NTV Telugu Site icon

భార‌త్ ఓట‌మి.. మ్యాచ్ పాయే.. సిరీస్ కూడా పోయే..

టీమిండియాను వ‌రుస ప‌రాజ‌యాలు వేధిస్తూనే ఉన్నాయి.. రెండో వ‌న్డేలోనూ ఓట‌మి పాలు కావ‌డంతో.. కేవ‌లం మ్యాచ్‌నే కాదు.. సిరీస్‌ను కూడా కోల్పోయింది భార‌త జ‌ట్టు.. బొల్యాండ్‌ పార్క్ వేదిక‌గా జ‌రిగిన రెండో వన్డే మ్యాచ్‌లో సౌతాఫ్రికా చేతిలో భారత్‌ ఓటమి చెందింది. మ‌రో 11 బంతులు మిగిలి ఉండ‌గానే.. టీమిండియా పెట్టిన టార్గెట్‌ను ఛేధించి విక్ట‌రీ కొట్టింది సౌతాఫ్రికా.. దీంతో… మూడు వ‌న్డేల సిరీస్‌ను వరుస రెండు వ‌న్డేల్లో విజ‌యం సాధించి.. మ‌రో వ‌న్డే మ్యాచ్ మిగిలి ఉండ‌గానే చేజిక్కించుకుంది.

మొద‌ట బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 287 పరుగులు చేసింది.. భార‌త ఇన్నింగ్స్‌లో 55 ప‌రుగుల‌తో కేఎల్ రాహుల్, 85 ప‌రుగుల‌తో రిషభ్ పంత్ ఆక‌ట్టుకోగా.., 29 ప‌రుగుల‌తో శిఖర్ ధవన్, 22 ప‌రుగుల‌తో వెంకటేశ్ అయ్యర్, 40 ర‌న్స్‌తో శార్దూల్ ఠాకూర్, 25 ప‌రుగుల‌తో రవిచంద్రన్ అశ్విన్ ప‌ర‌వాలేద‌నిపించారు.. కానీ, విరాట్ కోహ్లీ డకౌట్‌గా వెనుదిరిగి అభిమానులను నిరాశపరిచాడు. ఇక‌, భార‌త్ నిర్ధేశించిన 288 ప‌రుగుల టార్గెట్‌ను 48.1 ఓవ‌ర్ల‌లోనే ఛేధించింది సౌతాఫ్రికా.. కేవ‌లం మూడు వికెట్లు మాత్ర‌మే కోల్పోయి విజ‌యాన్ని అందుకుంది.. క్వింటాన్ డి కాక్ 78, మలన్ 91, బవుమా 35, ఎయిడెన్ 37, డుస్సెన్ 37 పరుగులు చేసిన జ‌ట్టు విజ‌యంలో కీల‌క భూమిక పోషించారు.. మొత్తంగా భారత్‌ను 7 వికెట్ల తేడాతో ఓడించిన‌ సౌతాఫ్రికా.. రెండో వ‌న్డేతో పాటు సిరీస్‌ను కూడా త‌న ఖాతాలో వేసుకుంది.