Yasir Shah Gives Strong Comeback In Test Cricket Against Sri Lanka: పాకిస్తాన్ సీనియర్ లెగ్ స్పిన్నర్ యాసిర్ షా చరిత్ర సృష్టించాడు. శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్‌తో రీఎంట్రీ ఇచ్చిన అతడు.. రెండు వికెట్లు పడగొట్టాడు. ఈ క్రమంలో అతను ఓ అరుదైన ఘనత సాధించాడు. పాకిస్తా్న్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన ఐదో పాక్ బౌలర్‌గా రికార్డ్ నెలకొల్పాడు. ఇంతకుముందు అబ్దుల్ ఖాదీర్ 236 వికెట్లతో ఐదో స్థానంలో ఉండగా.. 237 వికెట్లతో యాసిర్ షా ఆయన రికార్డ్‌ని బద్దలు కొట్టి.. ఐదో స్థానానికి ఎగబాకాడు. తొలి నాలుగు స్థానాల్లో వసీమ్ అక్రమ్(414 వికెట్లు), వకార్ యూనిస్(373 వికెట్లు), ఇమ్రాన్ ఖాన్(362 వికెట్లు), దానిష్ కనేరియా(261) వరుసగా ఉన్నారు.
కాగా.. వైవిధ్యమైన బౌలింగ్‌తో తనదైన ప్రత్యేక ముద్ర వేసిన యాసిర్ షా, ఇప్పటివరకూ తన కెరీర్‌లో ఎన్నో రికార్డుల్ని నమోదు చేశాడు. 2014లో అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టిన ఈయన.. 50 వికెట్ల ఫీట్‌ని అత్యంత వేగంగా అందుకున్న పాక్ బౌలర్‌గా నిలిచాడు. అనంతరం 100 వికెట్ల మైలురాయిని (17 టెస్టుల్లో 100 వికెట్లు) సైతం అత్యంత వేగంగా అందుకొని, మరో ముగ్గురితో కలిసి సంయుక్తంగా రెండో స్థానంలో ఉన్నాడు. అదే ఊపులో 200 వికెట్ల మైలురాయిని అందుకొని, ఆ ఫీట్ సాధించిన తొలి ఆటగాడిగా యాసిర్ షా చరిత్రపుటలకెక్కాడు. అంతకుముందు ఆస్ట్రేలియా బౌలర్ క్లారీ గ్రిమెట్ 36 టెస్టుల్లో 200 వికెట్లు తీయగా.. 33 టెస్టుల్లోనే యాసిర్ 200 వికెట్లు పడగొట్టి, ఆ రికార్డ్‌ని తిరగరాశాడు.
