ఆంధ్రా క్రికెటర్, చెన్నై జట్టులోని టాప్ బ్యాట్స్మన్ అంబటి రాయుడు ఈరోజు (మే 14) మధ్యాహ్నం ఓ షాకింగ్ ట్వీట్ చేశాడు. ఇదే తనకి ఆఖరి ఐపీఎల్ సీజన్ అని, వచ్చే ఏడాది నుంచి తాను ఆడనని అందులో పేర్కొన్నాడు. 13 సంవత్సరాలపాటు సాగిన తన ఐపీఎల్ జర్నీలో.. తనకు ఆడేందుకు అవకాశాలిచ్చిన ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లకు కృతజ్ఞతలు తెలుపుకున్నాడు. ఆ రెండు గొప్ప జట్ల తరఫున ఆడిన తాను.. ఆ కాలాన్ని అద్భుతంగా గడిపానని ఆ ట్వీట్‌లో చెప్పుకొచ్చాడు. ఇది చూసిన నెటిజన్లు ఒక్కసారిగా ఖంగు తిన్నారు. ఉన్నట్టుండి రిటైర్మెంట్ ప్రకటించడం వెనుక కారణం ఏమై ఉంటుందా? అని గుసగుసలాడుకోవడం మొదలుపెట్టారు.
అయితే, కొన్ని నిమిషాల తర్వాత అంబటి రాయుడు మరో ట్విస్ట్ ఇచ్చాడు. ఆ ట్వీట్‌ని డిలీట్ చేశాడు. దీంతో, అసలు అతడు ఏం చెప్పాలనుకుంటున్నాడు? అని నెటిజన్లు గందరగోళానికి గురయ్యారు. అసలెందుకు రిటైర్మెంట్ ట్వీట్ చేశాడు? ఆ వెంటనే ఎందుకు డిలీట్ చేశాడు? అని చర్చించుకోవడం మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలోనే ఈ విషయంపై క్లారిటీ ఇచ్చేందుకు చెన్నై జట్టు సీఈఓ విశ్వనాథ్ రంగంలోకి దిగారు. తాను అంబటి రాయుడుతో మాట్లాడానని, అతడు రిటైర్ అవ్వట్లేదని స్పష్టం చేశారు. ఈ సీజన్‌లో అతడు తన ఆటతీరుతో అసంతృప్తిగా ఉన్నాడని, బహుశా ఆ అంసతృప్తితోనే పొరబాటుగా ఆ ట్వీట్ ఉంటాడన్నారు. కచ్ఛితంగా అతడు రిటైర్ అవ్వట్లేదని మరోసారి క్లారిటీ ఇచ్చాడు.
అంబటి రాయుడు ఇలాంటి షాకివ్వడం ఇదేం మొదటిసారి కాదు. గతంలోనే ఓసారి ఇలాగే వ్యవహరించాడు. 2019 ప్రపంచకప్ జట్టుకు తనని ఎంపిక చేయకపోవడంతో, తీవ్ర ఆగ్రహావేశాలకు గురై రిటైర్మెంట్ ప్రకటించాడు. అప్పట్లో తోటి క్రికెటర్ విషయంలో చేసిన 3D ట్వీట్ ఎంత దుమారం రేపిందో అందరికీ తెలిసే ఉంటుంది. అయితే.. ఆ తర్వాత రాయుడు మళ్ళీ తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెనక్కు తీసుకున్నాడు.