Site icon NTV Telugu

Rajasthan Royals: విమానంలోకి పొగమంచు.. ఆపేయాలంటూ కేకలు

Rr Flight Hit By Turbulence

Rr Flight Hit By Turbulence

రాజస్థాన్ రాయల్స్ ఆటగాళ్ళకు ఓ ఊహించని పరిణామం ఎదురైంది. తొలి క్వాలిఫయర్ మ్యాచ్ ఆడేందుకు ముంబై నుంచి కోల్‌కతాకు బయల్దేరిన రాజస్థాన్ బృందం ప్రత్యేక విమానంలో.. కాసేపు గందరగోళ పరిస్థితి నెలకొంది. మార్గమధ్యంలో అనుకోకుండా విమానంలోకి దట్టమైన పొగమంచు వచ్చేసింది. దీంతో, అందులో ఉన్న సభ్యులందరూ భయాందోళనలకు గురయ్యారు. ఏదో జరగరానిది జరగుతోందన్న భయంతో.. గట్టిగా కేకలు కూడా వేశారు. ఒక వ్యక్తి అయితే, విమానాన్ని అప్పటికప్పుడే కిందకు దించాలంటూ అరిచేశాడు. అయితే, కాసేపు తర్వాత పొగమంచు క్లియర్ కావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

అసలు ఈ పొగమంచు ఎలా లోపలికి వచ్చిందంటే.. కొన్ని రోజుల నుంచి కోల్‌కతా పరిసర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలోనే రాజస్థాన్ రాయల్స్ బృందం విమానం మేఘాల్లో నుంచి దూసుకుపోవడంతో, పొగమంచు చేరింది. వాతావరణ మార్పుల వల్లే ఈ పరిణామం చోటు చేసుకుందని తెలిసి, ఆటగాళ్లందరూ రిలాక్స్ అయ్యాడు. విమానం ల్యాండ్ అయ్యే సమయంలో.. ‘హల్లా బోల్’ అంటూ నినాదాలతో మార్మోగించారు. దీనికి సంబంధించిన వీడియోను రాజస్థాన్ తమ ట్విటర్ హ్యాండిల్‌లో పోస్టు చేయగా, అది ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతోంది.

ఇదిలావుండగా.. లీగ్ దశలో చెన్నై సూపర్ కింగ్స్‌పై విజయం సాధించడంతో, రాజస్థాన్ రాయల్స్ పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో నిలిచింది. మే 24వ తేదీన ఈడెన్ గార్డెన్స్‌లో ఈ జట్టు టేబుల్ టాపర్ అయిన గుజరాత్ టైటాన్స్‌తో తలపడనుంది. ఇందులో గెలిచిన జట్టు ఫైనల్‌కి వెళ్తే, ఓడిన జట్టుకి మరో అవకాశం దొరుకుతుంది. ఎలిమినేటర్‌లో గెలిచిన జట్టుతో తలపడాల్సి ఉంటుంది. ఆ క్వాలిఫయర్ 1లో ఎవరు గెలుస్తారో, వాళ్లు ఫైనల్‌కి చేరుకుంటారు.

Exit mobile version