NTV Telugu Site icon

‘‘Bisleri’’ Ramesh Chauhan: మన దేశంలో మంచి నీళ్ల సీసాలకు మంచి ప్రజాదరణ తెచ్చిన వ్యక్తి

Bisleri Ramesh Chauhan

Bisleri Ramesh Chauhan

‘‘Bisleri’’ Ramesh Chauhan: ఈ రోజుల్లో మనం ఎక్కడికి వెళ్లినా పక్కన ఒక వాటర్‌ బాటిల్‌ ఉంచుకుంటున్నాం. మనం వెళ్లే చోట మంచి నీళ్లు ఉంటాయని తెలిసినప్పటికీ వాటర్‌ బాటిల్స్‌ను మర్చిపోకుండా పట్టుకెళుతున్నాం. ఇది ఇప్పుడు అందరికీ ఒక అలవాటుగా మారింది. అంటే.. మంచి నీళ్ల సీసాలకు మంచి ప్రజాదరణ వచ్చింది. అయితే.. మన దేశంలో ఇలా వాటర్‌ బాటిల్స్‌కి ఇంత పాపులారిటీ రావటం వెనక ఒక వ్యక్తి ఉన్నారు. ఆయనే.. రమేష్‌ చౌహాన్‌. ఈ వారం మన డిఫైనింగ్‌ పర్సనాలిటీ.

రమేష్‌ చౌహాన్‌.. బిస్లెరీ ఇంటర్నేషనల్‌ అనే సంస్థ చైర్మన్‌. బిస్లెరీ అనేది ఇండియాలో ఎక్కువ కాలంగా సేల్‌ అవుతున్న ప్యాకేజ్డ్‌ వాటర్‌ బ్రాండ్‌ అనే సంగతి తెలిసిందే. అయితే.. ఈ కంపెనీని అమ్మేస్తున్నారని, ఈ మేరకు పలువురు కొనుగోలుదారులతో చర్చలు జరుగుతున్నాయని లేటెస్టుగా వార్తలు వచ్చాయి. టాటా కన్జ్యూమర్‌ ప్రొడక్ట్స్‌ అనే సంస్థ ఇప్పటికే ఈ బిస్లెరీని కొనేసిందనే ప్రచారం బిజినెస్‌ సర్కిల్స్‌లో జరుగుతోంది. ఈ డీల్‌ విలువ 6 వేల నుంచి 7 వేల కోట్ల రూపాయల వరకు ఉందని కూడా అంటున్నారు. అయితే.. ఈ వార్తలను రమేష్‌ చౌహాన్‌ ఖండించారు.

read more: Digital Payments: ఇండియాలో డిజిటల్‌ చెల్లింపుల సంఖ్య 23 బిలియన్లు, విలువ రూ.38.3 లక్షల కోట్లు

బిస్లెరీ సంస్థ ప్రస్థానం.. 53 ఏళ్ల కిందట.. అంటే.. 1969లో ప్రారంభమైంది. రమేష్‌ చౌహాన్‌ లీడర్‌షిప్‌లో పార్లే కంపెనీ బిస్లెరీ మినరల్‌ వాటర్‌ని ఫెలిస్‌ బిస్లెరీ అనే సంస్థ నుంచి అక్వైర్‌ చేసుకుంది. ఇటలీకి చెందిన ఈ ఫెలిస్‌ బిస్లెరీ కంపెనీ యాజమాన్యం.. ఇండియాలో బాటిల్డ్‌ వాటర్‌ను మార్కెటింగ్‌ చేయలేక చేతులెత్తేసింది. చివరికి మన దేశాన్ని వదిలి వెళ్లాలని కూడా నిర్ణయించుకుంది. ఈ నేపథ్యంలో రమేష్‌ చౌహాన్‌కి సంస్థను అమ్మేసింది.

రమేష్‌ చౌహాన్‌ 1940వ సంవత్సరం జూన్‌ 17న జన్మించారు. జయంతిలాల్‌ మరియు జయా చౌహాన్‌ దంపతులకు ఈయన నాలుగో సంతానం. అమెరికాలోని మసాచుసెట్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీలో చదువుకున్నారు. మెకానికల్‌ ఇంజనీరింగ్‌ మరియు బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌లో డబుల్‌ మేజర్‌ అయిన రమేష్‌ చౌహాన్‌.. ఎడ్యుకేషన్‌ అనంతరం ఫ్యామిలీ బిజినెస్‌లో చేరారు. అమెరికా నుంచి ఇండియాకి తిరిగొచ్చిన వెంటనే కుటుంబ వ్యాపారంలో పాలుపంచుకోవటం ఆయనకు వ్యాపారంపై ఉన్న ఆసక్తికి నిదర్శనమని చెప్పొచ్చు.

22 ఏళ్ల చిన్న వయసులోనే ఫ్యామిలీ బిజినెస్‌ ఫీల్డ్‌లోకి అడుగుపెట్టిన రమేష్‌ చౌహాన్‌ వయసు ఇప్పుడు 82 సంవత్సరాలు. ఈ 60 ఏళ్లలో.. 50 ఏళ్లకు పైగా వ్యాపార రంగంలోనే ఉండి వెలకట్టలేని అనుభవాన్ని సొంతం చేసుకున్నారు. ఈ సుదీర్ఘ సమయంలో.. బిస్లెలి.. వేదిక.. థమ్సప్‌.. లిమ్కా.. గోల్డ్‌ స్పాట్‌ తదితర బ్రాండ్లను ప్రవేశపెట్టడమే కాకుండా వాటి బిజినెస్‌లను సక్సెస్‌ఫుల్‌గా నిర్వహించటం విశేషం.

