ఈ ఏడాది ఐపీఎల్ సీజన్‌లో భాగంగా ఆఖరి లీగ్ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో తలపడిన పంజాబ్ కింగ్స్ ఘనవిజయం సాధించింది. హైదరాబాద్ నిర్దేశించిన 158 పరుగుల లక్ష్యాన్ని పంజాబ్ జట్టు సునాయాసంగా చేధించింది. ఇది ఆ జట్టుకి ఏడో విజయం. ఈ మ్యాచ్‌తో లీగ్ దశ ముగిసింది. ఈ గెలుపుతో పంజాబ్ పాయింట్ల పట్టికలో ఆరో స్థానంలో నిలవగా.. హైదరాబాద్ ఎనిమిదో స్థానంతో సరిపెట్టుకుంది.
తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకొన్న హైదరాబాద్.. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసింది. అభిశేక్ శర్మ (43), షెపర్డ్ (26), సుందర్ (25) పరుగులతో రాణించడంతో.. హైదరాబాద్ అంత మాత్రం స్కోరు చేయగలిగింది. పంజాబ్ బౌలర్లు క్రమశిక్షణతో కూడిన బౌలింగ్ వేయడం వల్ల, హైదరాబాద్‌ని తక్కువ స్కోరుకే కట్టడి చేయగలిగారు. హర్‌ప్రీత్ బ్రార్, నథన్ ఎలిస్ చెరో మూడు వికెట్లు తీసుకోగా.. కగిసో రబాడా ఒక వికెట్ తీశాడు.
ఇక 158 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగన పంజాబ్.. మొదట్నుంచే ధాటిగా ఆడింది. పవర్‌ప్లే ముగిసే సమయానికి.. 62/1 స్కోరుతో బలంగా నిలిచింది. ఆ తర్వాత వెనువెంటనే వికెట్లు పడినా.. ధావన్‌తో (39) కలిసి లివింగ్‌స్టోన్ (41) మెరుపు మెరిపించడం వల్ల పంజాబ్ లక్ష్యం దివగా సాగింది. షెపర్డ్ వేసిన 15వ ఓవర్‌లో లివింగ్‌స్టోన్ రెండు ఫోర్లు, సిక్సులు బాది.. జట్టుని గెలిపించాడు. హైదరాబాద్ బౌలర్స్‌లో ఫారుకీ రెండు వికెట్లు తీయగా.. సుందర్, సుచిత్, మాలిక్ చెరో వికెట్ తీశారు.
