Pakistan vs England Test: అరంగేట్రంలోనే పాక్‌ యువ క్రికెటర్‌ విధ్వంసం.. 18 ఏళ్ల రికార్డు..!

Razaullah Khan

Razaullah Khan

Pakistan vs England Test: పాకిస్తాన్‌కు కష్టాల సమయంలో యువ క్రికెటర్‌ ఊపిరి పోశాడు.. ఇంగ్లాండ్‌తో ఎడ్జ్‌బాస్టన్ వేదికగా జరుగుతున్న మూడో టెస్టులో పాకిస్థాన్ అరంగేట్ర ఆటగాడు రజావుల్లా ఖాన్ అద్భుత ఇన్నింగ్స్‌తో అదరగొట్టాడు. వరుస పరాజయాలతో సతమతమవుతున్న పాకిస్థాన్‌కు తన బ్యాట్‌తో అండగా నిలిచాడు.. 81 పరుగుల ఇన్నింగ్స్‌లో ఏకంగా 9 సిక్సర్లు బాది జట్టును ఇన్నింగ్స్ ఓటమి నుంచి తప్పించాడు.

కష్టాల్లో ఉన్న పాకిస్థాన్‌కు అండగా..
తొలి ఇన్నింగ్స్‌లో పాకిస్థాన్ కేవలం 133 పరుగులకే ఆలౌట్ కాగా, ఇంగ్లాండ్ 320 పరుగుల భారీ ఆధిక్యాన్ని సాధించింది. దీంతో పాకిస్థాన్ మరోసారి ఇన్నింగ్స్ ఓటమి చవిచూడటం ఖాయమని భావించారు. అయితే రెండో ఇన్నింగ్స్‌లో 318/8 వద్ద రజావుల్లా క్రీజులోకి వచ్చి మ్యాచ్ స్వరూపాన్నే మార్చేశాడు. 21 ఏళ్ల రజావుల్లా ఆరంభం నుంచే దూకుడుగా ఆడాడు. కేవలం 43 బంతుల్లోనే అర్ధశతకం పూర్తి చేశాడు. ఆ తర్వాత కూడా ఇంగ్లాండ్ బౌలర్లపై విరుచుకుపడుతూ సిక్సర్ల వర్షం కురిపించాడు. మొత్తం 81 పరుగులు చేసిన అతడు 9 సిక్సర్లు బాదాడు.

18 ఏళ్ల రికార్డును సమం చేసిన రజావుల్లా
టెస్టు అరంగేట్రంలో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాడిగా న్యూజిలాండ్ మాజీ ఆటగాడు టిమ్ సౌథీ పేరిట ఉన్న 18 ఏళ్ల రికార్డును రజావుల్లా సమం చేశాడు. 2008లో నేపియర్‌లో ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్టులో సౌథీ 9 సిక్సర్లు బాదాడు. అంతేకాకుండా ఇంగ్లాండ్ గడ్డపై ఒక టెస్టు ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన బ్యాటర్‌గా బెన్ స్టోక్స్ రికార్డును కూడా రజావుల్లా సమం చేశాడు. 2023 యాషెస్‌లో లార్డ్స్ వేదికగా ఆస్ట్రేలియాపై స్టోక్స్ 9 సిక్సర్లు బాదాడు.

ఇంగ్లాండ్ పేసర్లపై విరుచుకుపడిన రజావుల్లా
ఇంగ్లాండ్ పేసర్లను రజావుల్లా ఏమాత్రం లెక్కచేయలేదు. గస్ అట్కిన్సన్ వేసిన ఒకే ఓవర్‌లో మూడు సిక్సర్లు బాదాడు. జోఫ్రా ఆర్చర్ బౌలింగ్‌లోనూ వరుసగా భారీ షాట్లు ఆడాడు. ఆర్చర్‌పై కొట్టిన సిక్సర్‌తో అర్ధశతకం పూర్తి చేసుకున్న రజావుల్లా.. మరో భారీ షాట్‌తో పాకిస్థాన్ స్కోరును 400 దాటించాడు. రజావుల్లా ఖాన్‌కు మహ్మద్ అబ్బాస్ అద్భుతంగా సహకరించాడు. వీరిద్దరూ తొమ్మిదో వికెట్‌కు 121 పరుగుల కీలక భాగస్వామ్యం నెలకొల్పారు. దీంతో ఇంగ్లాండ్ ఆధిపత్యంలో ఉన్న మ్యాచ్ ఒక్కసారిగా ఉత్కంఠగా మారింది. చివరకు పాకిస్థాన్ 449 పరుగులకు ఆలౌటైంది. దీంతో ఇంగ్లాండ్‌కు మ్యాచ్ గెలవడానికి 130 పరుగుల లక్ష్యం మాత్రమే మిగిలింది. శనివారం ఆ లక్ష్యాన్ని ఛేదిస్తే ఇంగ్లాండ్ 3-0తో సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేయనుంది.