టీమిండియాతో టెస్టు సిరీస్ కోసం గట్టిగా ప్రిపేరవుతోంది ఆస్ట్రేలియా జట్టు. ఇండియా గడ్డపై ఎలాగైనా సిరీస్ పట్టేయాలని చూస్తోంది. అందుకోసం చేయాల్సిన ప్రతి పని చేస్తోంది. సరిగ్గా ఇండియన్ టీమ్‌తో టెస్ట్ మ్యాచ్ ఎలా ఉంటుందో అలాంటి కండిషన్స్‌లోనే ప్రాక్టీస్ చేస్తోంది. వార్మప్ మ్యాచ్ వద్దనుకొని, ఆర్సీబీ టీమ్ సాయంతో బెంగళూరు దగ్గరలోని ఆలూర్‌లో స్పిన్ వికెట్లు తయారు చేయించుకొని ప్రాక్టీస్ కొనసాగిస్తోంది. తాజాగా టీమిండియా స్టార్ స్పిన్నర్ రవి అశ్విన్ బంతుల్ని ఎదుర్కొనేందుకు సరికొత్త వ్యూహంతో ముందుకెళ్తోంది. అచ్చం అశ్విన్ లాగే బౌలింగ్ చేస్తున్న మహేష్ పితియా అనే ఓ యువ బౌలర్‌తో నెట్స్‌లో ప్రాక్టీస్ చేస్తున్నారు ఆస్ట్రేలియా బ్యాటర్లు. రానున్న సిరీస్‌లో అశ్విన్‌తో ముప్పు తప్పదని ఆ టీమ్ ముందుగానే అంచనా వేస్తోంది. దీంతో అతనిలా బౌలింగ్ చేసే మహేష్‌ను ప్రత్యేకంగా రప్పించుకుంది.
మహేష్ పితియా ఎవరు?
మహేష్ పితియా ఓ స్పిన్ బౌలర్. అతనిది గుజరాత్‌లోని జునాగఢ్. అశ్విన్ స్పిన్ బౌలింగ్‌ను ఎదుర్కోవడంలో ఆస్ట్రేలియా బ్యాటర్లకు సాయం చేయడానికి అతడు బెంగళూరుకు వచ్చాడు. అశ్విన బౌలింగ్ యాక్షన్ ఎలా ఉంటుందో మహేష్‌ది కూడా అచ్చూ అలాగే ఉంది. నిజానికి తనకు 11 ఏళ్ల వయసు వచ్చే వరకూ కూడా అశ్విన్ బౌలింగ్‌ను మహేష్ చూడలేదు. ఎందుకంటే వాళ్ల ఇంట్లో కనీసం టీవీ కూడా లేదు. అయితే 2013లో తొలిసారి వెస్టిండీస్‌పై అశ్విన్ ఆడుతున్నప్పుడు అతన్ని చూసిన మహేష్.. అశ్విన్‌ను ఆదర్శంగా తీసుకొని స్పిన్ బౌలర్‌గా మారాడు. గతేడాది డిసెంబర్‌లో తన ఫస్ట్ క్లాస్ క్రికెట్ అరంగేట్రం చేశాడు. అతని బౌలింగ్ చూసి అప్పుడే చాలా మంది అశ్విన్‌తో పోల్చడం ప్రారంభించారు.
Steve Smith practiced Mahesh Pithiya bowling who's a quite similar bowler like Ashwin. #BorderGavaskarTrophy#INDvsAUS #INDvAUSpic.twitter.com/BVVadbk6RV
— Drink Cricket 🏏 (@Abdullah__Neaz) February 3, 2023
ఇక, ఈ విషయం తెలుసుకున్న ఆస్ట్రేలియా టీమ్.. అతన్ని ఆలూర్‌కు రప్పించింది. ఇక్కడ కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ ప్రత్యేకంగా మూడు స్పిన్ పిచ్‌లను ఏర్పాటు చేయించింది. వీటిలో ప్రతి పిచ్ రోజు గడిచే కొద్దీ ఎక్కువగా టర్న్ అవుతూ కనిపించింది. తమకు ప్రాక్టీస్ మ్యాచ్‌లో ఎలాగూ ఇలాంటి పిచ్‌సు ఇవ్వరని, అందుకే తాము వద్దనుకున్నట్లు ఆస్ట్రేలియా బ్యాటర్ స్టీవ్ స్మిత్ ఈ మధ్య చెప్పిన విషయం తెలిసిందే. కానీ ఆస్ట్రేలియా ఈ సిరీస్ కోసం సిద్ధమవుతున్న తీరు చూస్తుంటే మాత్రం బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ హోరాహోరీగా సాగడం ఖాయంగా కనిపిస్తోంది. 2012 నుంచి సొంతగడ్డపై సిరీస్ ఓడని టీమిండియా.. అదే జోరు కొనసాగించాలని చూస్తోంది.
Blockbuster Vs Netflix: ఓటమి అంచుల నుంచి.. విజయ తీరాలకు. తెలుసుకోవాల్సిన ‘బ్లాక్‌బస్టర్’ స్టోరీ