తమ కోల్‌కతా టీమ్ సెలక్షన్ విషయంలో సీఈవో కూడా జోక్యం చేసుకుంటాడని గత వారం శ్రేయాస్ అయ్యర్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. జట్టు ఎంపిక విషయంలో సీఈవో జోక్యం చేసుకోవడం ఏంటి? అసలు శ్రేయాస్ ఏం చెప్పాలనుకుంటున్నాడు? అంటూ నెటిజన్ల నుంచి ప్రశ్నల వర్షం కురిసింది. రానురాను ఇది చినికి చినికి గాలివానగా మారడం మొదలయ్యింది. దీంతో, శ్రేయాస్ అయ్యర్ ఈ విషయంపై క్లారిటీ ఇచ్చుకోవాల్సి వచ్చింది.
‘‘గత మ్యాచ్‌లో సీఈవో ప్రస్తావన తీసుకురావడం వెనుక అసలు ఉద్దేశం ఏమిటంటే.. తుది జట్టులో అవకాశాలు రాని ఆటగాళ్ళతో కలిసి, వారిని సర్దిచెప్పి, పరిస్థితుల్ని వివరించే పనిలో ఉంటారు. కొన్నిసార్లు మేము తుది జట్టుని ఎంపిక చేయడం కూడా కష్టంగా ఉంటుంది. ఎంపిక కాని ప్లేయర్లతో చూపులు కలపలేని స్థితిలో ఉంటాం. అప్పుడు సీఈవో జోక్యం చేసుకొని, వారికి పరిస్థితులు వివరిస్తారు’’ అంటూ శ్రేయాస్ క్లారిటీ ఇచ్చాడు. దీంతో.. సీఈవో వివాదానికి తెరపడినట్టు అయ్యింది. ఇక ఇదే సమయంలో.. హైదరాబాద్‌తో విజయం సాధించాక, ప్లేఆఫ్స్ ఆశల్ని సజీవంగా ఉంచుకోవడంపైనా కూడా అతడు మాట్లాడాడు.
‘‘హైదరాబాద్‌తో తలపడిన మ్యాచ్‌ని ఎలాగైనా గెలవాలని కసితో వచ్చాం. దృఢంగా మానసిక నిర్ణయం తీసుకున్నాం. మా ఆటగాళ్ళు కూడా భయం లేకుండా అద్భుతంగా రాణించారు. మా బ్యాటింగ్‌లో వీలైనంత ఎక్కువగా రసెల్‌కు ఆడే అవకాశం కల్పించాం. ఇక బౌలింగ్ విషయంలో నరైన్, వరుణ్ గొప్పగా రాణించి, కీలక వికెట్లు తీశారు. దీంతో, హైదరాబాద్ బ్యాట్స్మన్లను కట్టడి చేయగలిగాం’’ అని శ్రేయాస్ అయ్యర్ చెప్పుకొచ్చాడు. కాగా.. ఈ మ్యాచ్‌లో కోల్‌కతా 20 ఓవర్లలో 177/6 స్కోరు సాధించగా.. హైదరాబాద్ 123/8 స్కోరుతో ఘోర పరాజయం చవిచూసింది.
