టీమిండియా క్రికెట్ ఫ్యాన్స్ అందరూ ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్న భారత్-ఆస్ట్రేలియా టెస్టు సిరీస్ కొద్ది రోజుల్లో ప్రారంభం కానుంది. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా నాలుగు టెస్టుల సిరీస్ ఆడటానికి ఇండియాకు రానుంది ఆస్ట్రేలియా టీమ్. చాలా రోజులుగా ఇండియా దగ్గరే ఉన్న ఈ ట్రోఫీని ఎగరేసుకుపోవాలని ఆ టీమ్ పట్టుదలతో ఉంది. స్వదేశంలో వరుస విజయాలతో వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్ టేబుల్లో నెంబర్ వన్‌గా ఉన్న ఆ టీమ్.. 2004 తర్వాత తొలిసారి ఇండియా గడ్డపై టెస్టు సిరీస్ గెలవాలని చూస్తోంది.అయితే సిరీస్ ప్రారంభానికి ముందే ఆ టీమ్‌కు షాక్ తగిలింది. స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ గాయం కారణంగా తొలి టెస్టు ఆడటం లేదు. గతేడాది అతని చేతి వేలికి గాయమైంది. దీని నుంచి తాను ఇంకా కోలుకుంటున్నానని, తొలి టెస్టు ఆడటం లేదని అతడు వెల్లడించాడు. సౌతాఫ్రికాతో టెస్టు సిరీస్ సందర్భంగా స్టార్క్ గాయపడ్డాడు.
తాజాగా ఆస్ట్రేలియన్ క్రికెట్ అవార్డుల్లో స్టార్క్ పాల్గొన్నాడు. ఈ సందర్భంగా విలేకరి అతని గాయం గురించి ప్రశ్నించగా.. ఈ విషయం చెప్పాడు. “గాయం నుంచి కోలుకుంటున్నా. మరో రెండు వారాలు పడుతుంది. బహుశా అప్పుడు ఢిల్లీలో ఉండబోయే మా టీమ్ మేట్స్‌తో నేను కలుస్తానని అనుకుంటున్నా. అప్పటికే వాళ్లు తొలి టెస్టు విజయం సాధిస్తారని భావిస్తున్నా. అప్పటి నుంచి ట్రైనింగ్ ప్రారంభిస్తా. ఇండియాలో కండిషన్స్ నుంచి ఏం ఆశించవచ్చో ఎప్పుడూ అంచనా వేయలేం. అయితే అక్కడ బంతి టర్న్ అవుతుందని మాత్రం మాకు తెలుసు. ఆట ప్రారంభమయ్యేంత వరకూ లేదంటే ఏ వికెట్‌పై ఆడుతున్నామో తెలిసేంత వరకూ ఏం జరుగుతుందో చెప్పలేం. అందుకే ఇదో గొప్ప సవాలు. ఇండియా టూర్‌కు వెళ్లే ముందు టీమ్ మంచి జోరులో ఉంది. ఓవైపు విమెన్స్ టీమ్ వరల్డ్ కప్ కోసం వెళ్తుంటే.. మేము ఇండియా టూర్‌కు వెళ్తున్నాం. వచ్చే రెండు నెలల్లో మంచి క్రికెట్ చూసే అవకాశం కలుగుతుంది. ఆస్ట్రేలియాకు మంచి సక్సెస్ దక్కాలని ఆశిస్తున్నా” అని స్టార్క్ అన్నాడు.