తెలుగు సినిమా పాటల తోటలో ‘సిరివెన్నెల’
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలుగు చిత్రసీమలో వెలసిన పాటలతోటలో ఎన్నెన్నో తేనెల వానలు కురిశాయి. అన్నీ తెలుగువారికి పరమానందం పంచాయి. ఈ తోటపై ‘సిరివెన్నెల’ కురిపించిన ఘనత మాత్రం సీతారామశాస్త్రిదే అని అందరూ అంగీకరిస్తారు. సీతారామశాస్త్రి పాటల్లోని పదబంధాలకు తెలుగు జనం ఆరంభంలోనే బందీలయిపోయారు. అప్పటి నుంచీ ఇప్పటి దాకా వందల పాటల్లో సిరివెన్నెల కురుస్తూనే ఉంది. నింగిలోని చంద్రుడు కురిపించే వెన్నెల ప్రపంచానికంతా పరిచయమే, నేలపైని చెంబోలు సీతారాముడు కురిపించే సిరివెన్నెల మాత్రం తెలుగువారికి మాత్రమే సొంతం. ఒకటా రెండా సీతారామశాస్త్రి పాటల సందడిలోకి ఓ సారి తొంగిచూశామో, ఆ పాటల మాధుర్యం తలపుల మునకలో అంత త్వరగా తెలవారదు.
వస్తూనే “విధాత తలపున ప్రభవించిన అనాది జీవనవేదం…” వినిపించారు సీతారామశాస్త్రి, ఆ వేదనాదం మోదం పంచింది, ఎల్లరి ఆమోదం పొందింది. అప్పటి నుంచీ సీతారాముని పాట కోసం తెలుగు సినిమానే కాదు, ప్రేక్షకులూ ఎదురుచూశారు. ఆ ఎదురుచూపులకు తగ్గ పదబంధాలతో పరవశింప చేసి, ‘నంది’ వర్ధనాలు అందుకోవడంలో తనకు తానే సాటి అనిపించారు. సీతారామశాస్త్రి కంటే ముందు ఎందరో కవిపుంగవులు తెలుగుపాటకు జనం మదిలో పట్టం కట్టారు. వారి పాటకు ప్రభుత్వం పట్టం కట్టే సమయానికి కొందరి ఇంటనే ‘నంది’ వర్ధనాలు పూశాయి. సీతారాముని రాకతో వరుసగా మూడేళ్ళు ఆయన పలికించిన పాటలకు పులకించి, నంది నడచుకుంటూ వెళ్ళింది. ఇప్పటి దాకా ‘నంది’ అవార్డుల్లో ‘హ్యాట్రికానందం’ పొందిన ఘనత సిరివెన్నెలదే! సీతారాముడు ఏకాదశ రుద్రుల ప్రియభక్తుడు కాబోలు పదకొండు సార్లు ఆయన ఇంట ఇప్పటికి నంది నాట్యం చేసింది. సహస్రఫణి శేషశయనునీ స్మరించే సీతారాముని ఇంట భవిష్యత్ లోనూ ‘నంది’ నర్తనం మరింతగా కొనసాగనుంది.
Also Read
- తెలంగాణ జలియన్‌వాలాబాగ్.. September 17 వేళ గూస్బంప్స్ తెప్పించే వీరుల చరిత్ర!
- Ganesh Utsav: ఇంటికే పరిమితమైన గణపతి గల్లీలోకి ఎలా వచ్చాడో తెలుసా? 1905 నాటి ఆ చరిత్ర ఇదిగో!
- Ayyappa Prasadam: శబరిమల అయ్యప్పస్వామి ప్రసాదం ఇంట్లోనే చేసుకోండిలా!
- Teachers Day Special: ద్రోణాచార్యుడి నుంచి వశిష్ఠుడి వరకు.. దేవతలు సైతం తలవంచిన 10 మంది మహా గురువులు వీరే!
