Real Story Behind Tech Companies Layoffs: టెక్ కంపెనీలు అసలు లేఆఫ్‌లకు ఎందుకు పాల్పడుతున్నాయో తెలుసా?. పైకి చెప్పుకుంటున్న ఆర్థిక మందగమనం.. ఖర్చుల తగ్గింపు.. అదనపు సిబ్బందిని తొలగించుకోవటం.. ఇవేవీ కారణాలు కాదు. ఎందుకంటే.. ఉద్యోగులను తొలగించినంత మాత్రాన కంపెనీలు లాభపడినట్లు గతంలో ఎప్పుడూ రుజువు కాలేదు. పైగా.. స్టాఫ్‌ని ఉన్నపళంగా ఇంటికి పంపించటం వల్ల సంస్థలకు నష్టమే కలుగుతోంది.
అయినప్పటికీ అవి ఎందుకిలా చేస్తున్నాయంటే దీనికి ముఖ్యంగా 2 కారణాలు ఉన్నాయి. ఒకటి.. వాటాదారుల పెట్టుబడిదారీ విధానం. రెండు.. సామాజిక అంటువ్యాధి. వీటి గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. వాటాదారుల పెట్టుబడిదారీ విధానం అంటే.. షేర్‌హోల్డర్ క్యాపిటలిజం. 1976 నుంచి ఈ షేర్‌హోల్డర్ క్యాపిటలిజం అనేది పూర్తిగా మారిపోయింది.
read more: UPI LITE Payments: రూ.200 లోపు చెల్లింపులకు యూపీఐ లైట్‌ని ఇలా వాడాలి
అప్పటివరకు.. కంపెనీలను ముందుండి నడిపించిన ప్రొఫెషనల్ మేనేజర్లు తమ గురించే ఆలోచించుకునేవారు తప్ప సంస్థను స్థాపించిన నిజమైన యజమానుల ప్రయోజనాలను పట్టించుకునేవారు కాదు. దీంతో అప్పటినుంచి కంపెనీల బాధ్యతలను చేపట్టిన సీఈఓలు షేర్ హోల్డర్ల సంపదను పెంచటంపైనే మెయిన్‌గా ఫోకస్ పెట్టారు. దీంతో ఈ వాటాదారుల పెట్టుబడిదారీ యుగం మొదలైందని చెప్పొచ్చు.
షేర్‌హోల్డర్ క్యాపిటలిజంలో భాగంగా కంపెనీల స్టాక్ ధరల పెంపు పైనే ప్రధానంగా దృష్టిసారించారు. హెడ్జ్ ఫండ్ మేనేజర్ క్రిస్టోఫర్ హోన్ ఇటీవల ఆల్ఫాబేట్ కంపెనీకి రాసిన ఒక లెటర్ వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. ఆ లేఖలో అతను మరింత మంది ఉద్యోగులను తొలగించాలంటూ ఆల్ఫాబేట్ సంస్థకు సూచించినట్లు వార్తలు వచ్చాయి. అలా చేస్తే ఆ కంపెనీ షేర్ల వ్యాల్యూ మరింత పెరిగేదని క్రిస్టోఫర్ ఆశించాడు.
దీన్నిబట్టి ప్రస్తుతం లేఆఫ్‌లకు దారితీస్తున్న వాస్తవ పరిస్థితులను అర్థంచేసుకోవచ్చు. షేర్‌హోల్డర్ క్యాపిటలిజం అంటే ఇదేనని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ రోజుల్లో సీఈఓల శాలరీలను కంపెనీల స్టాక్ విలువల హెచ్చుతగ్గులతో ముడిపెడుతుండటం వల్ల వాళ్లు తప్పనిసరి పరిస్థితుల్లో మార్కెట్ ట్రెండ్స్ ఫాలో అవుతున్నారు. అంతేగానీ.. ఉద్యోగులను రాత్రికిరాత్రే తొలగించటం వల్ల సంస్థలకు దీర్ఘకాలంలో నష్టం వాటిల్లుతుందన్న విషయాన్ని మర్చిపోతున్నారు.
లేఆఫ్ ప్రకటనల అనంతరం సంస్థల స్టాక్స్ విలువలు పెరుగుతుండటం, షేర్‌హోల్డర్లు సంబరాలు చేసుకుంటూ ఉండటంతో సీఈఓలు తమ నిర్ణయం సరైందేననే భ్రమలోకి వెళ్లిపోతున్నారు. కంపెనీల రియల్ డేటాను పరిశీలిస్తే మాత్రం ఇందుకు భిన్నంగా ఉంటోంది. 1979లో అగ్రరాజ్యం అమెరికా ఆర్థికమాంద్యం దిశగా పయనిస్తున్న సమయంలో కూడా ఫార్చ్యూన్ 100 కంపెనీలు 5 శాతం కన్నా తక్కువ లేఆఫ్‌లను మాత్రమే ప్రకటించాయి.
