NTV Telugu Site icon

పింక్‌బాల్‌ టెస్ట్‌.. ఎందుకంత స్పెషల్‌..!

పింక్‌బాల్‌ టెస్ట్‌..! ఎందుకంత స్పెషల్‌..! డే అండ్‌ నైట్‌ మ్యాచ్‌లతో టెస్ట్‌లకు ఆదరణ పెరిగిందా..? మున్ముందు ఇదే ఫార్మాట్‌ రాబోతుందా..? అసలు ఇప్పటివరకు ఎన్ని టెస్ట్‌లు జరిగాయ్‌..! పింక్‌బాల్‌ టెస్ట్‌ల హిస్టరీ ఏంటి..?

డే అండ్‌ నైట్‌ టెస్ట్‌..! ఇప్పుడు దీనిపై ఆసక్తికర చర్చ సాగుతోంది. నిజానికి టెస్ట్‌ అంటేనే స్లోగా సాగే ఆట.  గంటల కొద్దీ క్రీజులో ఉండి.. ఎప్పుడో ఓసారి కొట్టే ఫోర్‌ కోసం ఎదురుచూసే ప్రేక్షకులు ఇప్పుడు కరవయ్యారు. అందుకే టెస్ట్‌లకు పెద్దగా క్రికెట్‌ అభిమానులు రావడం లేదు. పైగా టీ-ట్వంటీ, ఐపీఎల్‌ వంటి లీగ్‌లు పెరగడంతో.. పొట్టి క్రికెట్‌ మోజులో.. టెస్ట్‌ క్రికెట్‌ చరిత్ర మసకబారింది. అందుకే ఇప్పుడు ఈ మ్యాచ్‌లకు ఆదరణ తెచ్చేందుకు డే అండ్‌ నైట్‌ టెస్ట్‌ మార్గాన్ని ఎంచుకున్నారు. ఇందుకోసం పింక్‌బాల్స్‌ను ఉపయోగిస్తున్నారు. అందుకే పింక్‌ బాల్‌ టెస్ట్‌.. ఇప్పుడు క్రికెట్‌లో ఆసక్తికరంగా మారింది. 

నిజానికి పింక్‌ బాల్‌ టెస్ట్‌లను 2017 నుంచే ఆడుతున్నాయి జట్లు. ఇప్పటివరకు 15 పింక్‌ బాల్‌ టెస్ట్‌లు జరిగాయి. ఇందులో ఆస్ట్రేలియా అత్యధికంగా ఎనిమిది టెస్ట్‌లు ఆడింది. ఇవన్నీ సొంత గడ్డ మీదే..! ఈ ఎనిమిది మ్యాచ్‌ల్లోనూ విజయం సాధించింది. డే అండ్‌ నైట్‌ టెస్టుల్లో ఆస్ట్రేలియాదే హయ్యేస్ట్‌ విన్నింగ్‌ రికార్డు..! తర్వాత శ్రీలంక రెండు మ్యాచ్‌లు గెలిచింది. ఇప్పుడు మొతేరా మ్యాచ్‌తో భారత్‌ మూడో పింక్‌బాల్‌ టెస్ట్‌ ఆడుతుండగా.. ఇంగ్లండ్‌ నాలుగో మ్యాచ్‌ ఆడేందుకు సిద్ధమైంది. భారత్‌ రెండు మ్యాచ్‌ల్లో ఒకటి గెలవగా.. మరోటి ఓడిపోయింది. ఈడెన్‌ గార్డెన్‌ మ్యాచ్‌లో ఇన్నింగ్‌ తేడాతో గెలిచింది. కానీ అడిలైడ్‌లో 36 పరుగులకే ఆలౌట్‌ అయి.. చిత్తుగా ఓడింది. అయితే సొంత గడ్డపై భారత్‌కు మంచి రికార్డే ఉంది. ఇక ఇంగ్లాండ్‌ 3 పింక్‌ బాల్‌ టెస్ట్‌లు ఆడగా.. ఒక్కటి మాత్రమే గెలిచింది. 2017లో బర్మింగ్‌హమ్‌లో వెస్టిండీస్‌పై విజయం సాధించింది. కానీ 2017లోనే అడిలైడ్‌లో ఆస్ట్రేలియా చేతిలో.. 2018లో ఆక్లాండ్‌ టెస్ట్‌లో న్యూజిలాండ్‌ చేతిలో ఇంగ్లండ్ ఓటమి పాలైంది. 

ఇందులో సొంతగడ్డపై జరిగిన పింక్‌బాల్‌ టెస్ట్‌ల్లో దాదాపు హోమ్‌ టీమే విజయం సాధించింది. ఇప్పుడు టీమిండియాకు కూడా ఇదే సానుకూల అంశం. అయితే ఇందులో టాస్‌ కీలకంగా మారనుంది. ఇప్పటివరకు టాస్‌ గెలిచిన జట్టు 8 సార్లు మ్యాచ్‌ను గెలిచింది. అలాగే మొదట బ్యాటింగ్‌ జట్టు 8 సార్లు గెలవగా.. ఏడుసార్లు ఓడిపోయింది. పింక్‌బాల్‌ టెస్ట్‌ల్లో బౌలర్లదే ఆధిపత్యం. ఇందులో సీమర్లకు 354 వికెట్లు దక్కగా.. స్పిన్నర్లకు 115 వికెట్లు దక్కాయి. 

పింక్‌బాల్‌ టెస్ట్‌లు ఆడిన 15 మ్యాచ్‌ల్లో ఫలితం తేలింది. అందుకే పింక్‌బాల్‌ టెస్ట్‌లను కొనసాగించాలన్న డిమాండ్‌ కూడా ఉంది. అయితే పుజారా లాంటి క్రికెటర్లు మాత్రం తమకు రెడ్‌బాల్‌ మ్యాచ్‌లే బాగుంటాయ్‌ అని చెబుతున్నారు. పింక్‌బాల్‌తో పుజారా ఇబ్బంది పడుతున్నట్లు గతంలో చెప్పాడు. మొత్తంగా పింక్‌బాల్‌ టెస్ట్‌ల హిస్టరీ ఇది..! సుధీర్ఘ ఫార్మాట్‌ దశ మారుతుందని ఐసీసీ నమ్ముతోంది. అందుకే ఈ టెస్ట్‌లు ఇప్పుడు స్పెషల్‌ అట్రాక్షన్‌గా నిలుస్తున్నాయ్‌.