“ప్రాణనాడులకు స్పందన నొసగిన ఆది ప్రణవనాదం…” అంటూ పండితుల ప్రశంసలు పొందిన సీతారాముని కలం, “తెల్లారింది లెగండోయ్… కొక్కురోకో…” అంటూ పల్లవించి పామరులకు మేలుకొలుపు పాడింది. “తెలవారదేమో స్వామీ… నీ తలపుల మునకలో అలసిన దేవేరి అలవేలు మంగకూ…” అంటూ పదమందుకుంటే పదకవితాపితామహుడే మళ్ళీ దిగివచ్చాడా అనిపించింది. “నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని… అగ్గితోటి కడుగు ఈ సమాజ జీవచ్ఛవాన్ని…” అంటూ ఆవేశంగా సీతారాముని కలం ఘీంకరించినప్పుడు ఎందరో మేధావులలో మథనం మొదలయింది. “అందెల రవమిది పదములదా…” అంటూ ఆరంభించగానే శ్రోతల ఆనందం అంబరమంటింది. “అర్ధశతాబ్దపు అజ్ఞానాన్ని స్వతంత్రమందామా? స్వర్ణోత్సవాలు చేద్దామా?” అంటూ సిరివెన్నెల ప్రశ్నించినప్పుడు కొన్ని ముఖాలు ఆశ్చర్యం పూసుకున్నాయి, మరికొన్ని ఆందోళన వేసుకున్నాయి. ఇంకొన్ని అవునంటూ ఆ వెన్నెలలో చిందులువేశాయి. వీధుల్లో విప్లవించే గళంలా కనిపిస్తూ, వేదంలోని నాదాన్ని వినిపిస్తూ, “దేవుడు కరుణిస్తాడని, వరములు కురిపిస్తాడని…” అంటూ భరోసానూ ఇచ్చింది సిరివెన్నెల కలం. నీదీ నాదీ అంటూ ఏదీ లేదు ఉన్నదంతా ఒక్కటే, అది అందుకోవాలంటే “జగమంత కుటుంబం నాదీ…ఏకాకి జీవితం నాది…” అన్న సత్యాన్నీ తెలిపింది. ఇందులో విరాగం కనిపించినా, యువతకు ప్రోత్సాహమిచ్చేలా “ఎందుకొరకు… ఎంతవరకు…” అంటూ కోరుకున్న ‘గమ్యం’వైపు సాగమనీ సీతారాముని కలం బోధించింది. పరికించి చూస్తే ఈ సిరివెన్నెలలో ఎన్నెన్నో జీవితసత్యాలు దొరుకుతాయి. వాటిని ఏరుకొనే ప్రయత్నంలోనే ఎందరో సీతారాముని పాటను పట్టుకొని, తెలుగు సినిమా పాటలతోటలోకి ప్రవేశిస్తూనే ఉన్నారు. అందరిపైనా ఆగకుండా ఈ ‘సిరివెన్నెల’ కురుస్తూనే ఉంది. తెలుగువారి మది మురిసిపోతూనే ఉంది. “వేడుకకు వెలలేదు… వెన్నెలకు కొలలేదు…” అన్నట్టు సీతారాముని ‘సిరివెన్నెల’ను ఎంతగా తలచుకున్నా కొంతే అవుతుంది. తలచుకున్న ప్రతీసారి ఆనందం మాత్రం మన సొంతం అవుతూనే ఉంటుంది.
(మే 20న సిరివెన్నెల సీతారామశాస్త్రి పుట్టినరోజు)
- Tags
తాజావార్తలు
-
Chairman’s Desk : తెలుగు ఇండస్ట్రీ పరిస్థితి ఏంటి? భారీ సినిమాలు వరుసగా అట్టర్ ఫ్లాప్స్!
-
WPL 2027: సంచలన నిర్ణయం తీసుకున్న ఆర్సీబీ.. విధ్వంసకర బ్యాట్స్‌మెన్ రిలీజ్..
-
OTR : పుంగనూరు స్థానిక సమరం రణరంగంగా మారుతుందా.?
-
OTR : ఖైరతాబాద్ బీజేపీ అభ్యర్థిగా చింతల రామచంద్రారెడ్డి.?
-
India-Pakistan: పాక్ గడ్డపై భారత అధికారులు.. ఇస్లామాబాద్‌లో మొదలైన హై-వోల్టేజ్ మీటింగ్! అసలు ఏం జరుగుతోంది?
ట్రెండింగ్
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!