ్రగాయాలై తొలి 15నిమిషాల్లోనే ప్రాణాలు కోల్పోతారట. గోల్డెన్‌ అవర్‌లో వైద్యసహాయం అందించాలి. రోడ్డుప్రమాదం జరిగిన నిమిషాల్లోపే అంబులెన్స్‌ లు రావాలి. మనిషి ప్రాణాల్ని కాపాడటం అన్నింటికంటే ముఖ్యమన్న సుప్రీం మార్గనిర్దేశాల ప్రకారం ఆస్పత్రులు.. బాధితుల్ని తీసుకొచ్చే వారిని డబ్బులు కట్టాలని బలవంత పెట్టకూడదు. ప్రధాన గేటు దగ్గర అందరికీ కనబడేలా బోర్డు పెట్టాలి. క్షతగాత్రులు వైద్యఖర్చుల్ని భరించలేని పేదలైతే ఆసుపత్రులు ఏం చెయ్యాలి? వైద్య వ్యయాల్ని ప్రమాద బాధితులు వాయిదాల పద్ధతిలో చెల్లించవచ్చు. క్షతగాత్రులు ఏమాత్రం చెల్లించగల పరిస్థితి లేనప్పుడు, ఆయా రాష్ట్ర ప్రభుత్వాలే ఆసుపత్రులకు ఖర్చులు తిరిగి చెల్లించాలి. ప్రమాద బాధితులకు పాతిక వేల రూపాయల దాకా వైద్య వ్యయం చెల్లించేందుకు కర్ణాటక ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఆపద్బంధు సేవల ద్వారా బాధితులకు బాసటగా నిలుస్తున్నాయి. రహదారి భద్రతా నిధిని మరింత పటిష్ఠం చేయాలి.

రోడ్ల మీద ఎక్కువగా ప్రమాదాలకు కారణమౌతున్న పాయింట్లను గుర్తించాల్సిన అవసరం ఉంది. శాస్త్రీయ పంథాలో వాటిని యుద్ధప్రాతిపదికన సరిచేయాలి. అవసరమైన చోట్ల క్రాస్‌ దగ్గర ప్రమాదాల నివారణకు పైవంతెన, అండర్‌ పాస్‌ నిర్మించాలి. రోడ్డు మలుపుల దగ్గర డిజైన్‌ లోపాలు సవరించాలి. జాతీయ రహదారుల పైనే 34 శాతం ప్రమాదాలు,మరణాలు సంభవిస్తున్నాయి. రోడ్ల నిర్మాణంలో లొసుగులు, లోపాల్ని సరిచెయ్యాలి. చిన్న కల్వర్టులను వెడల్పు చెయ్యాలి. ప్రమాదకర ప్రాంతాల్లో అండర్‌ పాసులు నిర్మించాలి. అడ్డగోలుగా నిర్మిస్తున్న డివైడర్లే అనేక సందర్భాల్లో ప్రాణాంతకంగా మారుతున్నాయి. మన దేశంలో 97 శాతం రహదారులకు అసలు ఫుట్‌పాత్‌లే ఉండవు.

రోడ్లపై ధాన్యాన్ని ఆరబోస్తున్నా, భారీ వర్షాలకు రోడ్లు అధ్వాన్న స్థితికి చేరినా పట్టించుకునేవారుండరు. ప్రపంచం లోని మొత్తం వాహనాల్లో మన దేశంలో ఉన్నవి ఒక్క శాతమే. కానీ ప్రపంచ దేశాల్లో జరిగే ప్రమాదాల్లో మన వాటా 11 శాతం. రహదారులు సక్రమంగా లేనికారణంగా వాహనాలు దెబ్బతిని ఏటా కొన్ని వేల కోట్ల రూపాయల నష్టం సంభవిస్తోంది. పెట్రోల్, డీజిల్ పై వసూలు చేసే సుంకాల్లో కొంత రహ దారులను మెరుగుపరచడానికి ఖర్చుచేయాలి. శాస్త్ర విజ్నానం పెర్గుతున్నకొద్దీ ప్రమాదాలు తగ్గాలి. బ్యాటరీ వాహనాల తయారీ నేటికీ పెరగలేదు. డ్రైవర్ లేని కార్లు వచ్చాయి.బ్యాటరీ సైకిళ్ళు కార్లు ఉత్పత్తి పెరగాలి. వాహనాలు ఢీకొనకుండా కొంచెం దూరంలోనే వాటంతట అవే ఆగిపోయే రిమోట్ పరిజ్ఞానం పెరగాలి. రోడ్డు ప్రమాదాలు చావులు తగ్గటానికి కొత్త ఆవిష్కరణలను ఆహ్వానించాలి.

దేశంలో రోడ్డు ప్రమాదాలు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. గతంలో ఎప్పుడూ లేనంతగా రోడ్డు ప్రమాదాల కారణంగా 2021లో ఏకంగా 1.55లక్షల మంది మృత్యుఒడికి చేరారు. అంటే సగటున ప్రతి గంటకు 18 మంది మరణిస్తుండగా, ఒక్కరోజులో 426మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ మరణాలే కాకుండా గతేడాది దేశవ్యాప్తంగా జరిగిన 4.03 లక్షల ప్రమాదాల్లో 3.71 లక్షల మంది గాయపడినట్లు నేషనల్‌ క్రైమ్‌ రికార్డ్స్‌ బ్యూరో నివేదిక పేర్కొంది.

సాధారణంగా రోడ్డు ప్రమాదాల్లో గాయపడ్డవాళ్లే ఎక్కువ మంది ఉంటారు. కానీ మిజోరం, పంజాబ్‌, ఝార్ఖండ్‌, ఉత్తర్‌ప్రదేశ్‌లో మాత్రం గాయపడ్డవారికంటే.. మరణించినవారి సంఖ్యే అధికం అని లెక్కలున్నాయి. ఈ ప్రమాదాల్లో మరణించినవారిలో అధిక భాగం ద్విచక్ర వాహనదారులే ఉన్నారు. ఆ తర్వాత స్థానాల్లో కార్లు, ట్రక్కు ప్రమాదాల్లో ప్రయాణించినవారు ఉన్నారు. ఓవర్‌ స్పీడ్‌ కారణంగానే 59.7శాతం ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని తేలింది. నగరాలతో పోలిస్తే గ్రామీణ ప్రాంతాల్లోనే ప్రమాదాలు అధికంగా జరుగుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి.