Site icon NTV Telugu

Roger Federer: టెన్నిస్‌కు వీడ్కోలు పలికిన రాకెట్ వీరుడు.. రోజర్ ఫెదరర్

Roger Federer

Roger Federer

Roger Federer: ప్రపంచ టెన్నిస్ ప్రేమికులను కంటతడి పెట్టించే మరో చేదువార్త. సెరెనా విలియమ్స్ రిటైర్మెంట్‌తో అభిమానులు ఆ బాధను మరిచిపోక ముందే.. రెండు దశాబ్దాలకు పైగా క్రీడాభిమానులను తన ఆటతీరుతో ఆకట్టుకున్న స్విస్ దిగ్గజం రోజర్ ఫెదరర్ కూడా తన ప్రస్థానాన్ని ముగించాడు. రోజర్‌ ఫెదరర్ టెన్నిస్‌ ఎంత అందంగా ఆడవచ్చేనది చూపించాడు. సుధీర్ఘమైన కెరీర్‌లో ఘనమైన రికార్డులెన్ని సాధించినా వివాదాలకు దూరంగా ఉండే ‍వ్యక్తి ఫెదరర్‌. దాదాపు పాతికేళ్ల సుదీర్ఘ క్రీడా ప్రయాణంలో 103 సింగిల్స్‌.. 20 గ్రాండ్‌స్లామ్స్‌తో అభిమానులందరితో శభాష్ అనిపించుకోవడం అతడికి దక్కిన గౌరవం. సూపర్‌ సర్వీస్‌, ఫోర్‌హ్యాండ్‌ షాట్లను ప్రధాన ఆయుధంగా మలుచుకుని మైదానంలో క్లాసిక్‌ టెన్ని్‌సను ప్రదర్శించిన ఈ స్విస్‌ యోధుడు ఎన్నడూ వివాదాల జోలికి పోలేదు. జెంటిల్‌మన్‌గా పేరు తెచ్చుకోవడమే కాదు.. ఓ తరానికి ఆదర్శంగానూ నిలిచాడు.

ఆటతీరుతో, అసాధారణ ప్రదర్శనతో టెన్నిస్‌ ప్రపంచాన్ని ఉర్రూతలూగించిన వీరుడు రాకెట్‌ వదిలేయనున్నాడు. 24 ఏళ్ల పాటు సుదీర్ఘంగా సాగిన తన కెరీర్‌కు తెరదించుతూ.. 41 ఏళ్ల వయసులో రోజర్‌ ఫెదరర్‌ ప్రొఫెషనల్‌ టెన్నిస్‌కు వీడ్కోలు పలికాడు. 20 విజయాలతో పురుషుల సింగిల్స్‌లో అత్యధిక గ్రాండ్‌స్లామ్‌ టైటిళ్ల జాబితాలో మూడో స్థానంలో ఉన్న అతను గురువారం రిటైర్మెంట్‌ ప్రకటించాడు. వచ్చే వారం లండన్‌లో జరిగే లేవర్‌ కప్‌ తనకు చివరి టోర్నీ అని వెల్లడించాడు. తన నిర్ణయాన్ని ప్రకటిస్తూ ట్విటర్‌లో నాలుగు పేజీల లేఖ పోస్టు చేశాడు.

‘‘ఇన్ని సంవత్సరాలుగా టెన్నిస్‌ నాకు ఎన్నో విలువైన బహుమతులు ఇచ్చింది. ఈ ప్రయాణంలో నేను కలిసిన వ్యక్తులే. నా స్నేహితులు, ప్రత్యర్థులు, అభిమానులు ఆటకు ప్రాణం పోశారు. మీ అందరితో ఓ వార్త పంచుకోవాలనుకుంటున్నా. గత మూడేళ్లుగా గాయాలు, శస్త్రచికిత్సలు నాకు సవాలు విసిరాయని మీకు తెలుసు. తిరిగి పూర్తి స్థాయి పోటీతత్వంతో ఆటలోకి తిరిగొద్దామనుకున్నా. కానీ నా శరీరం సామర్థ్యం, పరిమితులు నాకు తెలుసు. అది నాకు ఆలస్యంగా ఓ సందేశం పంపింది. నాకిప్పుడు 41 ఏళ్లు. 24 ఏళ్లకు పైగా 1500 మ్యాచ్‌ల కంటే ఎక్కువ ఆడా. నా కల కంటే టెన్నిస్‌ నాకెంతో ఇచ్చింది. వచ్చే వారం లండన్‌లో ఆడే లేవర్‌ కప్‌ నా చివరి ఏటీపీ టోర్నీ. భవిష్యత్‌లో టెన్నిస్‌ ఆడతా. కానీ గ్రాండ్‌స్లామ్‌ లేదా టూర్‌ టోర్నీల్లో పాల్గొనను. ఇదో చేదు తీపి కలగలిసిన నిర్ణయం. నాతో ప్రతి నిమిషాన్ని గడిపిన నా భార్య మిర్కాకు ధన్యవాదాలు. గత 24 ఏళ్లు 24 గంటలుగా అనిపిస్తోంది. మరోవైపు పూర్తి జీవితాన్ని గడిపేశాననిపిస్తోంది’’ అని అందులో ఫెదరర్‌ లేఖలో పేర్కొన్నాడు.

Nitish Kumar: నితీష్‌ కుమార్ సంచలన ప్రకటన.. బీజేపీయేతర కూటమి గెలిస్తే ఆ రాష్ట్రాలకు ప్రత్యేక హోదా!

1998లో ప్రొఫెషనల్‌ టెన్నిస్‌లో అడుగుపెట్టిన ఫెదరర్‌ ఆ తర్వాత ఈ ఆటపై తనదైన ముద్ర వేయగలిగాడు. పదునైన సర్వీస్‌లతో పాటు ఫోర్‌హ్యాండ్‌, బ్యాక్‌హ్యాండ్‌, ఫుట్‌వర్క్‌, ఎటాకింగ్‌ గేమ్‌తో అదరగొట్టాడు. ఇక నెట్‌ గేమ్‌లో అయితే అతడికి తిరుగులేదు. రికార్డు స్థాయిలో 1526 సింగిల్స్‌ మ్యాచ్‌లు ఆడిన రోజర్‌.. ఏ ఒక్క మ్యాచ్‌లోనూ రిటైర్‌ కాకపోవడం అతడి శక్తిసామర్థ్యాలకు మచ్చుతునక. 2003లో వింబుల్డన్‌ ద్వారా తొలి గ్రాండ్‌స్లామ్‌ను దక్కించుకున్నాడు. అలాగే ఫ్రెంచ్‌ ఓపెన్‌ లేని లోటును 2009లో తీర్చుకుని కెరీర్‌ గ్రాండ్‌స్లామ్‌ను పూర్తి చేశాడు. 2004లో వరల్డ్‌ నెంబర్‌వన్‌గా నిలిచినప్పటి నుంచి 2009 వరకు పురుషుల టెన్నిస్‌ను శాసించాడు.

గత మూడేళ్లుగా అతడిని మోకాలి గాయం వేధిస్తోంది. 2020 ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ సెమీస్‌ తర్వాత రోజర్‌కు రెండు సర్జరీలు జరగగా.. ఆ తర్వాత గతేడాది వింబుల్డన్‌ ఓటమి తర్వాత మూడో సర్జరీ చేయించుకోవాల్సి వచ్చింది. దీంతో కోలుకోవడం కష్టమైన ఈ స్విస్‌ హీరో తనకెంతో ఇష్టమైన టెన్నిస్‌ను వదులుకునేందుకు సిద్ధమయ్యాడు.

Exit mobile version