Graeme Smith On IPL: టీ20 క్రికెట్ పరిచయం అయ్యింది 2005లోనే అయినా.. 2007లో టీమిండియా వరల్డ్ కప్ గెలిచాక ఆ ఫార్మాట్‌పై భారత్‌లో ఆసక్తి పెరిగింది. ఇక ఐపీఎల్ వచ్చిన తర్వాత టీ20 దశ పూర్తిగా మారిపోయింది. ప్రపంచవ్యాప్తంగా దానికి విశేష ఆదరణ వచ్చిపడింది. ఆటగాళ్ల వీరబాదుడు అభిమానులకు మాంచి కిక్ ఇస్తోంది. దీనికితోడు ఫలితం కూడా మూడు గంటల్లోనే వచ్చేస్తుంది కాబట్టి, టీ20కి తిరుగులేకుండా పోయింది.
ఈ నేపథ్యంలోనే ఐపీఎల్‌ను ఆదర్శంగా తీసుకొని, ఇతర క్రికెట్ బోర్డులు కూడా టీ20 లీగ్‌లను నిర్వహిస్తూ డబ్బులు ఆర్జిస్తున్నాయి. తాజాగా దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు టీ20 ఛాలెంజ్ పేరిట ఒక లీగ్ నిర్వహించేందుకు సమాయత్తమైంది. ఈ టోర్నీకి అధిపతిగా దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ గ్రేమ్ స్మిట్ వ్యవహరిస్తున్నాడు. ఈ క్రమంలోనే అతడు భారత టీ20 లీగ్ వల్లే పొట్టి ఫార్మాట్‌కు విశేష ప్రజాదరణ దక్కిందని పేర్కొన్నాడు. అంతేకాదు.. 2006లో భారత్, దక్షిణాఫ్రికా మధ్య జరిగిన తొలి టీ20 మ్యాచ్‌ని మరోసారి చూసినట్టు వెల్లడించాడు.
‘‘భారత్‌తో ఆడిన తొలి టీ20 మ్యాచ్ నాకింకా గుర్తుంది. అప్పుడు దినేశ్ కార్తిక్ అద్భుతంగా ఆడి, భారత్‌ను గెలిపించాడు. కాలక్రమంలో టీ20కి ప్రేక్షకాదరణ పెరగడాన్ని గమనించి, దానికోసం మేము కష్టపడాల్సి వచ్చింది. 2006లో తొలిసారి టీ20 మ్యాచ్ ఆడేటప్పుడు.. ప్రస్తుత స్థాయికి ఆ ఫార్మాట్ చేరుకుంటుందని నేనైతే అస్సలు ఊహించలేదు. కానీ.. భారత టీ20 లీగ్ రాకతో పొట్టి ఫార్మాట్ ఇప్పుడు దూసుకెళ్తోంది. అమెరికా వంటి కొత్త ప్రాంతాలకూ విస్తరించింది’’ అంటూ స్మిత్ చెప్పుకొచ్చాడు.
