Pretorius Breaks T20 Record: దక్షిణాఫ్రికా యువ బ్యాటర్ లువాన్-డ్రే ప్రిటోరియస్ టీ20 క్రికెట్‌లో చరిత్ర సృష్టించాడు. నమీబియాతో శుక్రవారం (సెప్టెంబర్ 4) జరిగిన ట్రై-సిరీస్ మ్యాచ్‌లో కేవలం 53 బంతుల్లోనే 101 పరుగులు చేసి అదరగొట్టాడు. అతని విధ్వంసకర ఇన్నింగ్స్‌లో 5 ఫోర్లు, 8 సిక్సర్లు ఉన్నాయి. 190.57 స్ట్రైక్‌రేట్‌తో ఆడిన ప్రిటోరియస్‌కు ఇదే తొలి టీ20 అంతర్జాతీయ శతకం. ఈ శతకంతో ప్రిటోరియస్ ప్రత్యేక రికార్డు నెలకొల్పాడు. పూర్తిస్థాయి జట్టు తరఫున టీ20 అంతర్జాతీయ సెంచరీ సాధించిన అతి పిన్న వయస్కుడైన బ్యాటర్‌గా నిలిచాడు. ఇంతకుముందు ఈ రికార్డు ఆఫ్ఘనిస్తాన్ ఆటగాడు హజ్రతుల్లా జజాయ్ పేరిట ఉండేది. జజాయ్ 2019లో ఐర్లాండ్‌పై 20 ఏళ్ల 337 రోజుల వయసులో సెంచరీ సాధించాడు. ప్రిటోరియస్ 20 ఏళ్ల 161 రోజులకే ఈ ఘనత అందుకున్నాడు.
వైభవ్‌తో ఆసక్తికర పోలిక
ప్రిటోరియస్ ఇన్నింగ్స్‌ను భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీతో పోలుస్తున్నారు. వీరిద్దరి మధ్య మరో ఆసక్తికరమైన సంబంధం ఉంది. ఇద్దరూ ఐపీఎల్‌లో రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడుతున్నారు. 15 ఏళ్ల వైభవ్ ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్‌లో పలు రికార్డులు సృష్టించాడు. భారత తరఫున అంతర్జాతీయ క్రికెట్ ఆడిన అత్యంత పిన్న వయస్కుడిగా, టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లో అర్ధశతకం సాధించిన అత్యంత పిన్న వయస్కుడైన భారతీయుడిగా నిలిచాడు. ఇక, వైభవ్ సూర్యవంశీ కూడా అంతర్జాతీయ టీ20 శతకం సాధించే దిశగా అడుగులు వేస్తున్నాడు. జింబాబ్వేపై 49 బంతుల్లో 81 పరుగులతో మెరుపు ఇన్నింగ్స్ ఆడినప్పటికీ సెంచరీని అందుకోలేకపోయాడు. ఇప్పుడు ఆ ఘనతపై వైభవ్ కన్నేశాడు. రాబోయే ఆఫ్ఘనిస్తాన్ టీ20 సిరీస్, ఆసియా క్రీడలు అతనికి తన ప్రతిభను నిరూపించుకునే కీలక అవకాశాలుగా మారనున్నాయి.
దక్షిణాఫ్రికా ఉత్కంఠ విజయం
టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా 20 ఓవర్లలో 228 పరుగులు చేసింది. ప్రిటోరియస్, కోనార్ ఎస్టర్‌హుజెన్ కలిసి తొలి వికెట్‌కు ఏకంగా 156 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఎస్టర్‌హుజెన్ కూడా 88 పరుగులతో మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. 229 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన నమీబియా పోరును ఉత్కంఠభరితంగా మార్చింది. జాన్ ఫ్రైలింక్ 72, లారెన్ స్టీన్‌క్యాంప్ 61 పరుగులు చేశారు. వీరిద్దరూ తొలి వికెట్‌కు 119 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. అయితే చివర్లో దక్షిణాఫ్రికా బౌలర్లు పుంజుకోవడంతో నమీబియా 20 ఓవర్లలో 217 పరుగులకే పరిమితమైంది. దీంతో దక్షిణాఫ్రికా 11 పరుగుల తేడాతో విజయం సాధించింది. అయితే, ట్రై-సిరీస్ ఫైనల్ ఆదివారం దక్షిణాఫ్రికా, జింబాబ్వే జట్ల మధ్య జరగనుంది. ప్రిటోరియస్ మెరుపు శతకంతో దక్షిణాఫ్రికా ఆత్మవిశ్వాసంతో ఫైనల్‌కు సిద్ధమవుతోంది.