బిస్లెరీ విషయానికొస్తే.. తొలినాళ్లలో ఈ బ్రాండ్‌ని విదేశీయులు మరియు ఎన్‌ఆర్‌ఐలు మాత్రమే ఎక్కువగా వాడేవారు. అయితే.. ఆ ట్రెండ్‌ని మార్చాలని రమేష్‌ చౌహాన్‌ భావించారు. అనుకున్నదే తడువుగా 5 రూపాయలకే వాటర్‌ బాటిల్‌ ఇవ్వటం మొదలుపెట్టారు. అర లీటర్‌ మంచి నీళ్ల సీసాని అతిచౌకగా అందుబాటులోకి తేచ్చారు. బాటిల్‌ సైజ్‌ చిన్నగా ఉండటం వల్ల క్యారీ చేయటం కూడా ఈజీ అయింది. ఈ రెండు ఐడియాలు బాగా క్లిక్‌ అయ్యాయి.

రమేష్‌ చౌహాన్‌ 1995లో అమల్లోకి తెచ్చిన ఈ రెండు ఆలోచనలను మన దేశ ప్రజలు మనస్ఫూర్తిగా ఆహ్వానించారు. బిస్లెరీని తక్కువ కాలంలోనే అక్కున చేర్చుకున్నారు. ఫలితంగా ఈ కంపెనీ బిజినెస్‌ అనూహ్యంగా, ఏకంగా 400 శాతం గ్రోత్‌ను నమోదు చేయటం గొప్ప విషయం. ఈ విజయం అనంతరం.. రమేష్‌ చౌహాన్‌.. కార్బొనేటెడ్‌ డ్రింక్స్‌ సెగ్మెంట్‌లోకి కూడా అడుగుపెట్టారు.

1977లో.. కోకా-కోలా కంపెనీ.. ఇండియన్‌ మార్కెట్‌ నుంచి నిష్క్రమించాలని నిర్ణయించుకున్న సమయంలో.. రమేష్‌ చౌహాన్‌ ఆధ్వర్యంలోని పార్లే సంస్థ.. కార్బొనేటెడ్‌ డ్రింక్స్‌ సెగ్మెంట్‌లోకి ప్రవేశించి కోలా డ్రింక్‌ థమ్సప్‌ను, లెమన్‌ ఫ్లేవర్డ్‌ డ్రింక్‌ లిమ్కాను మరియు ఆరెంజ్‌ ఫ్లేవర్డ్‌ డ్రింక్‌ గోల్డ్‌ స్పాట్‌ను మన మార్కెట్‌లో పరిచయం చేశారు.

1991లో.. భారతదేశంలో.. ఆర్థిక సరళీకరణ అనంతరం.. కోకా-కోలా కంపెనీ ఇండియాలోకి రీఎంట్రీ ఇచ్చింది. ఈ నేపథ్యంలో.. రెండేళ్ల తర్వాత.. పార్లే సంస్థ తన కార్బొనేటెడ్‌ డ్రింక్స్‌ సెగ్మెంట్‌ను అమ్మేసింది. థమ్సప్‌, గోల్డ్‌ స్పాట్‌, లిమ్కా, మాజా, సిట్రా బ్రాండలను కోకా-కోలా కంపెనీకి 60 మిలియన్‌ డాలర్లకు విక్రయించింది. ఆ సమయంలో థమ్సప్‌ 85 శాతం మార్కెట్‌ షేర్‌ను కలిగి ఉండటం గమనించాల్సిన అంశం.

రమేష్‌ చౌహాన్‌.. 2010లో.. వేదిక అనే బ్రాండ్‌నేమ్‌తో ప్రీమియం న్యాచురల్‌ మినరల్‌ వాటర్‌ సెగ్మెంట్‌కి సైతం ప్రవేశించారు. బిస్లెరీ వాటర్‌ బాటిల్‌ రేటు ఇప్పుడు 20 రూపాయలు కాగా వేదిక అనే బ్రాండ్‌ నేమ్‌ కలిగిన నీళ్ల సీసా ఖరీదు 47 నుంచి 49 రూపాయల వరకు ఉంది.

ప్రతి వ్యాపారవేత్త జీవితంలోనూ కనీసం ఒకటో రెండో ఫెయిల్యూర్స్‌ ఉన్నట్లే రమేష్‌ చౌహాన్‌ లైఫ్‌లోనూ ఒక వైఫల్యం ఉంది. 2016లో.. అంటే.. కార్బొనేటెడ్‌ డ్రింక్స్‌ మార్కెట్‌ నుంచి వెళ్లిపోయిన 23 ఏళ్ల అనంతరం.. రమేష్‌ చౌహాన్‌.. సాఫ్ట్‌ డ్రింక్‌ ఇండస్ట్రీలోకి బిస్లెరీని పునరాగమనం చేశారు. బిస్లెరీ లిమొనాట, బిస్లెరీ ఫోంజో, బిస్లెరీ పిన కొలాడ, బిస్లెరీ స్పైసీ పేర్లతో 4 కొత్త ఫిజ్జీ డ్రింక్స్‌ లాంఛ్‌ చేశారు. కానీ.. ఈ వ్యాపారం అంతగా విజయవంతం కాలేదు.

పార్లే సంస్థతో రమేష్‌ చౌహాన్‌ అనుబంధానికి 50 ఏళ్లు నిండిన సందర్భంగా ఆయన బయోగ్రఫీ విడుదలైంది. ఆ బుక్‌ పేరు.. ‘‘థండర్‌ అన్‌బాటిల్డ్‌.. ఫ్రం థమ్సప్‌ టు బిస్లెరి’’. ఈ పుస్తకాన్ని ప్యాట్రీసియా జే సేథి అనే జర్నలిస్ట్‌ రాశారు.