Hardik Pandya Creates World Record: టీమిండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా ఇప్పుడు సూపర్‌ఫామ్‌తో దూసుకుపోతున్నాడు. ఈ ఏడాది ఐపీఎల్ సీజన్‌లో గుజరాత్ జట్టుకి నాయకత్వం వహించిన ఇతడు, తొలి సీజన్‌లోనే ఆ జట్టుని ఛాంపియన్‌గా నిలిపాడు. ఆ తర్వాత దక్షిణాఫ్రికాతో జరిగిన టీ20 సిరీస్‌లో కీలక ఇన్నింగ్స్ ఆడిన ఇతడు, ఐర్లాండ్ సిరీస్‌లో కెప్టెన్‌గా రాణించాడు. తాజాగా ఇంగ్లండ్‌తో జరిగిన టీ20, వన్డే సిరీస్‌లోనూ ఆల్‌రౌండ్ షోతో సత్తా చాటాడు. ముఖ్యంగా.. మాంచెస్టర్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన మూడో వన్డే మ్యాచ్‌లో హార్దిక్ బౌలింగ్, బ్యాటింగ్ విభాగాల్లో తాండవం చేశాడు. 4 వికెట్లు తీయడంతో పాటు 71 పరుగులు చేసి, టీమిండియా గెలుపులో కీలక పాత్ర పోషించాడు. ఈ క్రమంలోనే హార్దిక్ ఓ సంచలన రికార్డ్ నమోదు చేశాడు.
ఇప్పటికే హార్దిక్ టెస్టుల్లో, టీ20ల్లో ఒకే మ్యాచ్‌లో నాలుగు వికెట్లు తీయడంతో పాటు అర్ధశతకం బాదాడు. ఇప్పుడు వన్డేలోనూ అదే ప్రదర్శన కనబర్చడంతో.. మూడు ఫార్మాట్లలో 4 వికెట్లు లేదా అంతకంటే ఎక్కువ వికెట్లు, అలాగే అర్ధశతకం చేసిన తొలి భారత ఆటగాడిగా సరికొత్త రికార్డ్ సృష్టించాడు. ఇంతకుముందు పాకిస్తాన్ ఆటగాడు మహమ్మద్ హఫీజ్ పేరిట మాత్రమే ఈ రికార్డ్ ఉండేది. ఇప్పుడు ఆ వరల్డ్ రికార్డ్‌ని హార్దిక్ తిరగరాశాడు. మరో విశేషం ఏమిటంటే.. ఇంగ్లండ్‌పైనే మూడు ఫార్మాట్లలో ఈ ఫీట్ అందుకున్నాడు. తొలుత 2018లో నాటింగ్‌హామ్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో 52 పరుగులు చేయడంతో పాటు 5 వికెట్లు పడగొట్టాడు. రీసెంట్‌గా సౌతాంప్టన్‌లో జరిగిన టీ20 మ్యాచ్‌లో 4 వికెట్లు తీసి, 51 పరుగులు చేశాడు. ఇక తాజాగా వన్డే మ్యాచ్‌లో విశ్వరూపం చూపించాడు.