Site icon NTV Telugu

కోహ్లీసేనకు అసలు సిసలైన పరీక్ష..

England vs India 1st Test

England vs India 1st Test

క్రికెట్‌ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారత్‌ -ఇంగ్లండ్‌ టెస్టు సిరీస్‌కు అంతా సిద్ధమైంది. 5 మ్యాచ్‌ల సిరీస్‌ కోసం ఇప్పటికే కోహ్లి సేన, జో రూట్‌ బృందం సన్నద్ధమయ్యాయి. ఈ ఏడాది భారత పర్యటనలో ఇంగ్లండ్‌.. 3-1 తేడాతో సిరీస్‌ను చేజార్చుకుంది. ఆ ఓటమికి ప్రతీకారం తీర్చుకునేందుకు సిద్ధమైంది ఇంగ్లండ్‌. నాటింగ్‌ హాంలో జరిగే మ్యాచ్‌లో శుభారంభం చేసి కోహ్లీసేనపై ఒత్తిడి పెంచేందుకు స్కెచ్‌ వేస్తోంది ఇంగ్లీష్‌ టీమ్‌. అయితే కీలకమైన ఆల్‌రౌండర్‌ బెన్‌ స్టోక్స్‌, ఆర్చర్‌ లేకపోవడం.. ఆ జట్టుకు మైనస్‌ పాయింట్.. ఇక టీమిండియా విషయానికొస్తే.. తుదిజట్టు ఎంపికనే కోహ్లీసేనకు సవాల్‌గా మారనుంది. శుభ్‌మన్‌ గిల్‌, మయాంక్‌ అగర్వాల్‌ గాయాలతో దూరం కావడంతో.. రోహిత్‌కు తోడుగా ఓపెనింగ్‌ ఎవరు చేస్తారనేది పెద్ద ప్రశ్నగా మారింది. కేఎల్‌ రాహుల్‌, హనుమ విహారి లేదా కొత్త ఓపెనర్‌ అభిమన్యు ఈశ్వరన్‌ను ఎంపిక చేసే అవకాశం ఉంది.

కోహ్లి, పుజారా, రహానే, పంత్‌తో మిడిలార్డర్‌ స్ట్రాంగ్‌గానే ఉంది. ఇక స్పిన్‌తో పాటు బ్యాటింగ్‌ కూడా చేయగల అశ్విన్‌, జడేజాలకు ఛాన్స్‌ రావొచ్చు. పేస్‌ భారాన్ని ఇషాంత్‌, షమి, బుమ్రాలే పంచుకునే అవకాశముంది. సిరాజ్‌ను ఆడించడం అనుమానమే. ఇక, ఇరు జట్ల మధ్య ఇప్పటి వరకు 122 టెస్టులు జరిగాయి. ఇండియా 29, ఇంగ్లండ్ 48 టెస్టుల్లో విజయం సాధించాయి. మొత్తం టెస్టుల్లో 62 ఇంగ్లండ్‌లో జరగ్గా టీమిండియా 7సార్లు మాత్రమే గెలిచింది. రికార్డులు భారతజట్టుకు అనుకూలంగా లేకపోయినా.. ఇటీవలి కాలంలో విదేశాల్లో కూడా టీమిండియా రాణిస్తోంది. ఆగస్ట్‌, సెప్టెంబర్‌లలో ఇంగ్లండ్‌ పిచ్‌లు పేసర్లతో పాటు స్పిన్నర్లకు కూడా అనుకూలించే అవకాశం ఉంది. దీంతో ఈసారి కోహ్లీసేన.. సిరీస్‌ గెలుచుకునే అవకాశాలు ఉన్నాయని అభిమానులు ఆశిస్తున్నారు.

Exit mobile version