PM Kisan Scheme Scam: కేంద్ర ప్రభుత్వానికి గత మూడేళ్లుగా 4 వేల కోట్ల రూపాయల భారీ నష్టం వాటిల్లింది. ఖజానా నుంచి ఇంత మొత్తాన్ని ఎవరు కొట్టేశారనుకుంటున్నారు?. బ్యాంక్ ఆఫీసర్లు కాదు. పేరు మోసిన వ్యాపారవేత్తలు అసలే కాదు. మరి ఈ రేంజ్‌లో డబ్బును ఎవరు కాజేశారు?. సంజీవని పర్వతం మాదిరిగా సర్కారు సంపదను హనుమంతుడు ఎత్తి పట్టుకుపోయాడా? (లేక) ఆలీబాబా అర డజను దొంగలు నొక్కేశారా?. లేదు. ఈ బిగ్ అమౌంట్‌ను పాకిస్థాన్ ఐఎస్‌ఐ గూఢచారి మెహబూబ్ రాజ్‌పుత్ దోచుకోలేదు. మన దేశానికే చెందిన మధ్యవర్తులు.. అవినీతిపరులు.. అది కూడా రైతుల రూపంలో కుంభకోణానికి పాల్పడ్డారు. ఆ స్కామ్ వివరాలేంటో చూద్దాం..
కేంద్రంలోని నరేంద్ర మోడీ గవర్నమెంట్ 2019లో లోక్‌సభ ఎన్నికలకు రెండు మూడు నెలల ముందు అంటే ఫిబ్రవరిలో పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పేరుతో ఒక పథకాన్ని ప్రారంభించింది. దీన్నే షార్ట్‌కట్‌లో పీఎం కిసాన్ అని కూడా అంటారు. ఇందులో భాగంగా ఐదెకరాల లోపు భూమి ఉన్న రైతులకు ఏడాదికి 6 వేల రూపాయలను 2 వేల రూపాయల చొప్పున మూడు విడతల్లో ఇస్తున్నారు. పేద రైతులకు అండగా ఉండటం కోసం, వాళ్ల ఆర్థిక కష్టాలను కొంచెమైనా తొలగించటం కోసం ఈ పథకానికి రూపకల్పన చేశారు. అయితే.. దీని కింద లబ్ధిపొందుతున్న రైతుల్లో ప్రతిఒక్కరూ అర్హులే అని చెప్పటానికి వీల్లేకుండాపోయింది.
ఇలాంటి పరిస్థితి ఏర్పడటానికి చాలా కారణాలు దారితీశాయి. ప్రభుత్వమే కొన్ని రూల్స్ రూపొందించి కొంత మంది రైతులను అనర్హులుగా ప్రకటించింది. మిగిలిన రైతుల్లో అర్హులను గుర్తించే అధికారాన్ని రాష్ట్ర ప్రభుత్వ అధికారులకు అప్పగించింది. పీఎం కిసాన్ పోర్టల్‌లో రైతులే సెల్ఫ్ రిజిస్టర్ చేసుకునే వీలు కల్పించారు. సెల్ఫ్ రిజిస్టర్ చేసుకోవటం రైతులకు కుదరకపోతే ప్రభుత్వం నియమించే అధికారి ఈ బాధ్యతలను నెరవేరుస్తాడు. అయితే.. ఈ నిబంధనల్లోని లోపాలను కొంత మంది తమకు అనుకూలంగా మలచుకున్నారు. అధికారులతో కుమ్మక్కై ఏజెంట్ల అవతారం ఎత్తారు.
ఈ నేపథ్యంలో నకిలీ రైతులు లబ్ధిపొందుతున్నట్లు వార్తలు వచ్చాయి. దీంతో రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే స్పందించి తగిన చర్యలు చేపట్టి డేటాబేస్‌లోని తప్పుడు ఎంట్రీలను తొలగించాయి. ఇలాంటి ఘటనలపై విచారణకు ఆదేశించి నిందితులను గుర్తించాయి. అయితే.. ఇంత జాగ్రత్తపడ్డప్పటికీ ఏకంగా 4 వేల కోట్ల రూపాయలకు ఎలా రెక్కలు వచ్చాయనే డౌటు మీకు రావొచ్చు. అందుకే ఇప్పుడు దాని గురించే చెప్పుకోబోతున్నాం. మోసగాళ్లు ఈ కుంభకోణానికి పాల్పడేందుకు పబ్లిక్‌గా అందుబాటులో ఉన్న డేటాబేస్‌ను వాడారు. ఫేక్ ఆధార్ కార్డులను క్రియేట్ చేసి దొంగ ఐడీలతో బ్యాంక్ అకౌంట్లు తెరిచారు.
