NTV Telugu Site icon

Chinnaswamy Stadium: చిన్నస్వామి స్టేడియంలో బెస్ట్ సబ్‌ఎయిర్‌ సిస్టమ్‌.. అరగంటలో మైదానం సిద్ధం! కానీ..

Chinnaswamy Stadium Drainage System

Chinnaswamy Stadium Drainage System

World Best Drainage System in Chinnaswamy Stadium: ప్రస్తుతం అందరి చూపు రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు, చెన్నై సూపర్‌ కింగ్స్ మ్యాచ్‌పైనే. ఐపీఎల్ 2024 ప్లేఆఫ్స్‌లో మిగిలిన ఏకైక బెర్తును ఏ జట్టు సొంతం చేసుకుంటుందో అని క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచుస్తున్నారు. ప్లేఆఫ్స్‌కు చేరాలంటే.. బెంగళూరు, చెన్నై జట్లకు గెలుపు తప్పనిసరి. అయితే చెన్నై గెలిస్తే చాలు కానీ.. రన్‌రేట్‌లో వెనకబడ్డ బెంగళూరు భారీ తేడాతో గెలవాల్సి ఉంది. ఈ కీలక మ్యాచ్‌ పూర్తిగా సాగుతుందా? అన్నది ఇప్పుడు అనుమానంగా మారింది.

బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరిగే బెంగళూరు, చెన్నై మ్యాచ్‌కు వర్షం ముప్పు పొంచి ఉంది. శనివారం రాత్రి 8 నుంచి 11 మధ్య బెంగళూరులో వర్షం పడేందుకు 75 శాతం అవకాశముందని అక్కడి వాతావరణ శాఖ తెలిపింది. దాంతో మ్యాచ్‌పై నీలినీడలు కమ్ముకున్నాయి. అయితే చిన్నస్వామి స్టేడియంలో ప్రపంచంలోనే బెస్ట్ సబ్‌ఎయిర్‌ సిస్టమ్‌ ఉండడం కాస్త ఊరట కలిగించే అంశం. నీరు వేగంగా ఇంకిపోయే అత్యుత్తమ వ్యవస్థ కలిగిన చిన్నస్వామి స్టేడియంలో వర్షం నిలిచాక అరగంటలో మైదానాన్ని ఆటకు సిద్ధం చేయొచ్చు.

వర్షం పడి ఆగిన తర్వాత మైదానాన్ని సిద్ధం చేసేందుకు చిన్నస్వామి స్టేడియంలో అత్యాధునిక పద్ధతులు ఉన్నాయి. కర్ణాటక క్రికెట్ అసోసియేషన్‌ పదేళ్ల నుంచి సబ్‌ ఎయిర్‌సిస్టమ్‌ను వినియోగిస్తోంది. పిచ్‌తో పాటు మైదానంలోని పచ్చిక కింద పలు లేయర్లలో ఇసుకను నింపారు. మిగతా మైదానాల్లో లేయర్లలో ఎక్కువగా మట్టిని నింపుతారు. చిన్నస్వామిలో ఇసుక ఉండటం వల్ల నీరు మైదానంలో ఉండకుండా.. మెషిన్‌ స్టార్ట్‌ చేయగానే బయటకు వచ్చేస్తుంది. 200 హార్స్‌పవర్‌ యంత్రాలతో సబ్‌ఎయిర్‌ సిస్టమ్‌ ఇక్కడ రన్‌ అవుతుంది. అక్కడి నుంచి నీటిని డ్రైనేజ్‌ల ద్వారా బయటకు పంపిస్తారు. అనంతరం డ్రయర్లు, రోప్స్‌తో గ్రౌండ్‌ను సిద్ధం చేస్తారు.

Also Read: RCB vs CSK: నేడే బెంగళూరు, చెన్నై మ్యాచ్‌.. ఆఖరి ప్లేఆఫ్స్‌ బెర్తు ఎవరిదో! ఛాన్సెస్ ఇలా

మోస్తరు వర్షం పడి ఆగితే.. 15 నిమిషాల్లోనే చిన్నస్వామి మైదానాన్ని సిద్ధం చేయవచ్చు. సబ్‌ఎయిర్‌ సిస్టమ్‌ కారణంగా ఒక్క నిమిషంలోనే దాదాపు 10 వేల లీటర్ల నీరు బయటకి వెళుతుంది. గంటల పాటు భారీ వర్షం పడి ఆగితే.. 30 లేదా 40 నిమిషాల్లో మైదానాన్ని సిద్ధం చేయొచ్చు. నేడు మ్యాచ్ జరిగే సమయంలో భారీ వర్షం పడనుందట. రాత్రి 10.30 లోపే వర్షం ఆగిపోయి మ్యాచ్‌ ప్రారంభం కావాలి. లేకపోతే మ్యాచ్‌ రద్దవుతుంది.