అదే.. 1995కి వచ్చేసరికి.. ఇవే సంస్థలు ఏకంగా 45 శాతం మంది ఉద్యోగులకు పింక్ స్లిప్‌లు ఇచ్చాయి. ఆర్థికమాంద్యం వస్తుందనే భయం వల్లే సీఈఓలు ఈ నిర్ణయం తీసుకున్నారు. కానీ.. చివరికి అలాంటిదేమీ జరగకపోవటం గమనించాల్సిన విషయం. పాతికేళ్లు గడిచిపోయాక కూడా ఇప్పటికీ సీఈఓలు ఇదే అశాస్త్రీయ విధానాన్ని పాటిస్తున్నారు. గుంపులో గోవిందయ్యల్లాగా వ్యవహరిస్తున్నారు. దీన్నే.. స్టాన్‌ఫర్డ్ వర్సిటీ ప్రొఫెసర్ జెఫ్రీ పిఫెర్.. సామాజిక అంటువ్యాధిలా అభివర్ణించారు.
హైరింగ్ సమయంలో గానీ ఫైరింగ్ టైమ్‌లో గానీ కంపెనీల చేతిలో మస్తు డేటా ఉంటుంది. ఉద్యోగులను తీసుకోవాలా? లేక, ఉన్నోళ్లలో కొంత మందిని తీసేయాలా అనేది ఆ సమాచారాన్ని విశ్లేషిస్తే ఈజీగా తెలిసిపోతుంది. కానీ.. అలా చేయట్లేదు. మార్కెట్‌లోని ఇతర కంపెనీలు ఏ నిర్ణయం తీసుకుంటే దాన్నే ఫాలో అవుతున్నారు. జస్ట్.. కాపీ, పేస్ట్ పాలసీ ఫాలో అవుతున్నారు. లాజికల్‌గా, సైంటిఫిక్‌గా ఆలోచించట్లేదు. బుర్రకు పనిచెప్పట్లేదు.
అందుకే ఆ ప్రొఫెసర్ దీన్నొక సామాజిక అంటువ్యాధి అని ఉద్దేశపూర్వకంగానే అన్నారు. నిజం చెప్పాలంటే.. కంపెనీల చేతిలో ఎప్పుడూ డబ్బు పుష్కలంగానే ఉంటుంది. కానీ.. ఎందుకైనా మంచిదనే అతి ముందుజాగ్రత్త వల్ల లేఆఫ్ నిర్ణయాలు తీసుకుంటున్నాయి అని విశ్లేషకులు పేర్కొంటున్నారు. అన్ని సంస్థలూ ఉద్యోగులను తీసేస్తుంటే మేం మాత్రం ఎందుకు తీసేయకూడదనే అర్థం పర్థం లేని వాదన వినిపిస్తున్నాయి.
ఇంకో ముఖ్య విషయం.. ఉద్యోగులను పెద్ద సంఖ్యలో తొలగించటం వల్ల సంస్థలపై తక్షణం ఆర్థిక భారం పడుతోంది. తీసేసిన ఉద్యోగులకు వెంటనే కొన్ని చెల్లింపులు చేయాల్సి వస్తోంది. పైగా.. కొత్తవాళ్లను ఎక్కువ శాలరీ ఇచ్చి నియమించుకోవాల్సి ఉంటోంది. లేఆఫ్‌ల సందర్భంలోనే కాదు. కొత్త ఉద్యోగులను తీసుకునేటప్పుడు కూడా కంపెనీలు పక్క సంస్థలను చూసి తొందరపడుతున్నాయి. అంతేతప్ప వాస్తవానికి తమకు అదనపు సిబ్బంది అవసరమా లేదా అనేది ఆలోచించట్లేదు.
పోటీ కంపెనీలు ప్రతిభ కలిగిన అభ్యర్థులను హాట్ కేకుల్లా రిక్రూట్ చేసుకుంటుంటే మనం వెనకబడిపోతున్నామేమో అనే సందేహంలోకి జారుకొని అవసరం ఉన్నా లేకున్నా నియామకాలు చేపడుతున్నాయి. అటు.. లేఆఫ్ టైంలోను, ఇటు.. ప్లేస్‌మెంట్ల సమయంలోను.. రెండు సార్లూ తప్పటడుగులే వేస్తున్నాయి. ఈ లోటుపాట్లు జనానికి అర్థంకాకుండా ఉండేందుకు ఏవేవో వివరణలు ఇస్తున్నాయి. అదన్నమాట అసలు సంగతి.