NTV Telugu Site icon

భారత్‌ మహిళల హాకీ జట్టుపై ప్రశంసలు జల్లు…

విశ్వ క్రీడలు…ఒలింపిక్స్‌లో మహిళల హాకీ జట్టు ప్రదర్శనకు…దేశం మొత్తం అండగా నిలబడుతోంది. పతకం సాధించికపోయినా…అద్భుతంగా ఆడారంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. గుజరాత్‌కు చెందిన ప్రముఖ వజ్రాల వ్యాపారి డోలాకియా…ప్లేయర్స్‌కు నగదు బహుమతి ప్రకటించారు.

ఒలింపిక్స్‌లో అద్భుత ఆటతీరుతో ఆకట్టుకున్న భారత్‌ మహిళల హాకీ జట్టుపై ప్రశంసలు జల్లు కురుస్తోంది. రాణి రాంపాల్ సేనకు…దేశం మొత్తం అండగా నిలిచింది. మహిళా బృందం అద్భుత ప్రదర్శనకు యావత్‌ దేశం జైకొట్టింది. మహిళల జట్టు ఒలింపిక్స్‌లో అత్యుత్తమంగా నాలుగో స్థానం సాధించింది. గుజరాత్‌కు చెందిన వజ్రాల వ్యాపారి సావ్జీ ధోలాకియా భారత హకీ జట్టులోని అమ్మాయిలు సొంత ఇంటిని నిర్మించుకునేందుకు ఒక్కొక్కరికి 11 లక్షల చొప్పున ఇస్తానని ప్రకటించారు. ఇప్పటికే ఇల్లు ఉన్న వారి 5 లక్షల విలువచేసే కారు అందజేస్తామని తెలిపారు. అమెరికాకు చెందిన ఓ వ్యక్తి భారత హాకీ జట్టు ప్లేయర్స్‌కు అదనంగా లక్ష రూపాయలు ఇవ్వడానికి ముందుకు వచ్చినట్టు చెప్పారు.

మరోవైపు హాకీ జట్టులో సభ్యురాలైన లాల్‌ రెమ్సియామికి…నజరానా ప్రకటించారు మిజోరం ముఖ్యమంత్రి జోరంథంగా. 25 లక్షల నగదు, ఇంటి స్థలంతోపాటు ఉద్యోగం ఇస్తున్నట్టు వెల్లడించారు. సొంత ఊరిలోనే ఇంటి స్థలం ఇస్తామన్నారు. ఆమె శిక్షణ కోసం ప్రభుత్వం ఇప్పటికే రూ. 20 లక్షలు మంజూరు చేసింది. 21 ఏళ్ల లాల్‌ రెమ్సియామి మిజోరం నుంచి భారత జట్టుకు ఎంపికైన తొలి మహిళ హాకీ క్రీడాకారిణి.

టోక్యో క్రీడల్లో నాలుగో స్థానంతో చరిత్ర సృష్టించింది రాణి రాంపాల్‌ సేన. మెరుగైన ఫలితాలు సాధించాలంటే మరిన్ని అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడాలన్నారు చీఫ్‌ కోచ్‌ జోర్డ్‌ మార్జిన్‌. భారత్‌లో మహిళల హాకీ అభివృద్ధి చెందాలంటే జాతీయ లీగ్‌ను ప్రారంభించాలని..హాకీ సమాఖ్యకు సూచించారు. ఓడినందుకు బాధగానే ఉంటుందని…మేం గెలవాల్సిందని మార్జిన్‌ చెప్పారు. నిజంగా అమ్మాయిలను చూసి గర్వపడుతున్నానని వెల్లడించారు. వారు పోరాట పటిమ, నైపుణ్యాలను ప్రదర్శించారని మార్జినె తెలిపారు. ప్రపంచం సరికొత్త భారత జట్టును చూసిందని…అందుకు గర్వపడుతున్నానని స్పష్టం చేశారు.

కోచ్‌గా నాలుగేళ్ల కిందట భారత్‌లో అడుగుపెట్టిన మార్జినే..2017లో తొలుత మహిళల జట్టు కోచ్‌గా బాధ్యతలు నిర్వర్తించాడు. అదే ఏడాది పురుషుల జట్టు కోచ్‌గా నియమితుడయ్యాడు. 2018లో మహిళల జట్టు కోచ్‌గా మళ్లీ బాధ్యతలు చేపట్టాడు. తన కాంట్రాక్టును పొడిగించేందుకు హాకీ సమాఖ్య అంగీకరించినా వ్యక్తిగత కారణాలతో కొనసాగడం లేదని ప్రకటించారు.