NTV Telugu Site icon

Commonwealth Games: గతేడాదిలో చెప్పింది.. ఇప్పుడు పతకం సాధించింది

Tulika Maan Silver

Tulika Maan Silver

Tulika Maan wins silver in women 78kg judo event: మాటలు ఎవ్వరైనా మాట్లాడుతారు. కానీ, చేతల్లో చేసి చూపించేవారు చాలా అరుదు. అలాంటి అరుదైన వారిలో తూలిక మాన్ ఒకరు. ఢిల్లీకి చెందిన ఈ అమ్మాయి.. జూనియర్ స్థాయి నుంచే జూడో క్రీడలో గొప్పగా రాణిస్తోంది. తన తల్లి అండతో అద్భుత ప్రదర్శన కనబరుస్తూ దూసుకుపోతున్న ఈమె.. అంకిత భావం, తపనతో ఎన్నో పతకాల్ని కొల్లగొట్టింది. ఇప్పుడు 2022 కామన్‌వెల్త్ క్రీడల్లో రజతం సాధించి.. జాతీయ పతాకాన్ని రెపరెపలాడించింది. గతేడాదిలో తాను పతకం సాధించాలనే ధ్యేయంతో ఉన్నానని చెప్పిన తూలిక.. చెప్పినట్టుగానే తన ఆశయాన్ని నెరవేర్చుకుంది. 78 కేజీల మహిళల జూడో కేటగిరీలో ఫైనల్ మ్యాచ్‌లో స్కాట్లాండ్‌కి చెందిన సారా అడ్లింగ్టన్ చేతిలో ఓటమిపోవడంతో.. తూలికకి రజతం దక్కింది.

నిజానికి.. గతేడాది టోక్యో ఒలంపిక్స్‌లో అర్హత సాధించేందుకు తూలిక ఎంతో కష్టపడింది. క్వాలిఫయర్ టోర్నీలో సత్తా చాటేందుకు మరో నలుగురు జూడో ఆటగాళ్లతో కలిసి బరిలోకి దిగింది. కానీ.. జూడో సమాఖ్య కేవలం ఇద్దరిని మాత్రమే తీసుకోవాలని నిర్ణయించడంతో, తూలికకి అవకాశం దక్కలేదు. దాంతో నిరాశకు గురైన ఆమె, కొన్నాళ్లు ఆటకు దూరంగా ఉంది. అనంతరం ఆ బాధ నుంచి బయటకొచ్చి, కామన్‌వెల్త్ క్రీడల్లో సత్తా చాటింది. కాగా.. 2016లో జూనియర్ జాతీయ ఛాంపియన్షిప్‌లో తూలిక రజతం గెలిచింది. నాలుగు సార్లు జాతీయ టైటిల్ దక్కించుకున్న ఈ అమ్మాయి.. ఆసియా ఛాంపియన్‌షిప్స్‌లో 2017, 2018లో కాంస్యాలు నెగ్గింది. కామన్‌వెల్త్ ఛాంపియన్‌షిప్, దక్షిణాసియా క్రీడల్లో 2018, 2019లో స్వర్ణాలు సొంతం చేసుకుంది.