NTV Telugu Site icon

Bou Samnang: శభాష్ సామ్నాంగ్.. ఆటలో ఓడినా ప్రపంచానికి స్ఫూర్తిగా నిలిచింది

Bou Samnang

Bou Samnang

Cambodian Runner Bou Samnang Inspires the World: ఏ క్రీడలో అయినా, గెలిచినవారినే హీరోలుగా పరిగణిస్తారు. కానీ.. ఓ యువతి మాత్రం ఆటలో ఓడి, ప్రపంచానికే స్ఫూర్తిగా నిలిచింది. గెలిచిన వారికంటే ఎక్కువగా పేరు, ప్రఖ్యాతలు గడించింది. కళ్లుచెదిరే రివార్డ్‌ని కూడా సొంతం చేసుకుంది. ఆ అమ్మాయి పేరే.. బౌ సామ్నాంగ్. రన్నింగ్ రేసులో తన ఓటమి ఖరారైనా, కుండపోతగా వర్షం కురుస్తున్నా.. ఆ యువతి మాత్రం ఆగలేదు. వర్షం ధాటికి తోటి అథ్లెట్లు తప్పుకున్నా.. సామ్నాంగ్ మాత్రం తన పరుగుని ఆపకుండా, లక్ష్యం దిశగా పరుగుు పెట్టింది. ఆమె పట్టుదలను చూసి.. మైదానంలో ఉన్న క్రీడాభిమానులు ఆమెకు మద్దతు ఇచ్చారు. ‘నువ్వు సాధించగలవు, పరిగెత్తు’ అంటూ ప్రోత్సాహించారు. చివరికి ఆమె లక్ష్యాన్ని చేరుకోగానే.. ప్రతిఒక్కరు నిలబడి చప్పట్లతో ఆమెను అభినందించారు. ప్రతిఒక్కరినీ కదిలించే ఈ అద్భుతం.. కంబోడియా రాజధాని నమ్ పెన్ నగరంలో జరిగిన సౌత్ ఈస్ట్ ఏషియన్ గేమ్స్‌లో చోటు చేసుకుంది.

Imran Khan: ఇమ్రాన్ ఖాన్‌కు బిగ్ రిలీఫ్.. బెయిల్ మంజూరు చేసిన కోర్టు..

ఆ గేమ్స్‌లో భాగంగా సోమవారం 5000 మీటర్ల రేసు నిర్వహించారు. ఈ రేసులో వియత్నాంకు చెందిన గుయన్ తి వోనా విజేతగా నిలిచింది. వర్షం పడటానికి ముందే ఆ యువతి రేసుని ముగించింది. ఇంతలో వర్షం మెల్లగా ప్రారంభమైంది. ఆ తర్వాత కుండపోతగా మారింది. దీంతో.. అథ్లెట్లు రేసులో నుంచి పక్కకు తప్పుకున్నారు. కానీ.. సామ్నాంగ్ మాత్రం మిగతావారిలాగా పక్కకు తప్పుకోలేదు. వర్షం అడ్డంకిగా మారినా.. లక్ష్యం దిశగా సాగిపోవాలన్న పట్టుదలతో రేసు కొనసాగించింది. అప్పటికే తాను ఈ రేసులో ఓడినా.. రేసు మాత్రం ఆపలేదు. దీంతో.. మైదానంలో ఉన్న ప్రేక్షకులు ఆమె పట్టుదలను మెచ్చుకొని మద్దతిచ్చారు. 22 నిమిషాల 52 సెకన్లలో తన రేసు పూర్తి చేసిన అనంతరం సామ్నాంగ్ ఎమోషనల్ అయ్యింది. తన దేశ జాతీయ జెండాతో అక్కడున్న వారికి అభివాదం చేసింది. తాను రేసులో ఓడినా.. కుండపోత వర్షంలోనూ రేసు కొనసాగించడంతో, ప్రేక్షకుల మనసు దోచుకుంది. ఇప్పుడు సోషల్ మీడియాలో ఆమె పేరు మార్మోగిపోతోంది. క్రీడ పట్ల తనకున్న అంకితభావాన్ని చూసి, ఆమెపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

Naga Chaitanya: కోలీవుడ్ డైరెక్టర్స్.. టాలీవుడ్ కు సెట్ కారా..?

సామ్నాంగ్ అంకితభావానికి ముచ్చటపడి.. కంబోడియా ప్రధాని హున్‌ సన్‌ ఆమెకు 10 వేల డాలర్లను రివార్డుగా ఇచ్చారు. ‘‘తాను ఓడిపోయినా, ఆ వర్షంలోనూ సామ్నాంగ్ రేసుని ఫినిష్ చేసింది. ఆమెని ప్రోత్సాహించేందుకే ఈ బహుమానాన్ని అందజేస్తున్నాం’’ అంటూ హున్ సన్ చెప్పుకొచ్చారు. ఈవెంట్ ఆర్గనైజేర్లు ఆమెకు 250 డాలర్ల బహుమానాన్ని అందించారు. అటు.. ఇంటర్నేషనల్‌ ఒలింపిక్‌ అసోసియేషన్‌ (ఐవోసీ) కూడా బౌ సామ్నాంగ్‌ను ఆకాశానికెత్తింది. ‘‘ఆమె రేసు ఓడిపోయి ఉండొచ్చు కానీ, తన అంకితభావంతో విజేతను మించిపోయింది’’ అంటూ క్యాప్షన్ జత చేసింది.