Clash Between Fans At Hyderabad Gymkhana: హైదరాబాద్ జింఖానా గ్రౌండ్స్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సెప్టెంబర్ 25న భారత్, ఆస్ట్రేలియా మధ్య జరగనున్న మ్యాచ్ కోసం టికెట్లు కొనుగోలు చేసేందుకు వచ్చిన ఫ్యాన్స్ కొట్టేసుకుంటున్నారు. ఊహించని స్థాయిలో జనాలు తరలి రావడం వల్లే పరిస్థితులు ఆందోళనకరంగా మారాయి. గురువారం టికెట్ల అమ్మకాన్ని మొదలుపెడతామని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) ప్రకటించగానే.. రాత్రి నుంచే జింఖానా వద్దకు క్రీడాభిమానులు రావడం మొదలయ్యారు. తెల్లవారుజాము కల్లా వేల సంఖ్యలో బారులు తీరారు. సికింద్రాబాద్‌లోని ప్యారడైజ్ దగ్గర నుంచి జింఖానా దాకా క్యూలైన్ ఏర్పాట్లు చేశారు. పెద్దఎత్తున అభిమానులు చేరడంతో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలోనే నియంత్రించే క్రమంలో పోలీసులు, క్రికెట్ అభిమానుల మధ్య తోపులాట జరిగింది. అలాగే ఫ్యాన్స్ మధ్య ఘర్షణ వాతావరణం ఏర్పడింది.
మరోవైపు.. మ్యాచ్ టికెట్ల విక్రయాలకు హెచ్‌సీఏ జింఖానా మైదానంలో నాలుగు కౌంటర్లు ఏర్పాటు చేసింది. ఉదయం 10 గంటల నుంచి ఐదు గంటల దాకా టికెట్లు అమ్మనున్నారు. అయితే.. టికెట్లు కొనేందుకు వచ్చేవాళ్లు తమ ఆధార్ కార్డును తప్పకుండా తీసుకురావాలని హెచ్‌సీఏం పేర్కొంది. అలాగే.. ఒక్కొక్కరికి కేవలం రెండు టికెట్లు మాత్రమే ఇస్తామని తెలిపింది. ఇది అభిమానుల్ని కాస్త నిరాశపరిచే విషయమే అయినా.. అందరికీ టికెట్లు దొరికాలి కాబట్టి, ఈ నిబంధనని పెట్టారు. కాగా.. మూడేళ్ల తర్వాత హైదరాబాద్ ఉప్పల్ మైదానంలో అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ జరుగుతుండడంతో, దాన్ని ఆస్వాదించేందుకు ఫ్యాన్స్ ఇలా పోటెత్తారు.
