NTV Telugu Site icon

SRH vs RR: షాబాజ్, అభిషేక్‌ మాయాజాలం.. ఐపీఎల్ 2024 ఫైనల్లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌!

Sunrisers Hyderabad Enters Ipl 2024 Final

Sunrisers Hyderabad Enters Ipl 2024 Final

SRH set for IPL 2024 Final vs KKR: అద్భుత ఆటతో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఐపీఎల్‌ 2024 ఫైనల్లోకి దూసుకెళ్లింది. శుక్రవారం చెన్నైలోని చిదంబరం స్టేడియంలో జరిగిన రెండో క్వాలిఫయర్లో రాజస్థాన్‌ రాయల్స్‌ను 36 పరుగుల తేడాతో ఓడించింది. సన్‌రైజర్స్‌ విజయంలో హెన్రిచ్‌ క్లాసెన్‌ (50; 34 బంతుల్లో 4×6), షాబాజ్‌ అహ్మద్‌ (3/23), అభిషేక్‌ శర్మ (2/24) కీలక పాత్ర పోషించారు. ఇక ఆదివారం జరిగే ఫైనల్లో కోల్‌కతాతో సన్‌రైజర్స్‌ తలపడుతుంది. 2016లో ఛాంపియన్‌గా నిలిచిన హైదరాబాద్‌.. 2018లో రన్నరప్‌గా నిలిచిన విషయం తెలిసిందే.

ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ 9 వికెట్లకు 175 పరుగులు చేసింది. ఆరంభంలోనే సన్‌రైజర్స్‌కు ట్రెంట్ బౌల్ట్‌ షాక్ ఇచ్చాడు. ఊపు మీద ఉన్న అభిషేక్‌ను బోల్తా కొట్టించాడు. రాహుల్ త్రిపాఠి (37; 15 బంతుల్లో 5×4, 2×6) ధాటిగా ఆడడంతో స్కోరు బోర్డు దూసుకెళ్లింది. అయితే బౌల్ట్‌ అతడిని పెవిలియన్ చేర్చాడు. అదే ఓవర్లో మార్‌క్రమ్‌ (1) కూడా అవుట్ అయ్యాడు. ఈ సమయంలో హెడ్‌ (34; 28 బంతుల్లో 3×4, 1×6), క్లాసెన్‌ జట్టును ఆదుకున్నారు. హెడ్‌, నితీశ్‌ (5), సమద్‌ (0)లు పెవిలియన్ చేరినా.. షాబాజ్‌ అహ్మద్‌ (18)తో కలిసి క్లాసెన్‌ జట్టును మంచి స్థితిలో నిలిపాడు.

Also Read: Lokshabha Elections 2024: నేడు లోక్సభ ఎన్నికల ఆరో దశ పోలింగ్.. లైవ్ అప్ డేట్స్

ఛేదనలో ఓపెనర్‌ కోహ్లెర్‌ క్యాడ్‌మోర్‌ (10) తడబడినా.. జైస్వాల్‌ (42; 21 బంతుల్లో 4×4, 3×6) మెరుపు బ్యాటింగ్‌ చేశాడు. భువనేశ్వర్‌ వేసిన ఆరో ఓవర్లో అతను 19 పరుగులు రావడంతో పవర్‌ప్లేలో 51/1తో రాయల్స్‌ మంచి స్థితిలో నిలిచింది. అయితే 8వ ఓవర్లో యశస్విని ఔట్‌ చేసిన షాబాజ్‌ మ్యాచ్‌ను మలుపు తిప్పాడు. పార్ట్‌టైమర్‌ అభిషేక్‌ కీలకమైన సంజు శాంసన్‌ (10) వికెట్‌ తీశాడు. రన్ రేట్ పెంచే క్రమంలో పరాగ్‌ (6) అవుట్ అయ్యాడు. పరాగ్‌ సహా అశ్విన్‌ (0) సైతం షాబాజ్‌ పెవిలియన్ చేర్చాడు. హెట్‌మయర్‌ (4)ను అభిషేక్‌ బౌల్డ్‌ చేయడంతో సన్‌రైజర్స్‌ విజయం దాదాపు ఖాయమైపోయింది. అయితే ధ్రువ్‌ జురెల్‌ (56 నాటౌట్‌; 35 బంతుల్లో 7×4, 2×6) మాత్రం పోరాడాడు. రోమన్‌ పావెల్‌ (6) తేలిపోవడంతో రాజస్థాన్ ఓడక తప్పలేదు.