NTV Telugu Site icon

Kapil Dev: గొప్ప ఆటగాళ్లు అయితే సరిపోదు.. ఆ ఇద్దరిపై హాట్ కామెంట్స్

91143089

91143089

IPL 2022 సీజన్‌లో దారుణంగా విఫలమైన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీలు తమ ఆట తీరు మార్చుకోవాలని భారత దిగ్గజ సారథి కపిల్ దేవ్ అన్నాడు. పేరుకు పెద్ద ఆటగాళ్లు అయితే సరిపోదని, జట్టు విజయాల్లో తమ వంతు పాత్ర పోషించాలని తెలిపాడు. అలా చేయకుంటే జట్టు నుంచి తప్పించడం మేలని అభిప్రాయపడ్డాడు.

IPL 2022 సీజన్‌లో ముంబై సారథి రోహిత్ శర్మ 14 మ్యాచ్‌ల్లో 19.14 సగటుతో 268 పరుగులే చేశాడు. ఇందులో ఒక్క హాఫ్ సెంచరీ కూడా లేదు. ఇక విరాట్ కోహ్లీ 16 మ్యాచ్‌ల్లో 22.73 సగటుతో 341 పరుగులు చేశాడు. ఇందులో రెండు హాఫ్ సెంచరీలు మాత్రమే ఉన్నాయి. టీమిండియా భవిష్యత్తు టోర్నీల దృష్ట్యా ఈ ఇద్దరి పేలవ ఫామ్ ఆందోళనకు గురి చేస్తోంది.

ఈ క్రమంలోనే రోహిత్, కోహ్లీ వైఫల్యంపై కపిల్‌ దేవ్‌ తాజాగా ఓ యూట్యూబ్‌ చానల్‌తో మాట్లాడారు. రోహిత్‌, కోహ్లీ, కేఎల్‌ రాహుల్‌ లాంటి ఆటగాళ్లు ఒత్తిడికి గురికాకుండా ఆడాలన్నారు. ‘ఈ ముగ్గురూ పెద్ద ఆటగాళ్లే. వారిపై భారీ అంచనాలు ఉండటం వల్ల కూడా తీవ్ర ఒత్తిడికి గురవుతున్నట్టు ఉన్నారు. అయితే, అది వారికి సమస్య కాకూడదు. వీరు భయం లేకుండా, ధాటిగా ఆడాలి. కోహ్లీ, రోహిత్‌, రాహుల్‌.. 150-160 స్ట్రైక్‌రేట్‌తో ఆడగల సత్తా ఉన్న ఆటగాళ్లే.

అంత గొప్ప బ్యాట్స్‌మెన్‌ అయినా కీలక సమయాల్లో చేతులెత్తేస్తున్నారు. పరుగులు చేయాల్సినప్పుడు ఔటవుతున్నారు. వాళ్లు క్రీజులో నిలవాలంటే మొదట కొన్ని బంతులు ఆడితే మంచిది. కానీ, నాలుగైదు ఓవర్లు ఆడాక ఔటైతే ఎలా? గేర్‌ మార్చి ధనాధన్‌ బ్యాటింగ్‌ చేయాల్సినప్పుడు ఔటైతేనే ఒత్తిడికి గురవుతారు. వాళ్లు హీరోలుగా మిగలాలనుకుంటున్నారా లేక జీరోలుగా మారాలనుకుంటున్నారా అనేది ఆయా ఆటగాళ్లు, జట్టే నిర్ణయించుకోవాలి.

వాళ్లు తమ ఆటతీరు మార్చుకోవాలి. అది సాధ్యంకాకపోతే వారిని తప్పించాల్సిన అవసరం ఉంది. వాళ్లు నిజంగా పెద్ద ఆటగాళ్లే అయితే, అలాంటి ప్రదర్శనలే చేయాలి. పేరుకే గొప్ప ఆటగాళ్లైతే సరిపోదు. ప్రదర్శన కూడా అలాగే ఉండాలి’ అని కపిల్‌ ఘాటు వ్యాఖ్యలు చేశాడు. గతేడాది దుబాయ్ వేదికగా జరిగిన టీ20 ప్రపంచకప్‌లో సీనియర్ ఆటగాళ్ల పేలవ ప్రదర్శన జట్టు దారుణ వైఫల్యానికి కారణమైంది. ముఖ్యంగా పాకిస్థాన్‌తో జరిగిన కీలక మ్యాచ్‌లో రోహిత్, కేఎల్ రాహుల్ వెనువెంటనే ఔటవ్వడం భారత విజయవకాశాలను దెబ్బతీసింది.