భారత క్రికెట్‌కు విశేష సేవలు అందించిన మాజీ బీసీసీఐ అధ్యక్షుడు ఇందర్‌జిత్ సింగ్ బింద్రా (84) కన్నుమూశారు. ఆదివారం న్యూఢిల్లీలో ఆయన తుదిశ్వాస విడిచారు. ఇంద్రజిత్ బింద్రా మరణంతో భారత క్రికెట్ పరిపాలనా రంగంలో ఒక శకం ముగిసినట్లయ్యింది. మాజీ అండ్ ప్రస్తుత క్రికెటర్స్ ఆయన మృతికి సంతాపం వ్యక్తం చేస్తున్నాయి. ఇందర్‌జిత్ బింద్రా 1993 నుంచి 1996 వరకు బీసీసీఐ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహించారు. అంతేకాకుండా, 1978 నుంచి 2014 వరకు మొత్తం 36 సంవత్సరాల పాటు పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా సేవలందించారు. 2014లో క్రికెట్ పరిపాలన నుంచి తప్పుకున్న ఆయన భారత క్రికెట్ ఎదుగుదలలో కీలక పాత్ర పోషించారు.
భారత్‌కు 1987 క్రికెట్ వరల్డ్ కప్ ఆతిథ్య హక్కులు దక్కించడంలో బింద్రా పాత్ర కీలకం. యూకే వెలుపల తొలిసారి వరల్డ్ కప్ నిర్వహించిన ఘనత భారత్‌కు దక్కడం వెనుక ఆయన కృషి ఎంతో ఉంది. ఇది భారత క్రికెట్ చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచింది. పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో మొహాలీలోని అత్యాధునిక పీసీఏ స్టేడియం అభివృద్ధికి బింద్రా కీలకంగా సహకరించారు. ఆ స్టేడియాన్ని ఆయన గౌరవార్థం ఇందర్‌జిత్ సింగ్ బింద్రా స్టేడియంగా పేరు మార్చారు. ఈ స్టేడియం ఎన్నో చారిత్రాత్మక అంతర్జాతీయ మ్యాచ్‌లకు వేదికైంది.
Also Read: Governor Abdul Nazeer: పేదరిక నిర్మూలనే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకెళుతోంది!
భారత క్రికెట్ ప్రసార రంగంలో విప్లవాత్మక మార్పులకు కూడా బింద్రా కారణమయ్యారు. 1994లో దూరదర్శన్ క్రికెట్ ప్రసారాలపై ఉన్న ఏకాధిపత్యాన్ని ముగించాలంటూ సుప్రీంకోర్టులో ఆయన దాఖలు చేసిన పిటిషన్ కీలక మలుపు తిప్పింది. కోర్టు అనుకూల తీర్పుతో అంతర్జాతీయ ప్రసార సంస్థలు భారత మార్కెట్లోకి అడుగుపెట్టాయి. దీంతో భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ టెలివిజన్ మార్కెట్‌గా మారింది. భారత క్రికెట్‌ను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లడంలో తనదైన ముద్ర వేసిన ఇందర్‌జిత్ సింగ్ బింద్రా జ్ఞాపకాలు ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోతాయి. బింద్రా మృతిపై బీసీసీఐ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఐసీసీ ఛైర్మన్ జైషా ఆయన మృతికి సంతాపం తెలిపారు.
