NTV Telugu Site icon

మ్యాచ్ ఫిక్సింగ్.. మాజీ కెప్టెన్‌పై ఐసీసీ బ్యాన్‌

క్రికెట్‌లో మ్యాచ్ ఫిక్సింగ్ వ్య‌వ‌హారం మ‌రోసారి క‌ల‌క‌లం సృష్టిస్తోంది.. జింబాబ్వే జ‌ట్టు కెప్టెన్‌గా, ఆ జ‌ట్టు తరఫున అత్యధిక శతకాలు(17) బాదిన స్టార్‌ క్రికెటర్‌గా రికార్డులు సృష్టించిన జింబాబ్వే జ‌ట్టు మాజీ కెప్టెన్‌ బ్రెండన్ టేలర్ పై ఐసీసీ వేటు వేసింది.. మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్ప‌డ్డానంటూ ఒప్పుకున్న టేల‌ర్‌పై ఐసీసీ బ్యాన్ విధిస్తున్న‌ట్టు ప్ర‌క‌టించింది.. ఐసీసీ యాంటీ కరప్షన్ కోడ్‌లో మూడున్న‌రేళ్లు బ్యాన్ విధించ‌గా.. ఇక‌, డోప్ టెస్ట్‌లో విఫలమైనందుకు ఒక నెల సస్పెన్షన్‌ను కూడా విధించింది. కాగా, ఇటీవల టేలర్.. మ్యాచ్ ఫిక్సింగ్‌పై సంచలన అంశాల‌ను తెర‌పైకి తెచ్చాడు.. 2019లో ఓ భారత వ్యాపారవేత్త, తనను మ్యాచ్ ఫిక్సింగ్ చేయమని బెదిరించాడని, 15 వేల అమెరికన్‌ డాలర్లు ఆఫర్‌ చేశాడని సోష‌ల్ మీడియా వేదిక‌గా పేర్కొన్నాడు.. అంతేకాదు.. ఆర్ధిక పరిస్థితుల దృష్ట్యా ఆ వ్యక్తి నుంచి కొంత నగదు కూడా తాను తీసుకున్నట్లు అంగీకరించాడు… ఇదే అత‌డిని క‌ష్టాల్లోకి నెట్టింది.

Read Also: ఎంపీ అర్వింద్‌కు లోక్‌స‌భ స్పీక‌ర్ ఫోన్‌.. వెంట‌నే ఢిల్లీకి రండి..

ఐసీసీ అవినీతి నిరోధక కోడ్‌లోని నిబంధనలను ఉల్లంఘించినట్లు టేలర్ అంగీకరించినట్లు ఒక ప్రకటనలో ఐసీసీ తెలిపింది.. ఐసీసీ అవినీతి నిరోధక కోడ్ యొక్క నాలుగు అభియోగాలను మరియు విడిగా, ఐసీసీ యాంటీ డోపింగ్ కోడ్ యొక్క ఒక అభియోగాన్ని ఉల్లంఘించినందుకు జింబాబ్వే మాజీ కెప్టెన్ బ్రెండన్ టేలర్ మూడున్నర సంవత్సరాల పాటు అన్ని క్రికెట్ ఫార్మాట్‌ల నుంచి నిషేధించబడ్డాడు.. కాగా, 2019 జనవరి 24న ఓ ప్రముఖ భారత వ్యాపారవేత్త ఆహ్వానం మేరకు భారత్‌కు వెళ్లా.. ఆ సందర్భంగా ఓ పార్టీలో కొందరు తనకు కొకైన్‌ ఆఫర్ చేశార‌ని.. కొకైన్‌ సేవిస్తుండగా వీడియోలు తీసి బ్లాక్‌మెయిల్ చేశార‌ని.. ఈ క్రమంలోనే మ్యాచ్‌ ఫిక్సింగ్‌ కూడా చేయ‌మ‌న్నార‌ని సంచలన వ్యాఖ్యాల‌తో ఓ స్టేట్‌మెంట్‌ను విడుదల చేశాడు బ్రెండన్ టేలర్. ఇక‌, జింబాబ్వేలో టీ20 లీగ్‌ను లాంచ్‌ చేస్తామని ఆ వ్యాపార‌వేత్త‌ తనను సంప్రదించాడ‌ని చెప్పుకొచ్చిన అత‌డు.. అప్పటికే తమ దేశ క్రికెట్ బోర్డు నుంచి జీతాలు కూడా లేక‌పోవ‌డం.. త‌న ఆర్ధిక అవసరాలను ఆసరాగా తీసుకుని సదరు వ్యక్తి తనను ప్రలోభ పెట్టాడని.. తాను అంగీకరించకపోయే సరికి బ్లాక్‌ మెయిలింగ్‌కు దిగిన‌ట్టు ఆవేద‌న వ్య‌క్తం చేశాడు.. అయితే, తాను గత రెండేళ్లుగా ఈ భారాన్ని మోయలేక‌పోతున్నా.. మానసికంగా, శారీరకంగా కృంగిపోయానని, అందుకే ఈ స్టేట్‌మెంట్‌ను విడుదల చేస్తున్నాని పేర్కొంటూ సంచ‌ల‌నానికి తెర‌లేపాడు. ఇదే ఇప్పుడు అత‌నిపై బ్యాన్ విధించ‌డానికి దారి తీసింది.. కాగా, గత ఏడాది రిటైర్ కావడానికి ముందు 205 వ‌న్డేలు, 34 టెస్టులు, 45 టీ20లు ఆడాడు బ్రెండన్ టేలర్.. అయితే, ఒక నెల స‌స్పెన్ష‌న్, ఐసీసీ అవినీతి నిరోధక కోడ్ కింద మూడున్నరేళ్లపాటు నిషేధం కొనసాగుతుంది. టేలర్ 28 జూలై 2025న క్రికెట్‌లో తన ప్రమేయాన్ని తిరిగి ప్రారంభించడానికి స్వేచ్ఛగా ఉంటాడ‌ని ఐసీసీ పేర్కొంది.