Site icon NTV Telugu

James Anderson: మన్కడింగ్ వివాదం.. అది చట్టబద్ధమైనది కాదు

James Anderson Mankading

James Anderson Mankading

James Anderson Sensational Comments On Deepti Sharma Mankading Out: ఇంగ్లండ్‌తో జరిగిన మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భాగంగా.. మూడో మ్యాచ్‌లో చార్లీ డీన్‌ను దీప్తి శర్మ మన్కడింగ్ విధానంలో చేసిన రనౌట్‌పై ఇంకా వాడీవేడీ చర్చలు కొనసాగుతూనే ఉన్నాయి. దీప్తి శర్మ చేసిన రనౌట్ న్యాయబద్దమైనది కాదని ఇంగ్లండ్ వాళ్లు వాదిస్తుంటే, అందుకు కౌంటర్‌గా మనోళ్లు కూడా రియాక్ట్ అవుతున్నారు. ఇప్పుడు తాజాగా ఇంగ్లండ్ పేసర్ జేమ్స్ అండర్సన్ ఆ వివాదంపై స్పందించాడు. బౌలర్‌ బంతిని వేస్తున్న క్రమంలో.. నాన్‌స్ట్రైకర్‌ ముందుకు వెళ్లిన సందర్భంలో చేసే ఔట్‌ చట్టబద్ధమైనది కాదని అభిప్రాయపడ్డాడు. తమ బ్యాటర్‌ ముందుకు వెళ్లడం తప్పు కాదన్నట్టుగా అతడు చెప్పేందుకు ప్రయత్నించాడు.

ఆ మన్కడింగ్ సంఘటనపై 30 సెకన్ల పాటు ఆలోచించినప్పుడు తనకు కాస్త ఆగ్రహం వచ్చిందని, అయితే ప్రతి ఒక్కరికీ తమ అభిప్రాయాల్ని వెల్లడించే అవకాశం ఉందని అన్నాడు. ఇలాంటి రనౌట్ చేసేందుకు మొగ్గు చూపని జట్టుతో తాను ఆడుతున్నానని, ప్రస్తుతం దీన్ని చట్టబద్ధం చేశారు కాబట్టి దాన్ని రనౌట్‌గానే పరిగణించాలని అన్నాడు. ఇప్పటినుంచైనా ఆటగాళ్లు క్రీజులో ఉండేందుకు ప్రయత్నిస్తానని తాను ఆశిస్తున్నానన్నాడు. ఛార్లీ డీన్‌కు జరిగిన దానిపై తాను చాలా ఫీలవుతున్నానని.. ఆమె అలా రనౌట్ అవ్వకుండా ఆడి ఉంటే, ఇంగ్లండ్ తప్పకుండా గెలిచే అవకాశం ఉండేదని అన్నాడు. బౌలర్‌తోపాటు బ్యాటర్ కూడా ముందుకెళ్లడం సహజమన్న అతగాడు.. దీప్తి శర్మ మాత్రం బౌలింగ్ చేయడానికి వచ్చినట్లు లేదని, చార్లీ ముందుకెళ్లడం గమనించి రనౌత్ చేసిందని అన్నాడు.

ఈ వ్యవహారంపై తాము ముందుగానే వార్నింగ్ ఇచ్చామని భారత ఆటగాళ్లు చెప్తున్నారని, కానీ ఇంగ్లండ్ క్రికెటర్లు మాత్రం తమకెలాంటి హెచ్చరికలు రావడం లేదంటున్నారని జేమ్స్ పేర్కొన్నాడు. ఏదేమైనా.. దీన్ని తాను చట్టబద్ధమైన ఔట్‌గా చూడనని అన్నాడు. ‘‘ఇందులో నైపుణ్యం ఎక్కడుంది..? ఇలా ఔట్ చేయడానికి ఇదొక దొంగచాటు మార్గం.. అది నాకు ఇష్టం లేదు’’ అని చెప్పుకొచ్చాడు. తాను ఇంగ్లండ్ ఆటగాడిగానే కాకుండా.. వేరే మ్యాచ్‌ అయినా, ఇలాంటి సంఘటన జరిగితే ఇష్టపడనని అండర్సన్‌ వెల్లడించాడు.

Exit mobile version