Rahul Dravid’s 3 Untouchable Records: భారత క్రికెట్ చరిత్రలో అత్యుత్తమ బ్యాటర్లలో ‘ది వాల్’ రాహుల్ ద్రవిడ్ పేరు ముందు వరసలో ఉంటుంది. అద్భుతమైన టెక్నిక్, ఎంతో సహనం, ఒత్తిడిలోనూ నిలకడగా బ్యాటింగ్ చేయగల సామర్థ్యం ద్రవిడ్‌ను ప్రత్యేకమైన ఆటగాడిగా నిలబెట్టాయి. అందుకే అభిమానులు ఆయనను ప్రేమగా ‘ది వాల్’ అని పిలుచుకున్నారు. భారత జట్టు తరఫున 500కు పైగా అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన ద్రవిడ్.. తన కెరీర్‌లో ఎన్నో అద్భుత రికార్డులను నెలకొల్పాడు. అయితే అందులో మూడు రికార్డులు మాత్రం ఇప్పటికీ, ఎప్పటికీ ప్రత్యేకమైనవిగా నిలయనున్నాయి.
టెస్టుల్లో అత్యధిక బంతులు:
రాహుల్ ద్రవిడ్ టెస్ట్ క్రికెట్‌లో మొత్తం 31,258 బంతులను ఎదుర్కొన్నాడు. ప్రపంచంలో ఇన్ని బంతులను ఎదుర్కొన్న మొదటి బ్యాటర్ మనోడే. టెస్ట్ క్రికెట్‌లో అత్యధిక బంతులు ఎదుర్కొన్న ఆటగాళ్ల జాబితాలో భారత దిగ్గజం సచిన్ టెండూల్కర్ రెండో స్థానంలో ఉన్నాడు. సచిన్ తన కెరీర్‌లో 29,437 బంతులను ఎదుర్కొన్నాడు. ద్రవిడ్ బ్యాటింగ్ శైలికి ఈ రికార్డు అద్దం పడుతుంది. గంటల తరబడి క్రీజులో నిలబడి.. బౌలర్లను ఎదుర్కొంటూ జట్టుకు పరుగులు చేయడంలో ఆయనకు తిరుగులేదు. అందుకే ‘ది వాల్’ అనే పేరు ఆయనకు సరిగ్గా సరిపోయింది.
క్రీజులో అత్యధిక సమయం:
టెస్ట్ క్రికెట్‌లో క్రీజులో అత్యధిక సమయం గడిపిన ఆటగాడిగానూ రాహుల్ ద్రవిడ్ రికార్డు సృష్టించాడు. టెస్ట్ కెరీర్‌లో 44,152 నిమిషాలు క్రీజులో గడిపాడు. 286 ఇన్నింగ్స్‌లలో ద్రవిడ్ ఈ ఘనత సాధించాడు. ఈ జాబితాలోనూ సచిన్ టెండూల్కర్ రెండో స్థానంలో ఉన్నాడు. సచిన్ 329 ఇన్నింగ్స్‌లలో 41,304 నిమిషాలు క్రీజులో గడిపాడు. అంటే సచిన్ వంటి దిగ్గజ ఆటగాడిని కూడా ఈ విషయంలో ద్రవిడ్ అధిగమించాడు.
టెస్టుల్లో అత్యధిక సెంచరీ భాగస్వామ్యాలు:
టెస్ట్ క్రికెట్‌లో మరో అరుదైన రికార్డు కూడా ద్రవిడ్ పేరిటే ఉంది. టెస్టుల్లో అత్యధిక సెంచరీ భాగస్వామ్యాలు నెలకొల్పాడు. కెరీర్‌లో 100 లేదా అంతకంటే ఎక్కువ పరుగుల భాగస్వామ్యాల్లో 88 సార్లు భాగమయ్యాడు. సచిన్ టెండూల్కర్ 86 సెంచరీ భాగస్వామ్యాలతో ద్రవిడ్ తర్వాతి స్థానంలో ఉన్నాడు. ద్రవిడ్, సచిన్ కలిసి టెస్టుల్లో 20 సెంచరీ భాగస్వామ్యాలు నెలకొల్పారు.
టెస్టుల్లో 13 వేలకు పైగా పరుగులు:
రాహుల్ ద్రవిడ్ టెస్ట్ కెరీర్‌లో 164 మ్యాచ్‌ల్లో 13,288 పరుగులు చేశాడు. 52.31 సగటుతో పరుగులు సాధించిన ఆయన ఖాతాలో 36 సెంచరీలు, 63 అర్ధసెంచరీలు ఉన్నాయి. టెస్టుల్లో ద్రవిడ్ అత్యధిక స్కోరు 270 పరుగులు. వన్డే క్రికెట్‌లోనూ ద్రవిడ్ తనదైన ముద్ర వేశాడు. 344 వన్డేల్లో 10,889 పరుగులు బాదాడు. ఇందులో 12 సెంచరీలు, 83 అర్ధసెంచరీలు సాధించాడు. వన్డేల్లో ద్రవిడ్ అత్యధిక స్కోరు 153 పరుగులు.
ఆటగాడిగానే కాదు.. కోచ్‌గానూ సక్సెస్:
ఆటగాడిగా రిటైర్ అయిన తర్వాత కూడా రాహుల్ ద్రవిడ్ భారత క్రికెట్‌కు తన సేవలను అందించాడు. కోచ్‌గా యువ ఆటగాళ్లను తీర్చిదిద్దడంలో కీలక పాత్ర పోషించాడు. ఆయన మార్గదర్శకత్వంలో భారత్ 2018 అండర్-19 ప్రపంచకప్ గెలిచింది. ఆ తర్వాత భారత సీనియర్ జట్టుకు ప్రధాన కోచ్‌గా వ్యవహరించిన ద్రవిడ్.. 2024 టీ20 ప్రపంచకప్‌లో టీమిండియాను ఛాంపియన్‌గా నిలిపాడు. అలాగే 2023 ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్, 2023 వన్డే ప్రపంచకప్ ఫైనల్‌కు భారత్ చేరడంలోనూ కీలక పాత్ర పోషించాడు. ఇవన్నీ భారత క్రికెట్‌లో ఆయన్ను ఎప్పటికీ ప్రత్యేకంగా నిలబెట్టే రికార్డులుగా మిగిలిపోతాయి.

