Site icon NTV Telugu

Sunil Gavaskar: టీ20 వరల్డ్‌కప్‌లో ఫైనల్‌కు వెళ్లేది ఆ రెండు జట్లే

Sunil Gavaskar

Sunil Gavaskar

Sunil Gavaskar Predicts That India Australia Teams Will Go To Final: టీ20 వరల్డ్‌కప్ టోర్నీ ప్రారంభమైన సంగతి తెలిసిందే. క్వాలిఫయర్ మ్యాచ్‌లు ఉత్కంఠభరితంగా కొనసాగుతున్నాయి. చిన్న టీమ్‌లు కూడా దిగ్గజ జట్లను మట్టికరిపిస్తూ.. మెరుపులు మెరిపించేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఏ జట్టు ఫైనల్‌కి వెళ్లనుంది? ఏది కప్ నెగ్గుతుంది? అనే విషయాలపై కొందరు ఇప్పటి నుంచే అంచనాలు వేసుకుంటున్నారు. తాజాగా టీమిండియా మాజీ దిగ్గజం సునీల్ గవాస్కర్ కూడా తన అంచనాల్ని వెల్లడించాడు. ఈ టోర్నీలో భారత్‌, ఆస్ట్రేలియా జట్లే చాలా బలంగా కనిపిస్తున్నాయని.. ఆ రెండు జట్లే ఫైనల్‌కు వెళ్తాయని తన అభిప్రాయాల్ని వ్యక్తపరిచారు.

‘‘భారత క్రికెట్ జట్టు తప్పకుండా ఫైనల్‌కు చేరుతుంది. ఇక నేను ఆస్ట్రేలియాలో ఉన్నాను కాబట్టి, భారత్‌తో పాటు ఆసీస్ జట్టు ఫైనల్‌కు చేరుతుందని చెబుతున్నా’’ అంటూ గవాస్కర్ తెలిపారు. ఒక క్రీడా ఛానెల్‌తో ముచ్చటిస్తూ.. ఈమేరకు తన అభిప్రాయాన్ని గవాస్కర్ వెల్లడించారు. ఆసీస్‌ మాజీ ఆల్‌రౌండర్‌ టామ్‌ మూడీ కూడా గవాస్కర్‌తో ఏకీభవించాడు. టామ్‌ మూడీ మాట్లాడుతూ.. ‘‘ఒక గ్రూప్ నుంచి ఆస్ట్రేలియా, ఇంగ్లండ్.. మరో గ్రూప్ నుంచి భారత్, పాకిస్తాన్ జట్లు సెమీ ఫైనల్‌కు చేరుకుంటాయి. ఫైనల్ మ్యాచ్ మాత్రం ఆస్ట్రేలియా, భారత్ మధ్యే ఉంటుంది’’ అని వివరించాడు. మరి, వీళ్లు అంచనా వేసినట్టు భారత్, ఆసీస్ జట్లు ఫైనల్‌కు చేరుకుంటాయా? అదే నిజమైతే ఏ జట్టు కప్ నెగ్గుతుంది? లెట్స్ వెయిట్ అండ్ సీ!

కాగా.. టీ20 వరల్డ్‌కప్ కోసం ముందుగానే ఆస్ట్రేలియాలో ల్యాండ్ అయిన భారత్, తొలుత దేశవాళీ జట్టు వెస్ట్రన్ ఆస్ట్రేలియాతో తలపడింది. అయితే.. ఆ మ్యాచ్‌లో భారత్ ఘోర పరాజయం చవిచూసింది. దాంతో.. టీమిండియాపై అప్పుడు తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి. కానీ.. ఆస్ట్రేలియాతో జరిగిన వార్మప్ మ్యాచ్‌లో మాత్రం భారత్ ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టి సత్తా చాటింది. తమ పని ఇంకా అయిపోలేదని ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకుంది. ఈ విజయం చూసి, క్రీడాభిమానులు సైతం భారత్‌పై నమ్మకాలు పెంచుకున్నారు. టోర్నీలో ఇదే దూకుడు ప్రదర్శిస్తే.. భారత్ కప్ గెలవడం ఖాయం.

Exit mobile version