Most Expensive Final Delivery in T20 Cricket: టీ20 క్రికెట్ వచ్చాక ఆట స్వరూపమే పూర్తిగా మారిపోయింది. బ్యాటర్లు రెచ్చిపోయి ఆడుతున్నారు. సిక్సులు, ఫోర్లతో చెలరేగుతూ బౌలర్లకు చుక్కలు చూపిస్తున్నారు. బ్యాటర్ల దెబ్బకు బౌలర్లు భారీగా పరుగులు సమర్పించుకుంటున్నారు. ఒక్కోసారి ఒకే ఓవర్‌లో ఏకంగా 20-30 రన్స్ కూడా ఇచ్చుకుంటున్నారు. ఇది పెద్ద విషయం కాదు. అయితే ఒకే బంతికి 18 పరుగులు (18 Runs in 1 Ball) ఇచ్చుకోవడం మాత్రం సంచలనమే అని చెప్పాలి. ఈ ఘటన తమిళనాడు ప్రీమియర్ లీగ్ (టీఎన్‌పీఎల్) 2023లో చోటుచేసుకుంది.
టీఎన్‌పీఎల్ 2023లో భాగంగా మంగళవారం రాత్రి సలేమ్ స్పార్టాన్స్, చెపాక్ సూపర్ గల్లీస్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. చెపాక్ సూపర్ గల్లీస్ బ్యాటింగ్ చేస్తుండగా.. సలేమ్ స్పార్టాన్స్ కెప్టెన్ అభిషేక్ తన్వర్ చివరి ఓవర్ వేశాడు. క్రీజులో చెపాక్ బ్యాటర్ సంజయ్ యాదవ్ ఉన్నాడు. చివరి ఓవర్లోని మొదటి నాలుగు బంతులకు అభిషేక్ తన్వర్ కేవలం 6 పరుగులు మాత్రమే ఇచ్చాడు. ఐదవ బంతి నోబాల్ కాగా.. ఆ తర్వాత బంతికి ఒక పరుగు వచ్చింది. దీంతో ఐదు బంతుల్లో అభిషేక్ తన్వర్ మొత్తంగా ఎనిమిది పరుగులు ఇచ్చుకున్నాడు. ఇక్కడే అసలు కథ మొదలైంది.
చివరి బంతి వేసే క్రమంలో సలేమ్ స్పార్టాన్స్ కెప్టెన్ అభిషేక్ తన్వర్ అష్టకష్టాలు పడ్డాడు. ముందుగా నోబాల్ వేయగా.. ఆ తర్వాత కూడా నోబాల్ వేయగా సిక్సర్ వెళ్ళింది. తర్వాతి బంతి మళ్లీ నోబాల్.. ఈసారి రెండు పరుగులు వచ్చాయి. అనంతరం అభిషేక్ తన్వర్ వైడ్ బాల్ వేశాడు. ఎట్టకేలకు సరైన బంతి వేయగా.. అది సిక్సర్ వెళ్లింది. ఆఖరి బంతికి అభిషేక్ తన్వర్ మూడు నోబాల్స్, ఒక వైడ్ వేయడంతో పాటు రెండు సిక్సర్లు, రెండు పరుగులు ఇచ్చాడు. దాంతో అభిషేక్ తన్వర్ మొత్తంగా ఒక బంతి వేసి ఏకంగా 18 పరుగులు ఇచ్చాడు.
చివరి ఓవర్లో అభిషేక్ తన్వర్ ఏకంగా 26 రన్స్ ఇచ్చుకున్నాడు. చెపాక్ సూపర్ గల్లీస్ బ్యాటర్ సంజయ్ యాదవ్ చివరి ఓవర్లో 6 బంతులు ఆడి 18 పరుగులు చేశాడు. అభిషేక్ తన్వర్ వేసిన ఓవర్‌కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ‘Mufaddal Vohra’ అనే ట్విట్టర్ యూసర్ ఈ వీడియోని పోస్ట్ చేశాడు. ‘క్రికెట్ చరిత్రలో అత్యంత ఖరీదైన చివరి డెలివరీ – 20వ ఓవర్ చివరి బంతికి 18 పరుగులు’ అని ట్వీట్ చేశాడు. ఈ వీడియోకి నెట్టింట కామెంట్ల వర్షం కురుస్తోంది.
The most expensive final delivery in history – 18 runs from the last ball of the 20th over. pic.twitter.com/rf8b0wMhOw
— Mufaddal Vohra (@mufaddal_vohra) June 13, 2023