Ben Stokes Nightclub Drama: ఇంగ్లండ్ టెస్ట్ కెప్టెన్ బెన్ స్టోక్స్, సహచర ఆటగాడు గస్ అట్కిన్సన్ తీవ్ర వివాదంలో చిక్కుకున్నారు. న్యూజిలాండ్‌పై తొలి టెస్ట్ విజయం అనంతరం ఇద్దరూ జట్టు విధించిన నిబంధనలను (అర్ధరాత్రి కర్ఫ్యూ) ఉల్లంఘించి.. నైట్‌క్లబ్‌కు వెళ్లడంతో ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) విచారణ ప్రారంభించింది. బ్రిటిష్ మీడియా కథనాల ప్రకారం.. లండన్‌లోని చెల్సియా ప్రాంతంలోని ఒక నైట్‌క్లబ్‌లో స్టోక్స్, అట్కిన్సన్‌లు ఉన్న సమయంలో ఒక రగ్బీ అకాడమీ ఆటగాడితో వాగ్వాదం చోటుచేసుకుంది. ఆ సమయంలో ఆ రగ్బీ ఆటగాడు అట్కిన్సన్‌పై పంచ్ విసిరాడు. అయితే ఆ పంచ్ విధుల్లో ఉన్న ఈసీబీ భద్రతా సిబ్బందికి తగిలింది. దీంతో ఆ సెక్యూరిటీ గార్డుకు తీవ్ర గాయమై.. కుట్లు వేయాల్సి వచ్చింది.
బెన్ స్టోక్స్, అట్కిన్సన్ దాడికి పాల్పడినట్లు ఆధారాలు లేవని సమాచారం. ఇద్దరు క్రికెటర్లు ఘర్షణకు దిగలేదని ఈసీబీ వర్గాలు కూడా పేర్కొన్నాయి. అయితే కర్ఫ్యూ ఉల్లంఘించడంను మాత్రం జట్టు నిబంధనలకు వ్యతిరేకంగా ఈసీబీ పరిగణిస్తోంది. ఈసీబీ ఈ ఘటనను సీరియస్‌గా తీసుకుంది. ఇటీవల జట్టులో క్రమశిక్షణ సమస్యలు తలెత్తడంతో అర్ధరాత్రి కర్ఫ్యూ అమలు చేసింది. ఆ నిబంధనను ఉల్లంఘించిన నేపథ్యంలో స్టోక్స్ కెప్టెన్సీపై వేటు పడే అవకాశాలు ఉన్నాయి. రెండో టెస్ట్‌కు ముందు క్రికెట్ రెగ్యులేటర్ నివేదికల ఆధారంగా ఈసీబీ చర్యలు తీసుకునే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి.
ఈ ఘటనపై పూర్తి వివరాలని ఈసీబీ ఇంకా అధికారికంగా వెల్లడించలేదు. ఈసీబీ మరింత సమాచారం సేకరిస్తోందని, రెండో టెస్ట్ జట్టు ఎంపికకు ముందు తుది నిర్ణయం తీసుకునే అవకాశముంది. ఇప్పటివరకు వచ్చిన సమాచారం ప్రకారం.. భద్రతా సిబ్బందికి గాయమైన ఘటనలో స్టోక్స్ లేదా అట్కిన్సన్ నేరుగా దాడి చేసినట్లు నిర్ధారణ కాలేదు. కానీ జట్టు కర్ఫ్యూ నిబంధలను ఉల్లంఘించడం వల్ల ఇద్దరిపై కఠిన చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి.

