Chris Gayle Catch Video: వెస్టిండీస్ విధ్వంసకర బ్యాటర్, యూనివర్స్ బాస్ క్రిస్ గేల్ మరోసారి తనదైన శైలిలో అభిమానులను అలరించాడు. 47 ఏళ్ల వయసులోనూ తగ్గేదేలే అంటూ.. మైదానంలో అద్భుతమైన క్యాచ్ అందుకున్నాడు. వరల్డ్ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్ (డబ్ల్యూసీఎల్) 2026 ఫైనల్లో భాగంగా ఇంగ్లాండ్ ఛాంపియన్స్ బ్యాటర్ జో డెన్లీ ఇచ్చిన క్యాచ్‌ను గాల్లోకి ఎగిరిపట్టుకున్నాడు. దాంతో డెన్లీ గోల్డెన్ డక్‌గా పెవిలియన్‌కు చేరాడు. గేల్ పట్టిన క్యాచ్ మ్యాచ్‌కే హైలైట్‌గా నిలిచింది.
ఇంగ్లాండ్ ఛాంపియన్స్ ఇన్నింగ్స్‌లో ఎనిమిదో ఓవర్ ఐదో బంతికి క్రిస్ గేల్ అద్భుత క్యాచ్ అందుకున్నాడు. వెస్టిండీస్ బౌలర్ డ్వేన్ బ్రావో యార్కర్ లెంగ్త్‌లో వేసిన బంతిని జో డెన్లీ ఆడేందుకు ప్రయత్నించాడు. అయితే బంతి బ్యాట్‌కు తగిలి కవర్స్ వైపు వెళ్లింది. అక్కడే ఫీల్డింగ్ చేస్తున్న గేల్ క్షణాల్లో స్పందించి కుడివైపునకు డైవ్ చేస్తూ బంతిని అద్భుతంగా అందుకున్నాడు. దీంతో డెన్లీ ఒక్క పరుగు కూడా చేయకుండానే వెనుదిరిగాడు. క్యాచ్ అందుకున్న వెంటనే గేల్ సంబరాలు చేసుకున్నాడు. బౌలర్ బ్రావో వచ్చి అతడిని అభినందిస్తూ హత్తుకున్నాడు. ఈ వయసులోనూ గేల్ చూపించిన చురుకుదనం, అద్భుతమైన ఫీల్డింగ్ నైపుణ్యంపై సోషల్ మీడియాలో అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు.
ఫైనల్లో క్రిస్ గేల్ రెచ్చిపోయాడు. 14 బంతుల్లో ఓ ఫోర్, 2 సిక్సర్లతో 21 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. మరోవైయిపు డ్వేన్ బ్రావో బంతితో సత్తా చాటాడు. తన నాలుగు ఓవర్లలో 21 పరుగులిచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు. ఇంగ్లాండ్ కెప్టెన్ రవి బొపారాను 16 పరుగుల వద్ద, జో డెన్లీని డకౌట్‌గా, సమిత్ పటేల్‌ను మూడు పరుగుల వద్ద పెవిలియన్‌కు పంపాడు. మిగతా వెస్టిండీస్ బౌలర్లు కూడా తలో వికెట్ తీసి ఇంగ్లాండ్ బ్యాటర్లను కట్టడి చేశారు. టాస్ గెలిచిన వెస్టిండీస్ ఛాంపియన్స్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఇంగ్లాండ్ ఓపెనర్లు జేసన్ రాయ్ (7), డేవిడ్ మలన్ (2) త్వరగానే ఔటయ్యారు. అనంతరం మొయిన్ అలీ 39 బంతుల్లో నాలుగు ఫోర్లు, నాలుగు సిక్సర్లతో 60 పరుగులు చేసి జట్టును ఆదుకున్నాడు. ఒవైస్ షా 28 బంతుల్లో అజేయంగా 38 పరుగులు చేయడంతో ఇంగ్లాండ్ ఛాంపియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది.
160 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన వెస్టిండీస్ ఛాంపియన్స్ ఆరంభం నుంచే దూకుడుగా ఆడింది. క్రిస్ గేల్ 14 బంతుల్లో ఒక ఫోర్, రెండు సిక్సర్లతో 21 పరుగులు చేసి ఔటయ్యాడు. ఆ తర్వాత లెండిల్ సిమన్స్, చంద్విక్ వాల్టన్ కలిసి ఇంగ్లాండ్ బౌలర్లపై విరుచుకుపడ్డారు. రెండో వికెట్‌కు కేవలం 70 బంతుల్లోనే 123 పరుగుల అజేయ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. సిమన్స్ 53 బంతుల్లో ఎనిమిది ఫోర్లు, మూడు సిక్సర్లతో అజేయంగా 77 పరుగులు చేయగా.. వాల్టన్ 35 బంతుల్లో మూడు ఫోర్లు, నాలుగు సిక్సర్లతో నాటౌట్‌గా 58 పరుగులు సాధించాడు. దీంతో వెస్టిండీస్ ఛాంపియన్స్ 17 ఓవర్లలోనే ఒక వికెట్ కోల్పోయి 165 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది. తొమ్మిది వికెట్ల తేడాతో గెలిచి డబ్ల్యూసీఎల్ 2026 టైటిల్‌ను కైవసం చేసుకుంది.
What a catch from 47 years young man Chris Gayle 🔥 https://t.co/Nd9ygLOEu3
— Kashif (@KashifNdmCric) October 19, 2026

