ఈ ఐపీఎల్ సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలర్ ఉమ్రాన్ మాలిక్ తన సంచలన బౌలింగ్‌తో ఆకట్టుకున్నాడు. తన బౌలింగ్ ప్రతిభతో దక్షిణాఫ్రికాతో జరగనున్న టీ20 సిరీస్‌లోనూ జట్టులో చోటు దక్కించుకున్నాడు. ఈ నేపథ్యంలో ఉమ్రాన్ మాలిక్ ఈ ఐపీఎల్‌లో అరుదైన ఫీట్ సాధించాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ప్లే ఆఫ్స్‌కు చేరడంలో విఫలమైనా లీగ్ దశలో మొత్తం 14 మ్యాచ్‌లు ఆడింది. సన్‌రైజర్స్ ఆడిన అన్ని మ్యాచ్‌ల్లోనూ ఉమ్రాన్ మాలిక్ ఆడగా ప్రతి మ్యాచ్‌లోనూ ఫాస్టెస్ట్ డెలివరీ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. ప్రతి మ్యాచ్‌లో ఫాస్టెస్ట్ బాల్ వేసిన బౌలర్‌కు ఇచ్చే రూ.లక్ష క్యాష్ ప్రైజ్‌ను ఉమ్రాన్ గెలుచుకున్నాడు. తద్వారా రూ.14 లక్షల నగదును తన ఖాతాలో వేసుకున్నాడు.
కాగా ఈ ఏడాది ఐపీఎల్‌లో ఉమ్రాన్ మాలిక్ 14 మ్యాచ్‌ల ద్వారా 22 వికెట్లు సాధించాడు. దీంతో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో ఐదో స్థానంలో నిలిచాడు. అటు ఈ సీజన్‌లో 157 కి.మీ. వేగంతో ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత వేగవంతమైన బంతిని ఉమ్రాన్ మాలిక్ సంధించాడు. ఆదివారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో అయితే ఉమ్రాన్ మాలిక్ వేసిన బంతి పంజాబ్ కెప్టెన్ మయాంక్ అగర్వాల్ పక్కటెములకు బలంగా తాకింది. ఈ బంతి దాదాపు 143 కి.మీ. వేగంతో వచ్చింది. ఉమ్రాన్ బంతి తగిలిన తర్వాత మయాంక్ నొప్పితో విలవిలలాడిపోయాడు. అతడికి మైదానంలోనే ఫిజియోథెరపీ చేశారు.
