WCL 2026 Winner West Indies Champions: ప్రపంచంలోని మాజీ క్రికెటర్లు వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ (డబ్ల్యూసీఎల్) లీగ్‌లో మరోసారి తలపడ్డారు. ఈ ఏడాది జరిగిన డబ్ల్యూసీఎల్ 2026 టైటిల్ విజేతగా వెస్టిండీస్ ఛాంపియన్స్ నిలిచింది. ఆదివారం రాత్రి షార్జాలో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ ఛాంపియన్స్‌పై 9 వికెట్ల తేడాతో వెస్టిండీస్ ఘన విజయం అందుకుంది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 159 పరుగుల స్కోరు చేసింది. విండీస్ మరో మూడు ఓవర్లు ఉండగానే ఒక వికెట్ మాత్రమే కోల్పోయి 165 రన్స్ చేసి విజయం సాధించింది.
ఫైనల్ మ్యాచ్‌లో టాస్ గెలిచిన వెస్టిండీస్ మొదట బౌలింగ్ ఎంచుకుంది. సెమీఫైనల్‌కు దూరమైన యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ తిరిగి జట్టులోకి వచ్చాడు. ఇంగ్లాండ్ ఓపెనర్లు జాసన్ రాయ్ 7 బంతుల్లో 7 పరుగులు చేయగా.. డేవిడ్ మలన్ 5 బంతుల్లో 2 పరుగులు మాత్రమే చేశాడు. కెప్టెన్ రవి బొపారా (16), మొయిన్ అలీ (60) జట్టును ఆదుకున్నారు. బొపారా అనంతరం జో డెన్లీ గోల్డెన్ డకౌట్ అయ్యాడు. ఆపై సమిత్ పటేల్ (3) కూడా విఫలమయ్యాడు. ఒవైస్ షా (38) అండతో అలీ జట్టుకు కీలక పరుగులు అందించారు. ఆలీ 39 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్లతో 60 పరుగులు చేయగా.. షా 28 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 38 పరుగులు చేశాడు. విండీస్ తరఫున డ్వేన్ బ్రావో అద్భుతంగా బౌలింగ్ చేశాడు. తన నాలుగు ఓవర్లలో 21 పరుగులిచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు. ఫిల్ ఎడ్వర్డ్స్, షెల్డన్ కాట్రెల్, రేమన్ రీఫర్, కార్లోస్ బ్రాత్‌వైట్ తలో వికెట్ పడగొట్టారు.
భారీ లక్ష్యాన్ని వెస్టిండీస్ ఆడుతూ పాడుతూ ఛేదించింది. ఓపెనర్లు క్రిస్ గేల్, లెండిల్ సిమన్స్ దంచికొట్టారు. యూనివర్సల్ బాస్ గేల్ 14 బంతుల్లో ఓ ఫోర్, 2 సిక్సర్లతో 21 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. సిమన్స్ 53 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్సర్లతో 77 పరుగులు చేశాడు. ఆపై చంద్‌విక్ వాల్టన్ 35 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్లతో 58 పరుగులు చేశాడు. ఇంగ్లాండ్ బౌలర్ అజ్మల్ షాజాద్ ఒక వికెట్ తీశాడు. ప్రపంచ ఛాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ తొలిసారి 2024లో జరిగింది.

