Sri Lanka Batting Innings Completed In Asia Cup Final: ఆసియా కప్ ఫైనల్‌లో శ్రీలంక, పాకిస్తాన్ జట్లు తలపడుతున్న విషయం తెలిసిందే! దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో.. పాక్ టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంపిక చేసింది. దీంతో బ్యాటింగ్ చేసేందుకు రంగంలోకి దిగిన శ్రీలంక.. నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 170 పరుగులు చేసింది. మొదట పాక్ బౌలర్ల ధాటికి శ్రీలంక తడబడింది. వరుసగా వికెట్లు కోల్పోయింది. ఓపెనర్లుగా వచ్చిన నిస్సాంక కేవలం 8 పరుగులే చేస్తే, కుసల్ మెండిల్ నసీమ్ షా బౌలింగ్‌లో డకౌట్ అయ్యాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన ధనంజయ డీ సిల్వ (21 బంతుల్లో 28) కాసేపు కుదురుగా ఆడాడు. ధనుష్క గుణతిలక కూడా ఒక్క పరుగుకే పెవిలియన్ చేరాడు. దీంతో.. శ్రీలంక జట్టు పీకల్లోతు కష్టాల్లో మునిగింది. ఈ దశలో పాక్‌కి కనీస లక్ష్యమైనా శ్రీలంక నిర్దేశిస్తుందా? లేదా? అనే అనుమానాలు రేకెత్తాయి.
అప్పుడు బరిలోకి దిగిన రాజపక్స(71 నాటౌట్), హసరంగ(36).. తమ శ్రీలంక జట్టును ఆదుకున్నారు. వీళ్లిద్దరూ ఆరో వికెట్‌కి 58 పరుగులు జోడించారు. ఆపై హసరంగ ఔటేనా.. కరుణరత్నే(14 నాటౌట్) సహాయంతో రాజపక్స జట్టుని ముందుకు నడిపించాడు. ఒకవైపు ఆచితూచి ఆడుతూనే, మరోవైపు అవకాశం వచ్చినప్పుడల్లా వీరబాదుడు బాదాడు. ఇతడు విజృంభించడం వల్లే చివరి 10 ఓవర్లో లంక జట్టు 103 పరుగులు సాధించగలిగింది. ఫలితంగా.. శ్రీలంక టోటల్‌గా 20 ఓవర్లలో 170 పరుగులు చేయగలిగింది. పాక్ బౌలర్లలో హారిస్ రౌఫ్ 3 వికెట్లు పడగొట్టగా.. నసీమ్ షా, షాదాబ్ ఖాన్, ఇప్తికార్ అహ్మద్‌లు తలో వికెట్ తీసుకున్నారు. 170 పరుగుల లక్ష్యంతో పాకిస్తాన్ మైదానంలోకి దిగింది. ఈ మ్యాచ్‌లో ఎవరు నెగ్గుతారన్నది సర్వత్రా ఆసక్తి నెలకొంది.
