NTV Telugu Site icon

INDvsAUS 1st Test: జడేజా చీటింగ్ చేశాడా? వైరల్‌గా మారిన వీడియో

In

In

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా నాగ్‌పూర్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా బౌలర్లు అదరగొట్టారు. ముఖ్యంగా స్పిన్నర్ రవీంద్ర జడేజా ఐదు వికెట్లతో ఆస్ట్రేలియా నడ్డి విరిచాడు. కాగా, ఈ మ్యాచ్ సమయంలో జడేజా చేసిన ఓ పని ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. దీంతో పలువురు దీనిపై భిన్నంగా స్పందిస్తున్నారు. కొందరు మాజీలు జడేజా బాల్ టాంపరింగ్‌కు పాల్పడ్డాడంటూ ఆరోపిస్తున్నారు. మరికొందరు మాత్రం అతడు తన వేలికి లోషన్ రాస్తున్నాడని అంటున్నారు.

అసలేం జరిగిందంటే!

ఇన్నింగ్స్ 16వ ఓవర్‌ వేసేందుకు జడేజా సిద్ధమయ్యాడు. క్రీజులో అలెక్స్ కారే, హ్యాండ్స్‌కాంబ్ ఉన్నారు. అప్పటికి ఆస్ట్రేలియా 120-5తో బ్యాటింగ్ చేస్తోంది. జడేజా 30 రన్స్ ఇచ్చి మూడు వికెట్లు కూడా తీసేశాడు. ఈ సమయంలో జడ్డూ బౌలింగ్ వేసే ముందు సిరాజ్‌ చేతిపై నుంచి ఏదో తీసుకున్నాడు. దానిని తన బౌలింగ్ వేస్తున్న చేతి వేలికి రాశాడు. ఇప్పుడు ఇదే వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. పలు అనుమానాలకూ తావిస్తోంది. ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్ ఇదే విషయమై స్పందిస్తూ.. జడేజా తన వేలికి ఏదో రాస్తున్నాడని.. ఇలాంటి సంఘటన తానెప్పుడూ చూడలేదు అంటూ రిప్లై ఇచ్చాడు.

ఇక ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 177 రన్స్‌కు ఆలౌటైంది. జడేజా ఐదు వికెట్లతో రాణించగా అశ్విన్ 3, షమీ, సిరాజ్ చెరో వికెట్ తీసుకున్నారు. అనంతరం తొలి ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ ప్రారంభించిన టీమిండియా మొదటి రోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టపోయి 77 రన్స్ చేసింది. కెప్టెన్ రోహిత్ శర్మ (56 నాటౌట్) సూపర్ ఫిఫ్టీ సాధించి జోరుమీదున్నాడు. కేఎల్ రాహుల్ (20) నిరాశపర్చాడు. రెండో రోజు భారత బ్యాటర్లు నిలదొక్కుకుని ఆస్ట్రేలియా ముందు కనీసం 200 టార్గెట్ ఉంచినా రోహిత్‌సేన గెలుపు ఖాయమని విశ్లేషకులు అంటున్నారు.

Also Read: Ravindra Jadeja: రోజూ 12 గంటలు బౌలింగ్ చేసేవాడిని: జడేజా