Ben Stokes Apology: నేను పెద్ద తప్పు చేశాను.. నన్ను క్షమించండి!

  • సహచరులకు క్షమాపణలు చెప్పిన బెన్ స్టోక్స్
  • న్యూజిలాండ్‌తో రెండో టెస్టుకు దూరమైన స్టోక్స్
  • కెప్టెన్‌గా జట్టుకు క్షమాపణ చెప్పాల్సిందే
  • తప్పు జరిగితే దాన్ని అంగీకరించాల్సిందే
Ben Stokes Apology

Ben Stokes Apology

Ben Stokes Apologises After Protocol Breach: ఇంగ్లండ్ టెస్టు కెప్టెన్ బెన్ స్టోక్స్ తన జట్టు సహచరులకు క్షమాపణలు చెప్పాడు. ఈ విషయాన్ని స్టోక్స్ స్వయంగా వెల్లడించాడు. జట్టు నిబంధనలను ఉల్లంఘించిన కారణంగా న్యూజిలాండ్‌తో జరిగిన రెండో టెస్టుకు దూరమైన స్టోక్స్.. తన ప్రభావం మొత్తం జట్టుపై పడిందని అంగీకరించాడు. సిరీస్ నిర్ణయాత్మక మూడో టెస్టుకు ముందు జరిగిన మీడియా సమావేశంలో స్టోక్స్ ఈ విషయాలను వెల్లడించాడు.

లార్డ్స్‌లో జరిగిన తొలి టెస్టులో విజయం సాధించిన అనంతరం బెన్ స్టోక్స్, పేసర్ గస్ అట్కిన్సన్‌తో కలిసి జట్టు కర్ఫ్యూ నిబంధనలను ఉల్లంఘించాడు. చెెల్సీలోని ఒక నైట్‌క్లబ్‌లో జరిగిన గొడవ అనంతరం వారిద్దరిపై ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) చర్యలు తీసుకుంది. స్టోక్స్, అట్కిన్సన్‌లను రెండో టెస్టు నుంచి తప్పించింది. ఈ వ్యవహారంపై ఈసీబీ, క్రికెట్ రెగ్యులేటర్ దర్యాప్తు చేపట్టినా చివరకు అధికారిక లిఖితపూర్వక హెచ్చరికతోనే సరిపెట్టాయి. స్టోక్స్ గైర్హాజరీలో జో రూట్ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టగా.. ఇంగ్లండ్ రెండో టెస్టులో 253 పరుగుల భారీ తేడాతో ఓటమి పాలైంది. అదే సమయంలో గాయంతో ఓలీ రాబిన్సన్, పితృత్వ సెలవుతో జేమీ స్మిత్ కూడా జట్టుకు దూరమయ్యారు. దీంతో జేమ్స్ ర్యూ, సోనీ బేకర్, జోర్డాన్ కాక్స్ టెస్టు అరంగేట్రం చేశారు.

×
×
Ad

ఈ పరిణామాలపై స్పందించిన బెన్ స్టోక్స్.. ఓ కెప్టెన్‌గా తన మొదటి బాధ్యత జట్టుకు క్షమాపణ చెప్పడమేనని తెలిపాడు. ‘ఈ ఘటన కేవలం నన్ను మాత్రమే ప్రభావితం చేయలేదు. జో రూట్, జట్టు సభ్యులు, జట్టు వెలుపల ఉన్న సిబ్బంది అందరిపై దీని ప్రభావం పడింది. ముఖ్యంగా అరంగేట్రం చేసిన యువ ఆటగాళ్లకు అది ప్రత్యేకమైన రోజు కావాలి. కానీ వారి తొలి టెస్టు కంటే ఈ వివాదమే ఎక్కువ చర్చనీయాంశమైంది. అందుకే అందరికీ క్షమాపణ చెప్పాను’ అని స్టోక్స్ తెలిపాడు.

నాయకుడిగా బాధ్యత వహించడం ఎంతో ముఖ్యమని, తప్పు జరిగితే దాన్ని అంగీకరించాల్సిందేనని బెన్ స్టోక్స్ పేర్కొన్నాడు. ‘అన్నీ సవ్యంగా సాగుతున్నప్పుడు నాయకత్వం వహించడం సులభం. కానీ తప్పు జరిగినప్పుడు కూడా బాధ్యత తీసుకోవాలి. ప్రభావితమైన ప్రతి ఒక్కరి కళ్లలోకి చూసి క్షమాపణ చెప్పే ధైర్యం ఉండాలి. నేను అదే చేశాను’ అని చెప్పాడు. ఈ ఘటన తర్వాత జట్టులో తన నాయకత్వంపై ఎలాంటి సందేహాలు ఉండకూడదని భావించిన స్టోక్స్.. మంగళవారం డ్రెస్సింగ్ రూమ్‌లో ఆటగాళ్లతో ప్రత్యేకంగా మాట్లాడినట్లు వెల్లడించాడు. ‘నేను మళ్లీ పూర్తిస్థాయి కెప్టెన్‌గా తిరిగి వచ్చానని జట్టుకు స్పష్టంగా చెప్పాను. చెప్పాల్సిన విషయాలు చెప్పాను. నా దృష్టి మొత్తం ఇప్పుడు జట్టు విజయంపైనే ఉందని వారికి తెలియజేశాను’ అని స్టోక్స్ వివరించాడు.

గత మ్యాచ్ ఫలితాన్ని మార్చలేమని, కానీ ఈ మ్యాచ్ (మూడో టెస్ట్) ఫలితాన్ని మాత్రం మార్చగలమని స్టోక్స్ చెప్పాడు. ‘మాకు విజయం చాలా అవసరం. వ్యక్తిగతంగా నాకు కూడా మంచి ఫలితం సాధించాలనే తపన ఉంది. జట్టుకు నేను పూర్తిగా అంకితభావంతో ఉన్నానని వారికి అర్థమయ్యేలా ప్రయత్నించాను’ అని స్టోక్స్ పేర్కొన్నాడు.

మూడో టెస్టుకు ఇంగ్లండ్ జట్టు:
బెన్ డకెట్, ఎమిలియో గే, జేకబ్ బెతెల్, జో రూట్, హ్యారీ బ్రూక్, జేమీ స్మిత్ (వికెట్ కీపర్), బెన్ స్టోక్స్ (కెప్టెన్), గస్ అట్కిన్సన్, జోఫ్రా ఆర్చర్, జోష్ టంగ్, షోయబ్ బషీర్.