కామెంటరీలో తమ ప్రత్యేకత చాటుకోవాలని.. పంచ్‌లు, ప్రాసలతో ఆకట్టుకోవాలన్న మోజులో కొందరు దిగ్గజాలు హద్దు మీరుతున్నారు. క్రికెట్‌పై తమకున్న అనుభవాన్ని రంగరించి, వాక్చాతుర్యంతో రక్తి కట్టించాల్సిన వీళ్ళు.. వ్యక్తిగత వ్యాఖ్యలకు పాల్పడుతూ వివాదాల్లో చిక్కుకుంటున్నారు. అలాంటి వారిలో టీమిండియా మాజీ దిగ్గజం సునీల్ గవాస్కర్ ఒకరు.
గతంలో ఓసారి విరాట్ కోహ్లీ ప్రదర్శనపై కామెంట్ చేయబోయి, అతని భార్య అనుష్క శర్మ పేరుని ప్రస్తావించారు. అప్పట్లో ఆ వ్యాఖ్యలు పెద్ద దుమారాన్నే రేపాయి. ఇప్పుడు మరోసారి హెట్మెయర్, అతని భార్యపై అనుచిత వ్యాఖ్యలు చేసి.. మరో వివాదంలో చిక్కుకున్నారు. నిన్న చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్‌కు మధ్య జరిగిన మ్యాచ్‌కు కామెంటరీ చేసిన సునీల్.. ‘‘హెట్మెయర్ భార్యకు డెలివరీ అయింది. మరి, రాజస్థాన్ రాయల్స్ కోసం హెట్మెయర్ డెలివర్ చేస్తాడా?’’ అంటూ కామెంట్ చేశారు. దీంతో, నెటిజన్లు ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆటగాళ్ల వ్యక్తిగత విషయాలు, వారి భార్యల గురించి మాట్లాడడం నిజంగా దారుణమని నెటిజన్లు ఫైర్ అవుతున్నారు.
కాగా.. లాక్‌డౌన్ తర్వాత నుంచి కోహ్లీ పెద్దగా పెర్ఫార్మెన్స్ కనబర్చకపోవడంపై గవాస్కర్ ఇలాగే నోరు పారేసుకున్నారు. ‘‘లాక్‌డౌన్‌లో కేవలం అనుష్క శర్మ బౌలింగ్‌నే కోహ్లీ ప్రాక్టీస్ చేసినట్టున్నాడు. నేను ఆ వీడియోను చూశాను. కానీ, అసలైన క్రికెట్‌కు అది మాత్రం సరిపోదు’’ అంటూ కామెంట్ చేశారు. దీనిపై అనుష్క శర్మ వెంటనే స్పందించడంతో పాటు, పలు ప్రశ్నలు సంధించింది. ఇదిలావుండగా.. ఈ నెల 10న హెట్మెయర్ భార్య ప్రసవించింది. దీంతో రాజస్థాన్ బబుల్‌ను వీడి గయానాకు వెళ్లిన హెట్మెయర్, కొన్ని రోజులపాటు భార్య, బిడ్డ దగ్గర ఉండి తిరిగొచ్చాడు. ఈ క్రమంలోనే అతడి ప్రదర్శన గురించి గవాస్కర్ అనుచిత వ్యాఖ్యలు చేశారు.
