Abhinav Mukund Trolls RCB: ఎప్పటిలానే ఈ సీజన్‌లో కూడా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) తీరు మారలేదు. జట్టు నిండా స్టార్ ఆటగాళ్లు ఉన్నా.. పేలవ బ్యాటింగ్, బౌలింగ్‌తో మూల్యం చెల్లించుకుంది. ఇప్పటికే లీగ్ దశలో సగం మ్యాచ్‌లు ఆడేసిన ఆర్‌సీబీ.. ఒకే ఒక్కటి గెలిచింది. ప్రస్తుతం ఐపీఎల్ 2024 పాయింట్ల పట్టికలో అట్టడుగున ఉంది. వరుస ఓటములను ఆర్‌సీబీ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ‘ఈ సాలా కప్ నమదే’ అనే స్లోగన్ మరో ఏడాది కూడా అనక తప్పదని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఇక ఆర్‌సీబీ తాజా ఓటమిపై భారత ఆటగాడు అభినవ్ ముకుంద్ స్పందించాడు. బెంచ్‌లో రూ.47 కోట్లు ఉన్నాయని సెటైర్ వేశాడు.
సోమవారం చిన్నస్వామి స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆర్‌సీబీ తమ స్టార్ ఆటగాళ్లను పక్కన పెట్టింది. కోట్లు పెట్టి కొన్న కామెరూన్ గ్రీన్ (రూ.17.5 కోట్లు), అల్జారీ జోసెఫ్ (రూ.11.5 కోట్లు), గ్లెన్ మ్యాక్స్‌వెల్ (రూ.11 కోట్లు), మహ్మద్ సిరాజ్ (రూ.7 కోట్లు)లను తుది జట్టులో ఆడించకుండా.. బెంచ్‌కే పరిమితం చేసింది. ఈ నలుగురి ఐపీఎల్ ధర మొత్తం రూ.47 కోట్లు. భారీ మొత్తం చెల్లించి.. వారిని బెంచ్‌కే పరిమితం చేయడాన్ని అభినవ్ ముకుంద్ తప్పుబట్టాడు. ‘17.5+11.5+11+7 కోట్లు ఆర్‌సీబీ బెంచ్ మీద ఉంచింది’ అని ఎక్స్‌లో పోస్టు చేశాడు. ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది.
Also Read: UPSC Civils 2023 Results: యూపీఎస్సీ సివిల్స్ ఫలితాలు విడుదల.. ఆదిత్య శ్రీవాత్సవకు తొలి ర్యాంకు!
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 287 పరుగులు చేసింది. ట్రావిస్ హెడ్ (102; 41 బంతుల్లో 9×4, 8×6) సెంచరీ చేయగా .. హెన్రిచ్ క్లాసెన్ (67; 31 బంతుల్లో 2×4, 7×6) హాఫ్ సెంచరీ బాదాడు. ఆర్‌సీబీ బౌలరు టాప్లీ, దయాళ్, ఫెర్గూసన్, వైశాఖ్ భారీగా పరుగులు సమర్పించుకున్నారు. లక్ష్య ఛేదనలో ఆర్‌సీబీ 20 ఓవర్లలో 7 వికెట్లకు 262 పరుగులు చేసి ఓడిపోయింది. ఫాఫ్ డుప్లెసిస్ (62; 28 బంతుల్లో 7×4, 4×6) హాఫ్ సెంచరీ చేయగా.. దినేశ్ కార్తీక్ (83; 35 బంతుల్లో 5×4, 7×6) సంచలన ఇన్నింగ్స్ ఆడాడు.
