India vs West Indies 3rd ODI Delayed Due To Rain: క్వీన్స్ పార్క్ ఓవల్ వేదికగా భారత్, వెస్టిండీస్ మధ్య మూడో వన్డే మ్యాచ్‌కు వరుణుడు అంతరాయం కలిగించాడు. మ్యాచ్ ప్రారంభం అవుతున్నప్పుడు వాతావరణం అనుకూలంగానే అనిపించింది. అయితే.. ఉన్నట్లుండి వరుణుడు ఝలకిచ్చాడు. దీంతో.. 24 ఓవర్లలో భారత్ 115/1 స్కోరు వద్ద మ్యాచ్ ఆపేశారు. మైదానంలోకి కవర్లు తీసుకొచ్చి.. పిచ్‌పై కప్పారు. కాసేపట్లోనే వర్షం తగ్గిపోవడంతో.. కవర్లు తీసేశారు. ఓవర్లలో తగ్గింపులేమి లేకుండా, తిరిగి మ్యాచ్ ప్రారంభించాలని సన్నద్ధమయ్యారు. ఇంతలోనే మళ్లీ వర్షం కురవడంతో, కవర్లు కప్పేయాల్సి వచ్చింది.
కాగా.. ఆల్రెడీ ఈ వన్డే సిరీస్‌ను భారత్ కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. మూడు మ్యాచ్‌ల ఈ వన్డే సిరీస్‌లో రెండు మ్యాచ్‌లు గెలిచి, సిరీస్ సాధించింది. ఇప్పుడు జరుగుతోన్న మూడో మ్యాచ్ కూడా గెలిచి, క్లీన్ స్వీప్ చేయాలనుకుంటోంది. చూస్తుంటే.. భారత్ ఈ మ్యాచ్ కూడా గెలిచేలా కనిపిస్తోంది. టాస్ గెలిచిన భారత్, బ్యాటింగ్ ఎంపిక చేసుకుంది. ఓపెనర్లు శిఖర్ ధావన్ (58), శుభ్మన్ గిల్ (51) నిలకడగా రాణించడంతో.. తొలి వికెట్‌కి 113 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. అయితే.. వాల్స్ బౌలింగ్‌లో భారీ షాట్‌కు యత్నించి, పూరన్ చేతికి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ప్రస్తుతం శుభ్మన్‌తో పాటు క్రీజులో శ్రేయస్ అయ్యర్ ఉన్నాడు.
