India Women vs Zimbabwe Women 2nd T20I: భారత మహిళల జట్టు బ్యాటింగ్ విధ్వంసానికి జింబాబ్వే మహిళల జట్టు కెప్టెన్ జోసెఫిన్ న్కోమో ఫిదా అయ్యారు. భారత్‌తో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో తమ జట్టు ఓటమి పాలైనప్పటికీ.. భారత బ్యాటర్ల ఆటతీరు నుంచి ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చని ఆమె అభిప్రాయపడ్డారు. భారత జట్టు బ్యాటింగ్‌ను అద్భుతమైన మాస్టర్‌క్లాస్‌గా అభివర్ణించారు. మైదానంలో భారత బ్యాటర్లు సృష్టించిన విధ్వంసాన్ని చూస్తూ తాము నేర్చుకోవాల్సి వచ్చిందని పేర్కొన్నారు.
రాయ్‌పూర్‌లోని షహీద్ వీర్ నారాయణ్ సింగ్ అంతర్జాతీయ స్టేడియంలో ఆదివారం జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో భారత్ 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన జింబాబ్వే మహిళల జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 102 పరుగులు చేసింది. అనంతరం 103 పరుగుల లక్ష్యాన్ని భారత్ కేవలం 8.5 ఓవర్లలోనే ఒక వికెట్ కోల్పోయి ఛేదించింది. మ్యాచ్ అనంతరం జింబాబ్వే కెప్టెన్ జోసెఫిన్ న్కోమో మాట్లాడుతూ.. భారత జట్టు బ్యాటింగ్‌ను ప్రత్యక్షంగా చూడటం తమకు ఒక పాఠంలాంటిదని చెప్పారు. ఇలాంటి ప్రదర్శనను అనుభవపూర్వకంగా చూడటం కంటే గొప్పగా నేర్చుకునే మార్గం మరొకటి లేదని అభిప్రాయపడ్డారు. భారత బ్యాటర్లు ఆడిన తీరు తమకు ఎంతో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.
తమ జట్టు ఓటమికి పవర్‌ప్లేలో సరైన ఆరంభం లభించకపోవడమే ప్రధాన కారణమని జోసెఫిన్ న్కోమో విశ్లేషించారు. ‘ఈ రోజు మా ప్రదర్శనలో అసలు సమసి ఏమిటంటే.. పవర్‌ప్లేలో మాకు మంచి ఆరంభం లభించలేదు. తదుపరి మ్యాచ్‌లో అయినా మంచి ఆరంభం లభిస్తుందని ఆశిస్తున్నాం. బలమైన పునాది వేసుకుంటే మిగతా బ్యాటర్లు ఇన్నింగ్స్‌ను చక్కగా ముగించగలుగుతారు. అప్పుడు మా బౌలర్లపై కూడా ఎక్కువ ఒత్తిడి పడదు. వచ్చే మ్యాచ్‌లో బాగా ఆడుతాం. విజయం సాదించేందుకు మా వంతు ప్రయత్నం చేస్తాం’ అని జోసెఫిన్ ధీమా వ్యక్తం చేశారు.
తొలి రెండు మ్యాచ్‌ల నుంచి నేర్చుకోవాల్సిన అంశాలు చాలా ఉన్నాయని జింబాబ్వే జోసెఫిన్ కెప్టెన్ పేర్కొన్నారు. ‘నేను ముందే చెప్పినట్లుగా మేము నేర్చుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. భారత బ్యాటర్లు ఆడే విధానాన్ని గమనించడం ద్వారా ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చు. వారు ఎలా బ్యాటింగ్ చేస్తున్నారో పరిశీలించి, వారి ఆటతీరులోని మంచి అంశాలను మేము కూడా అనుసరించగలిగితే అది మా జట్టుకు ఎంతో ఉపయోగపడుతుంది. అన్ని అనుకూలంగా సాగితే భవిష్యత్తులో మెరుగైన ఫలితాలు దక్కుతాయి. ఓటమి నుంచి పాఠాలు నేర్చుకుని తదుపరి మ్యాచ్‌లో మెరుగైన ప్రదర్శన ఇవ్వడమే మా లక్ష్యం’ అని జోసెఫిన్ చెప్పుకొచ్చారు.

