Ambati Rayudu on India Playing XI : న్యూజిలాండ్‌తో జరుగుతున్న మూడు వన్డేల సిరీస్‌లో టీమిండియా 2-0తో ఆధిక్యంలో ఉంది. తొలి వన్డేలో ఐదు వికెట్ల తేడాతో, రెండో వన్డేలో డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో నాలుగు పరుగుల తేడాతో భారత్ విజయం సాధించింది. అయితే రెండు మ్యాచ్‌ల్లోనూ స్వల్ప లక్ష్యాలను ఛేదించే క్రమంలో భారత బ్యాటర్లు తడబడటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్లు అంబటి రాయుడు, మురళీ కార్తీక్ జట్టు కూర్పుపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు.
భారత బ్యాటింగ్‌లో కొన్ని మార్పులు చేయాల్సిన అవసరం ఉందని అంబటి రాయుడు అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా ఐదో స్థానంలో అక్షర్ పటేల్‌ను కొనసాగించడంపై సందేహాలు వ్యక్తం చేశారు. ‘తొలి వన్డేలో అక్షర్ రెండు బంతులాడి డకౌట్ కాగా.. రెండో మ్యాచ్‌లో 17 బంతుల్లో ఏడు పరుగులు మాత్రమే చేశాడు. ఈ పరిస్థితుల్లో అక్షర్‌ను ఆరో లేదా ఏడో స్థానంలో ఆడించి.. అతడి స్థానంలో మరో స్పెషలిస్ట్ బ్యాటర్‌ను తీసుకోవాలి. ఐదో స్థానంలో బ్యాటింగ్ చేయడానికి ప్రస్తుత పరిస్థితుల్లో అక్షర్ సిద్ధంగా లేడు. ఆరో లేదా ఏడో స్థానంలో వస్తే మాత్రం జట్టుకు ఉపయోగపడగలడు. శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దగల బ్యాటర్ ఇప్పుడు జట్టుకు అవసరం. ఇందుకు ఇషాన్ కిషన్ సరైనోడు. ఇషాన్‌ను జట్టులోకి తీసుకోవడాన్ని జట్టు యాజమాన్యం పరిశీలించాలి’ అని రాయుడు సూచించారు.
నమన్ ధీర్‌ను పైస్థానంలో ఆడించడం లేదా ఇషాన్ కిషన్‌కు అవకాశం కల్పించడం ద్వారా బ్యాటింగ్‌లో ఉన్న లోటును భర్తీ చేయవచ్చని అంబటి రాయుడు పేర్కొన్నారు. న్యూజిలాండ్‌తో మ్యాచ్‌ల్లో కనిపించిన పరిస్థితులను దృష్టిలో పెట్టుకుంటే.. ఆరో లేదా ఏడో స్థానంలో అక్షర్‌ను ఉపయోగించుకోవడం మంచిదని చెప్పారు. అయితే రాయుడు సూచనతో మురళీ కార్తీక్ ఏకీభవించలేదు. ‘నమన్ బ్యాటింగ్‌లో మంచి టైమింగ్ చూపిస్తున్నాడు. అతడిని బ్యాటింగ్ ఆర్డర్ మార్చాల్సిన అసవరం లేదు. ఇషాన్‌కు జట్టులో చోటు కల్పించాలంటే అతడిని సరైన బ్యాటింగ్ స్థానంలోనే ఆడించాలి. కోహ్లీ మూడో స్థానంలో, శ్రేయస్ నాలుగో స్థానంలో, రాహుల్ సాధారణంగా ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు వస్తారు. ఇలాంటి కూర్పులో ఇషాను ఆరో స్థానంలో పంపించడం సరైన నిర్ణయం కాదు. ఇషాన్ ఓపెనర్‌గా లేదా మూడో స్థానంలో ఆడితేనే అతడి సామర్థ్యాన్ని పూర్తిగా ఉపయోగించుకోగలం’ అని మురళీ కార్తీక్ వివరించారు. మూడో వన్డేలో టీమ్ మేనేజ్‌మెంట్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.