పీఎం కిసాన్ పోర్టల్‌లో సెల్ఫ్ రిజిస్ట్రేషన్‌కి అవకాశం ఉండటంతో దళారులు ఇష్టమొచ్చిన ఫోన్ నంబర్లు ఇచ్చారు. అనుమానాస్పదమైన ల్యాండ్ రికార్డులను అప్‌లోడ్ చేశారు. అధికారులేమో సరిగా చూసీచూడకుండా ఆ కేటుగాళ్లను నిజంగానే కర్షకులు అనుకొని గుడ్డిగా ఆమోదం తెలిపారు. అస్సాం వంటి రాష్ట్రంలో సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి పొందటానికి అసలు ఆధార్ కార్డే అవసరంలేదు. దానికి బదులుగా బ్యాంక్ అకౌంట్ ఇస్తే సరిపోతుంది. బ్యాంక్ అకౌంట్‌నే యూనిక్ ఐడీగా పరిగణనలోకి తీసుకుంటున్నారు. అయితే.. ఈ వెసులుబాటును అలుసుగా తీసుకున్న కొందరు తెలివిగా ఒకటికి రెండు మూడు బ్యాంక్ అకౌంట్లు ఓపెన్ చేశారు.
పీఎం కిసాన్ పోర్టల్‌లో పలుమార్లు కొత్త బ్యాంక్ అకౌంట్లను ఎంటర్ చేస్తూ ప్రతిసారీ అప్రూవల్ పొందారు. అకౌంట్ నంబర్లను, ఐఎఫ్‌ఎసీ కోడ్‌లను తప్పుగా ఎంటర్ చేసినప్పుడు మాత్రమే వాటిని సిస్టమ్.. ఎర్రర్‌గా గుర్తించేది. ఒకే వ్యక్తి పేరు మీద నాలుగైదు బ్యాంకుల్లో అకౌంట్లు తెరిచి వాటిని పీఎం కిసాన్ పోర్టల్‌లో సరిగా ఎంటర్ చేస్తే సిస్టమ్ దొరకబుచ్చుకునేది కాదు. దీంతో కేటుగాళ్లకు మరింత సందు దొరికినట్లయింది. తమిళనాడులో అయితే మధ్యవర్తులే రైతుల అవతారం ఎత్తారు.
ఆ రాష్ట్రంలో చాలా మంది రైతులు పీఎం కిసాన్ పోర్టల్‌లోకి తమ సమాచారాన్ని నమోదు చేయించటానికి ప్రభుత్వ అధికారుల పైన, కాంట్రాక్ట్ వర్కర్ల మీద ఆధారపడ్డారు. దీంతో వాళ్లు తమకు నచ్చినవాళ్ల వివరాలను ఎంటర్ చేశారు. ఎందుకు? ఎంటి? అని అడిగితే కేంద్ర ప్రభుత్వం ‘కరోనా మనీ’ ఇస్తోందని, అందుకే మీ వివరాలను తీసుకుంటున్నామని నమ్మబలికారు. ప్రభుత్వ అధికారుల లాగిన్ డిటెయిల్స్‌తో ఎంటరై రైతుల దరఖాస్తులను ఆమోదించే ఎత్తుగడను విజయవంతంగా పూర్తి చేశారు. ఈ సందర్భంగా వాళ్లు ప్రజల నుంచి సర్వీస్ ఛార్జ్ రూపంలో లంచాలకు కూడా పాల్పడ్డారంటే పరిస్థితి ఎక్కడికి పోయిందో అర్థంచేసుకోవచ్చు.
పీఎం కిసాన్ పథకాన్ని జనరల్ ఎలక్షన్ల ముందు హడావుడిగా ప్రవేశపెట్టడంతో కొన్ని రాష్ట్రాల్లో స్థానిక నేతలు, దళారులు రాజకీయ ప్రయోజనాల కోసం దుర్వినియోగం చేశారు. రాత్రికి రాత్రే సర్వీస్ సెంటర్లను ఏర్పాటుచేసి రోజువారీ టార్గెట్లు పెట్టి మరీ డేటా ఎంట్రీ చేయించారు. అస్సాంలో దాదాపు ఎనిమిదిన్నర లక్షల మంది.. రైతుల పేరుతో 558 కోట్లను తమ జేబుల్లో నింపుకున్నారు. తమిళనాడులో సుమారు ఏడు లక్షల మంది 321 కోట్లను కొల్లగొట్టారు. కర్ణాటకలో 4 లక్షల మంది అనర్హులు 440 కోట్లను దండుకున్నారు. ఉత్తరప్రదేశ్‌లో 21 లక్షల మంది ఉత్తుత్తి రైతులు కోట్ల రూపాయలను తమ ఖాతాల్లో వేయించుకున్నారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మరియు అధికారుల నిర్లక్ష్యం వల్ల ఈవిధంగా 4 వేల కోట్ల రూపాయల ప్రజాధనం హారతి కర్పూరంలా కరిగి అనర్హుల ఖాతాల్లోకి చేరింది. ఆ విలువైన డబ్బును తిరిగి రాబట్టడమంటే కొండను తవ్వి ఎలుకను పట్టినట్లేననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇకనైనా సర్కారు ఇలాంటి లోటుపాట్లను నివారిస్తుందని ఆశిద్దాం. తాజాగా.. ఈ పథకం కింద 12వ విడత నిధులను ప్రధాని నరేంద్ర మోడీ దేశవ్యాప్తంగా ఉన్న రైతులకు విడుదల చేసిన సంగతి తెలిసిందే.