ఐపీఎల్ 2022 సీజన్‌లో జట్ల మధ్య పోరు రసవత్తరంగా సాగుతోంది. నేడు ముంబాయిలోని డీవై పాటేల్ స్టేడియం వేదికగా చైన్నై సూపర్ కింగ్స్‌తో ముంబై ఇండియన్స్ తలపడింది. ఈ మ్యాచ్‌లో ఎంతో ఉత్కంఠ నడుమ సీఎస్‌కే విజయం సాధించింది. ముందుగా టాస్ గెలిచి సీఎస్‌కే బౌలింగ్ ఎంచుకుంది. దీంతో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్ కు ఆదిలోనే రోహిత్ శర్మ రూపంలో ఎదురుదెబ్బ తగిలింది. రెండు పరుగులకే కెప్టెన్ రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్ డకౌట్లుగా వెనుదిరిగారు. ఆదుకుంటారనుకున్న డెవాల్డ్ బ్రెవిస్ (4) కూడా చేతులెత్తేయడంతో ముంబై మరిన్ని కష్టాల్లో పడింది. ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది.
అయితే 156 పరుగుల లక్ష్య చేధనకు బరిలోకి దిగిన సీఎస్‌కే కూడా ఆదిలోనే రెండు వికెట్లు కోల్పోయింది. డానియల్ సామ్స్ బౌలింగ్‌లో రుత్‌రాజ్ గైక్వాడ్ డకౌట్ కాగా.. శాంట్నర్ 11 పరుగులు చేసి ఔటయ్యాడు. 66 పరుగుల వద్ద రాబిన్ ఊతప్ప రూపంలో సీఎస్‌కే మూడో వికెట్, 102 పరుగుల వద్ద చెన్నై సూపర్ కింగ్స్ ఐదో వికెట్ కోల్పోయింది. అయితే చివరి ఓవర్లో ఆఖరి బంతిని ధోని ఫోర్ కొట్టి ముంబైపై 3 వికెట్ల తేడాతో సీఎస్‌కేకు విజయ పట్టం కాట్టాడు. ఈ సీజన్‌లో ముంబై ఇండియన్స్ వరుసగా 7 మ్యాచుల్లో ఓడిపోయి ఘోర పరాజయాన్ని మూట కట్టుకుంది.