India Won Series Against Zimbabwe: టీమిండియా, జింబాబ్వే మధ్య మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ కొనసాగుతోన్న విషయం తెలిసిందే! ఆల్రెడీ మొదటి మ్యాచ్‌లో ఘనవిజయం సాధించిన భారత్.. ఇప్పుడు రెండో మ్యాచ్ కూడా గెలిచేసింది. దీంతో.. ఇంకో మ్యాచ్ మిగిలుండగానే భారత్ ఈ సిరీస్‌ను కైవసం చేసుకుంది. జింబాబ్వేలోని హరారే స్పోర్ట్స్ క్లబ్ వేదికగా జరిగిన రెండో వన్డేలో భారత బౌలర్లు తడాఖా చూపించడంతో.. 38.1 ఓవర్లలోనే అతి తక్కువ స్కోరుకి జింబాబ్వే చాప చుట్టేసింది. ఆ తర్వాత ప్రత్యర్థి కుదిర్చిన లక్ష్యాన్ని భారత్ ఐదు వికెట్లు మిగిలుండగానే 25.4 ఓవర్లలోనే మ్యాచ్ చేధించింది.
తొలుత భారత్ టాస్ గెలిచి, బౌలింగ్ ఎంపిక చేసుకోగా.. బ్యాటింగ్ చేసేందుకు జింబాబ్వే టీమ్ రంగంలోకి దిగింది. అయితే.. ఆది నుంచే జింబాబ్వే బ్యాట్స్మన్లు తడబడ్డారు. భారత బౌలర్ల ధాటికి.. టాపార్డర్ కుప్పకూలింది. వెనువెంటనే వికెట్లు పడ్డాయి. సీన్ విలియమ్స్ (42), రియాన్ బర్ల్ (39 నాటౌట్) మాత్రమే రాణించారు. మిగతా బ్యాట్స్మన్లు తక్కువ స్కోరుకే పెవిలియన్ బాట పట్టారు. దీంతో.. జింబాబ్వే 38.1 ఓవర్లలో 161 పరుగులకే బిచాణా ఎత్తేసింది. బౌలింగ్‌లో శార్దూల్ ఠాగూర్ మరోసారి చెలరేగిపోయాడు. ఏడు ఓవర్లలో 38 పరుగులే ఇచ్చిన అతడు, మూడు వికెట్లు తీశాడు. సిరాజ్, కృష్ణ, అక్షర్, కుల్దీప్, దీపక్ చెరో వికెట్ తీసుకున్నారు.
ఇక లక్ష్య ఛేదనకు దిగిన భారత జట్టు.. 25.4 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేధించింది. శిఖర్ ధావన్ (33) శుభారంభాన్ని అందించాడు కానీ, అతనితో పాటు కలిసి దిగిన కెప్టెన్ కేఎల్ రాహుల్ మాత్రం ఒక్క పరుగుకే పెవిలియన్ చేరాడు. అతని తర్వాత వచ్చిన శుభ్మన్ గిల్ (33) కూడా సత్తా చాటాడు. ఇషాన్ కిషన్ (6) మాత్రం ఆకట్టుకోలేకపోయాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన దీపక్ హుడా (25), వికెట్ కీపర్ సంజూ శాంసన్ (43) రాణించడంతో.. 25.4 ఓవర్లు ముగిసేసరికి 5 వికెట్ల నష్టానికి భారత జట్టు 167 పరుగులు చేసి వరుసగా రెండో విక్టరీ కొట్టేసింది. అలాగే సిరీస్ కూడా నెగ్గింది.
